Monday, July 21, 2025
E-PAPER
Homeదర్వాజతెలంగాణ ప్రాతినిధ్య కవిత్వం

తెలంగాణ ప్రాతినిధ్య కవిత్వం

- Advertisement -

ఒక బాలకార్మికుడు భాషా పండితునిగా ఎదిగిండు. రాత్రి పాఠశాలలో దిద్దుకున్న అక్షరాలు, పగలు గొర్లు కాసే సమయంలో మననం చేసుకునేవాడు. రాత్రి పాఠశాల పంతులు ఈ పిల్లగాని చురుకుతనం చూసి, తల్లిదండ్రిని ఒప్పించి, పక్క ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినాడు. ఆ విధంగా కూకట్ల తిరుపతి అక్షరయాత్ర ప్రారంభమయింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితునిగా పని చేస్తున్నాడు.
ఇప్పటివరకు ఈయన 6 కవితా సంపుటులు, ఒక బాల వాచకం, ఒక వ్యాసాల పుస్తకాన్ని ప్రచురించినాడు.
‘మొలాటు’ కవిత్వం వ్యవసాయ నాగరికత, యాదవుల కులవత్తి అయిన గొర్ల కాపరి నేపథ్యం నుండి వెలువడింది. కుటుంబంలో మొదటి విద్యావంతుడు కావడం వలన గ్రామీణ జీవితం అనుభవాలు, అనుభూతుల తాజాతనాన్ని ఈ సంపుటిలో సంపుటీకరించిండు.
బాల్యం అందరికి తీపి గుర్తుగా మిగులుతుంది. గ్రామీణ జీవితంలోని బాల్య స్మతులు వైవిధ్య భరితంగా ఉంటాయి. ‘ఇత్తునం’ కవి బాల్య స్మతులకు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ”ఎదుటివారికి అవలీలగా కట్టెలమోపు నెత్తిమీదికి ఎత్తడం, పెయ్యి నిండ విబూది పూసుకొని కొర్రి చీమలు కుట్టకుండా మామిడి కాయలు తెంపడం, అడవిలో దొరికే అనేక పండ్లను తిన్న రుచి, చేపలు పట్టేటప్పుడు జెల్లలు చేతులకు ఇరిసిన ముండ్లు, ‘ర్యాక పడితే… ఒక దమ్ముకే బింకిని బోర్లేసిన మొస్సెతనం’, ‘రసమయమైన జీవితానికి పసితనమే నిదర్శనమైనది” అంటడు కవి.
పెట్టుబడిదారి పూర్వ దశలోని గ్రామాల్లో వ్యవసాయం, చేతి వత్తులు ఒకదానికి మరొకటి పూరకంగా, పోషకంగా పని చేసేవి. ఆనాటి ఉమ్మడి కుటుంబంలో కూడా సామూహికత ఉండేది. ‘పాయిరం గల్ల యిల్లు’ కవితలో ‘గూనపెంకల యిల్లు’, ‘వాయిలి పొరకలతోని కట్టిన జీవాల దొడ్డి’, దేవుని అర్ర, తలస్నానం చేయనిదే దానిలో అడుగు పెట్టని పరిస్థితి, గోలెంల కశికెలు ఇట్లా ప్రకతిలో దొరికిన వస్తు సంచయాన్ని అవసరానికి ఉపయోగించుకుని ప్రజలు జీవించేది. మార్కెట్‌ ఇంకా అక్కడ ప్రవేశించలేదు.
తల్లి అడవికి వ్యవసాయ పనులకు పోయి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో, ప్రకతిలో దొరికిన కాయలు పండ్లు పిల్లలు తినడానికి ఒడిలో వేసుకొని వచ్చేది. ఆమె రాకకోసం పిల్లలు ఎదురు చూసేది. ‘ఎనగర్ర’ కవితలో..
”నీ ఒడి గుమ్మిల/ పలారమోలె పచ్చి పల్లికాయల గుత్తులు/ కమ్మకమ్మటి పాల కంకుల కళ/ ఆకలిని చల్లార్చే పెసరుకాయల పేర్మి”.
తల్లి ఒడిని గుమ్మితోని పోల్చడం వ్యవసాయ నాగరికత ప్రభావమే. ఆధునిక వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల విధాన నిర్ణయాలు, అవి చూపించే వ్యతిరేక ప్రభావాల మీద నాలుగు కవితలు రాసిండు కవి. అవి : 1.బువ్వ చెట్టు, 2.సాలెన్క సాలు, 3.ఆ పాదాలకు పబ్బతులు, 4.బుగులు మొగులు.
వ్యవసాయంలో పెట్టుబడిదారి సంబంధాలు ప్రవేశించిన తర్వాత రైతు మార్కెట్‌ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అన్నీ కొనవలసిన వస్తువులు. దున్నడం, నాట్లు వేయడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, పంటకోసి మార్కెట్లో అమ్ముకోవడం. ఈ పనులు చేయడానికి కూలీలు అవసరం ఉంటుంది.
చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం చేస్తే కూలి కూడ గిట్టుబాటు కాని కాలం దాపురించింది. అందులో మార్కెట్‌ శక్తుల మోసాలు కూడా మూల్గే నక్క మీద తాటిపండై పడుతయి.
