Friday, May 2, 2025
Homeట్రెండింగ్ న్యూస్అంగన్‌వాడీ చిన్నారులకు వేసవి సెలవులు

అంగన్‌వాడీ చిన్నారులకు వేసవి సెలవులు

– నేటి నుంచి నెలపాటు వర్తింపు
– హర్షం వ్యక్తం చేసిన అంగన్‌వాడీ యూనియన్లు
– సీఐటీయూ పోరాట విజయం : విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అంగన్‌వాడీ చిన్నారులకు గురువారం నుంచి ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. తల్లిదండ్రులు, అంగన్‌వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు తర్వాత సెలవులు ప్రకటించడం ఇదే తొలిసారి. బుధవారం హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ లో అంగన్‌వాడీ యూనియన్లతో డైరెక్టర్‌ కాంతి వెస్లీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెలవులు ప్రకటించాలనే నిర్ణయాన్ని ఆ శాఖ తీసుకున్నది. అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు టేక్‌ హౌం రేషన్‌ ద్వారా గుడ్లు, సరుకుల సరఫరా చేయనున్నది. సెలవు కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది. ఇంటింటి సర్వే, హౌం విసిట్స్‌, అంగన్‌వాడీలలో చేర్చాల్సిన వయస్సు ఉన్న చిన్నారుల గుర్తింపు, వారి కేంద్రాలకు పంపేలా తల్లిదండ్రులను ఒప్పించడం వంటి బాధ్యతలను అప్పగించనున్నది.
రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు : సీఐటీయూ
అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సునీత, పి.జయలక్ష్మి, ఉపాధ్యక్షులు కె.సమ్మక్క ధన్యవాదాలు తెలిపారు. ఇది సీఐటీయూ పోరాట విజయమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయంపై మార్చి నాలుగో తేదీన ప్రజావాణి ముట్టడించామనీ, మార్చి 17,18 తేదీల్లో 48 గంటల పాటు ధర్నా చేశామని గుర్తుచేశారు. ఏప్రిల్‌ 24న కలెకరేట్ల ముట్టడి చేశామని తెలిపారు. మంగళవారం ములుగు జిల్లాలో మంత్రి క్యాంపు ఆఫీసు ముందు కూడా ధర్నా చేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జాయింట్‌ మీటింగ్‌ నిర్వహించి మే నెలంతా సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇలాంటి నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img