– వర్థమాన దేశాలు అప్రమత్తంగా ఉండాలి
– చైనా బాధ్యత తీసుకోవాలి : జెఎన్‌యూ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అమెరికా అధ్యక్షులు ట్రంప్ టారిఫ్‌లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని జవహార్‌లాల్ విశ్వవిద్యాలయం రిటైర్ట్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. వర్థమాన దేశాలు అప్రమత్తంగా ఉండి అమెరికాపై మూకుమ్మడి పన్నులు విధిస్తే నిలదొక్కుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ట్రంపు టారిఫ్‌లతో ఆ దేశ ప్రజలూ అధికంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘ట్రంపు టారిఫ్‌ల యుద్ధం, పరిణామాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌కు ఎస్‌వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వకర్తగా వ్యవహరించగా సీనియర్ జర్నలిస్టు కొండూరి వీరయ్య అనువాదం చేశారు. ఈసందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ప్రపంచ ఆర్థికవ్యవస్థ దీర్ఘకాలికంగా సంక్షోభంలోకి వెళుతుందని హెచ్చరించారు. ఉత్పత్తి పడిపోతుందని చెప్పారు. కొత్త అవకాశాలు వెతుక్కోవాల్సి రావచ్చని వివరించారు. పరిశ్రమలు మూతపడతాయి, ఉపాధి పోతుంది, కొనుగోలు శక్తి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంపు ఇతర దేశాలపై పన్నులేయడంతోపాటు ఇతర అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. లోటును తగ్గించుకునే క్రమంలో ఆ దేశ విద్యాశాఖనే రద్దుచేశారని తెలిపారు. అన్నీ ప్రభుత్వ శాఖల నిధులకు కోతపెడుతున్నారనీ, వేలాది ఉద్యోగాలను రద్దు చేశారని గుర్తు చేశారు. దీంతో అమెరికా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ, భవిష్యత్తులో ఇవి మరింత పెరుగుతాయని అన్నారు. తద్వారా దేశీయంగా కొనుగోలు శక్తి ఉండదని వివరించారు. ఇప్పుడు చైనా వాణిజ్యపరంగా నాయకత్వ పాత్ర తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. బాధ్యతాయుత దేశంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. ట్రంపు టారిఫ్‌ల గురించి భారతదేశం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. వర్థమాన దేశాలకు ఇచ్చే రాయితీలు భారత్‌కు డబ్ల్యూటీవో ఇస్తున్నదనీ, ఇప్పుడు ట్రంప్ వాటిని రద్దుచేయాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఒకవేళ నిజంగానే రాయితీలు ఉపసంహరిస్తే వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఎరువుల ధరలు పెరుగుతాయనీ, ఉపాధి తగ్గిపోవడంతోపాటు కొనుగోలు శక్తి నశిస్తుందని పేర్కొన్నారు. మొత్తంగా ట్రంప్ వైఖరి భారతదేశాన్ని, ప్రపంచాన్ని విషవలయంలోకి నెడుతుందన్నారు. ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచే ఆయన మాటల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉందన్నారు. ఈనేపథ్యంలోనే బంగారం ధర పెరుగుతున్నదని గుర్తు చేశారు. ఉక్రెయిన్ పరిణామాలు కూడా కారణమేనని చెప్పారు. ప్రపంచ దేశాలపై ఆధారపడుతూ అమెరికా పరాన్నబుక్కుగా మారిందని విమర్శించారు. అమెరికా విషయంలో వర్థమాన దేశాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ట్రంప్ టారిఫ్‌లతోప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం
- Advertisement -
RELATED ARTICLES