”కల్తీ ఇత్తుల కత్తుల సోల్తులు/ నకిలీ మందుల మకిలి/ నెత్తురు కొత్తలు నెమరేయడానికి/ ఒత్తుగా ఇర్సుక పడిన నల్ల జెనిగెలు” (బువ్వచెట్టు), (నల్ల జెనిగెలు – చీకటి వ్యాపారులు).
ఈ పరిస్థితుల్లో ‘గిట్టుబాటు గాక గిలగిల తన్నుక చస్తుండు రైతు (సాలెన్క సాలు)
2018లో నాసిక్‌ నుండి ముంబయి వరకు దాదాపు 70 వేల మంది రైతులు, 200 కి.మీ పాదయాత్ర చేసి మహారాష్ట్ర విధానసభను దిగ్భంధం చేసినారు. దీనికి రైతుల ‘లాంగ్మార్చ్‌’ అని పేరు. రైతులు పంటలకు నష్టపరిహారం, పోడు భూములకు పట్టాలు, రుణమాఫి, స్వామినాథన్‌ కమీషన్‌ సిఫారసుల అమలు ఈ పాదయాత్ర ప్రధాన డిమాండ్లు. ఈ ఉద్యమానికి వామపక్షాలు నాయకత్వం వహించినాయి. ‘ఆ…. పాదాలకు పబ్బతులు” కవితను రైతుల పాదయాత్రను కీర్తిస్తూ రాసిండు కవి.
”నాసిక్‌ గుట్టల నుండి ముంబయి బస్తీ దనుక/ వరద పోటెత్తిన గోదారోలె/ శాంతి అతారెలా సైరిక దండయాత్ర/ ………./ తుంగల తొక్కి పెట్టిన…./ స్వామినాథుని ఇగురాల చిగురులకయి”.
రైతు పంట ఉత్పత్తి వ్యయం కంటే 50% అదనంగా పంటలకు కనీస మద్ధతు ధర ఇయ్యాలని సిఫారసు చేసింది స్వామినాథన్‌ కమిటీ. దీని అమలు రైతుల డిమాండ్లలో ఒకటి. విధానసభను దిగ్బంధం చేసి, ప్రభుత్వం రైతుల డిమాండ్లను అమలు చేయడానికి హామీ ఇచ్చినంకనే, వారు ఆందోళనను విరమించినారు.
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు 2020లో తీసుకు వచ్చింది. వాటి సారాంశం ఇప్పటివరకు తమ పంటలను అమ్ముకోవడానికి ఉన్న మండి వ్యవస్థ (వ్యవసాయ మార్కెట్‌ కమిటీ లాంటిది) రద్దు. రైతు ధాన్యం ఎంతైనా నిల్వ ఉంచుకోవచ్చు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చు.
ఈ చట్టాలు కార్పోరేట్లకు అనుకూలంగా ఉన్నాయని పంజాబు, హర్యాన, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఆందోళనకు దిగి ట్రాక్టర్లతో ఢిల్లీ నగరాన్ని ముట్టడించినారు. ఈ ఉద్యమం మీద కవి ‘దిగులు మొగులు’ కవిత రాసిండు.
”గిట్టుబాటు గొట్టె కాయైన తావుల్ల/ కనీస మద్ధతు ధరకు దస్త్రం దస్కతుండదు/ ………./ ”పాత పుండ్ల సలపరింతల నడుమ/ మూడు కొత్త రాచపుండ్ల మంట రాజుకుంది”
నరేంద్ర మోడి విదేశాల్లో ఉన్న నల్లడబ్బును తీసుకువచ్చి ప్రతి పౌరుని ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని వాగ్ధానం చేసినాడు.
”ఉప్పు సంద్రాల ఆవల/ ఉప్పు పాతర్లల్ల నలుపు సొమ్ము/ …………./ కొండను తవ్వి తీసుకుంట/ ఎల్కన్కెనా పట్టుకోని బడాయితనం”
జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని కతువాలో 8 సంవత్సరాల ఆసిఫా అనే బాలికను అపహరించి, దేవాలయంలో బంధించి వారం రోజులు చెరచి చంపిన ఘటన మీద ‘ఆసిఫా’ కవిత రాసిండు కవి.
”తల్లి గర్భాన్ని చీల్చిన చీడపురుగులు/ పసి దేహంపై మనుబోతుల/ మతోన్మాదపు మసిగాయాలు/ మనింటి ముందటి పందిరి గుంజకు తలుగుతో కట్టెయ్యాలె”
ఇంకా ఈ సంపుటిలో స్మతి గీతాలు, తెలంగాణ గతవైభవాన్ని కీర్తిస్తూ రాసిన కవితలు, తెలంగాణ వచ్చినంక ప్రభుత్వంలో చేరి ప్రజలకు దూరమైన పాటను గురించి రాసిన కవితలు ఉన్నాయి.
ఈ కవికి జీవితం, కవిత్వం వేరు కాదు ఒక్కటే. భాష, భావనలు, అభివ్యక్తి అంతా ఈ కవి తెలంగాణ పల్లె జీవితం నుండి తీసుకున్నాడు, దానికి పట్టం కట్టినాడు.
– కందుకూరి అంజయ్య, 9490222201

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -