సరదాగా మొదలై ఆ తర్వాత బానిసై జేబులు గుల్ల
రహస్య ప్రదేశాలు, శివారు ప్రాంతాలు, అపార్ట్మెంట్లో, లాడ్జీలే అడ్డాలు
ఆకర్షితులవుతున్న యువకులు
ఛిద్రమవుతున్న కుటుంబాలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లాలో పేకాట జోరుగాసాగుతున్నది. సరదాగా మొదలై ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తున్నది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ప్రాంతాలలో విచ్చలవిడిగా పెరిగిన ఈ సంస్కృతి, ఇప్పుడు పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోకి సైతం వ్యాపించింది. యువత కూడా బానిసలవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పట్టుబడితే సాధారణ కేసుల కారణంగా పేకాటకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించాల్సిన యువకులు అడ్డదారులు తొక్కుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్, పేకాట, ఆన్‌లైన్ గేమ్స్ వంటివి ఆడుతూ లక్షలాది రూపాయలను నష్టపోతున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా అప్పులు చేస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు డ్రగ్స్, మద్యం వంటి అలవాట్లకు బానిసలుగా మారుతూ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఈ తరహా యువకుల సంఖ్య గత కొన్నాళ్లుగా పెరుగుతోంది. చెడు స్నేహాలు, అలవాట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వారిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వరకూ ఉండడం గమనార్హం. నగర, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా చిన్న వయసులోనే బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొదట తక్కువ మొత్తంతో ప్రారంభిస్తున్నారు.
ఆ మొత్తాన్ని రాబట్టుకునే ప్రయత్నంలో వేలు, లక్షలు పోగొట్టుకుంటున్నారు. అందుకోసం దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నారు. జిల్లాలోని శివారు ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతోంది. కూర్చున్న చోటనే సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొంత మంది జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఆశకుపోయి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ జూదం యథేచ్ఛగా సాగుతోంది. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప, నిఘాపెట్టి పేకాట స్థావరాలపై పోలీసులు దాడిచేసిన సంఘటనలు తక్కువే. జూదం సరదాగా మొదలెడితే అదే
వ్యసనంగా మారుతోంది. ఒక్కసారి అలవాటైతే ఇక మన కథ కంచికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ బెట్టింగ్లో రాజ్యమే నడుస్తోంది. పేకాట మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలను అడ్డాగా లక్షలు, కోట్ల రూపాయల పేకాట ఆడుతూ ఆన్లైన్ లో సైతం ఆడుతూ బెట్టింగులు సైతం జరుగుతున్నాయి. బెట్టింగుల్లో నష్టపోయిన యువకులు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.పేకాట, మత్తు పదార్థాల వలన అనేక జీవితాలు చిన్న భిన్నం అయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
చిన్న పిల్లలు అనాధలుగా మారారు. జీవన ఆధారంగా ఏదో ఒక వృత్తి చేస్తూ ప్రవృత్తిగా పేకాటను ఎంచుకొని గ్రామ సమీపం బావులు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాలు, చెట్లు గుట్టలు పేకాటకు స్థావరాలుగా మార్చుకుంటున్నారు. నిత్యం రాత్రి మొదులుకొని తెల్లవారుజాము వరకు ఫోన్లు ఆఫ్లైన్లో పెట్టి పేకాట ఆడుతున్నారు. కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఫోన్లు చేసిన ఎత్తకపోవడంతో పాటు ఫలానా డ్యూటీకి వెళ్లాను, ఫలానా పనికి వెళ్లాను పైగా జవాబు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. రాత్రి కూడా అక్కడనే నిద్రపోయి చట్ట విరుద్ధమైన పనులకు ఒడి కడుతున్నారు. దీంతో పాటు డ్రగ్స్, మందు పానీయాలకు అలవాటు పడుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారు ఎక్కువ శాతం నిమగ్నమై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
నిజామాబాద్ నుంచి విలాస జీవితానికి అలవాటు పడ్డ కొంత ఉపశమనం కావడానికి గ్రామీణ ప్రాంతానికి, ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు పేకాట కోసం వెళ్తున్నారు. కొందరు వ్యవసాయ క్షేత్రాలను, పౌల్ట్రీ ఫారాలను, మేకల ఫారం తదితర వాటిని ఏర్పాటు చేసుకొని అక్కడే తెలిసిన వ్యక్తులను రప్పించుకొని పేకాట ఆడుతున్నారు. రహస్య ప్రదేశాలు, శివారు ప్రాంతాలు, అపార్ట్మెంట్లో,
లాడ్జీలే అడ్డాలుగా పేకాట ఆడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మాస్తున్నారు. నిజామాబాద్ తో పాటు మహారాష్ట్ర నుంచి చివరి బెంగళూరు వరకు అనేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, మహారాష్ట్ర ప్రాంతంలో సైతం మరో వంద వరకు నిర్వాహకులు ఉంటున్నట్లు తెలిసింది. సుమారుగా 10 నుండి 50 కు పైగా వ్యవసాయ క్షేత్రాలు ఇక్కడ ప్రాంతంలో ఉన్నాయి. పోలీసులు తరచుగా దాడులు చేస్తూ అనేక కేసులు నమోదు చేసిన పేకాట మాత్రం ఆగడం లేదు. కొంత రాజకీయ పలుకుబడి సైతం పేకాట వెనుక ఉండటం అరెస్టు చేయగానే క్షణాల్లో నామమాత్రం కేసులను నమోదు చేసి నాయకుల ఒత్తిడికి వదిలేస్తున్నారు అని సమాచారం. పేకాటలో ఉద్యోగులు, వ్యాపారులు కాకుండా రాజకీయ నాయకులు కూడా చాలా చోట్ల పేకాటలో భాగస్వామ్యం అవుతున్నారు. పేకాట, మట్కా జూదాలు సైతం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.
బోధన్ పట్టణంతో పాటు, ఆర్మూర్ మండలాల్లోని పలు గ్రామాలలో, బోధన్ పట్టణ శివారులోని పేకాట కేంద్రాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆర్మూర్ ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకొని మరి పేకాట ఆడుతూ రెచ్చిపోతున్నారు. ఇక జిల్లా కేంద్రంలో ఎక్కడపడితే అక్కడ అపార్ట్మెంట్లో, మైదానాలు, పలు ప్రాంతాలను ఆడ్డాలుగా చేసుకొని మరి పేకాట ఆడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తాం: నిజామాబాద్ ఏసిపి రాజ వెంకటరెడ్డి
జిల్లాలో ఎక్కడైనా జూదం ఆడుతున్నట్లు సమాచారం వ కచ్చితంగా దాడులు చేసి వారిపై కేసులు నమోదు చేస్తాం అని నిజామాబాద్ ఏసీబీ రాజ వెంకటరెడ్డి తెలిపారు. ఎంతటివారైనా పట్టుబడితే వదిలే ప్రసక్తి లేదు. జూదం ఆడుతున్న సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. తమ చుట్టుపక్కల ఎక్కడైనా పేకాట ఆడితే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలి.పేకాట రాయుళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా పోలీసులు అక్కడికి వెళ్లి కేసులు నమోదు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇండ్లను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వకుండా పోలీసులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇతర రాష్ర్టాలకు వెళ్లి పేకాడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పేకాట ఆడినా, వాటిని ఆడించిన సం బంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పేకాట ఆడి కుటుంబాలను జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. పోలీస్ కళాబృందం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కళాశాలలలో విద్యార్థులకు పేకాట వల్ల జరిగే నష్టాన్ని క్లుప్తంగా వివరిస్తున్నామన్నారు.