Monday, July 21, 2025
E-PAPER
Homeఆటలుఆకాశ్‌, అర్ష్‌దీప్‌ ఔట్‌?

ఆకాశ్‌, అర్ష్‌దీప్‌ ఔట్‌?

- Advertisement -

– గాయాల పాలైన భారత పేసర్లుొ
– యువ పేసర్‌ అన్షుల్‌కు పిలుపు

‘టెండూల్కర్‌-అండర్సన్‌’ ట్రోఫీ సమం చేసేందుకు సిద్ధమవుతున్న టీమ్‌ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ. బర్మింగ్‌హామ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్‌ దీప్‌.. అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌లు గాయాల బారిన పడ్డారు. ఆకాశ్‌ గజ్జల్లో గాయంతో బాధపడుతుండగా.. అర్ష్‌దీప్‌ చేతికి గాయమైంది.
నవతెలంగాణ-మాంచెస్టర్‌
మాంచెస్టర్‌ టెస్టుకు సన్నద్ధమవుతున్న భారత్‌కు బౌలింగ్‌ బెడద పట్టుకుంది. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌, పని భారం సమన్వయం కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మూడు మ్యాచులే ఆడాల్సి ఉంది. మూడు టెస్టుల్లో రెండింట ఆడిన బుమ్రా.. చివరి రెండు టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌లోనే బరిలోకి దిగనున్నాడు. స్టార్‌ పేసర్‌ లేకుండా కీలక రెండు టెస్టుల్లో వికెట్ల వేట సాగించటంపై భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే తికమక పడుతుండగా.. ఫామ్‌లో ఉన్న ఆకాశ్‌ దీప్‌, బెంచ్‌పై ఉన్న అర్ష్‌దీప్‌ సింగ్‌లు ఏక కాలంలో గాయాల బారిన పడ్డారు. దీంతో మాంచెస్టర్‌ టెస్టులో టీమ్‌ ఇండియా పేస్‌ బౌలింగ్‌ దళంపై ఆందోళన నెలకొంది.

ఇద్దరూ కష్టమే..!
యువ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ బర్మింగ్‌హామ్‌ టెస్టులో 10 వికెట్లు పడగొట్టాడు. విజయంలో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్‌ టెస్టులో ఒక్క వికెటే పడగొట్టిన ఆకాశ్‌ దీప్‌ లయ అందుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. మూడో టెస్టులోనే ఆకాశ్‌ దీప్‌ అసౌకర్యంగా కనిపించాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఫిజియో సాయం తీసుకున్నాడు. వైద్య పరీక్షల్లో ఆకాశ్‌ దీప్‌ గజ్జల్లో గాయానికి గురైట్టు తేలింది. దీంతో నాల్గో టెస్టులో అతడు ఆడేది అనుమానంగా మారింది. మరోవైపు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అనూహ్యంగా గాయం బారిన పడ్డాడు. లార్డ్స్‌ టెస్టు అనంతరం లండన్‌లోని ఓ గ్రౌండ్‌లో టీమ్‌ ఇండియా సాధన చేసింది. ఈ సందర్భంగా బౌలింగ్‌ చేస్తుండగా అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌ ఆర్మ్‌కు గాయమైంది. చేతి గాయానికి కుట్లు ఏమైనా వేశారా? లేదా అనేది స్పష్టత లేదు. కానీ అర్ష్‌దీప్‌ సైతం మాంచెస్టర్‌ టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. బుధవారం నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ నాల్గో టెస్టు ఆరంభం కానుండగా.. సోమవారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు ఓ ఆటగాడు లేదా సహాయక సిబ్బంది రానున్నారు. మీడియా సమావేశంలో ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ గాయం, నాల్గో టెస్టుకు అందుబాటుపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

సిరాజ్‌పై పని భారం?
భారత పేస్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ ఒక్కడే తొలి మూడు టెస్టుల్లో ఆడాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్‌.. లీడ్స్‌, లార్డ్స్‌ టెస్టుల్లోనూ రాణించాడు. పేసర్లలో అందరి కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ప్రసిద్‌ కృష్ణ రెండు టెస్టులు, ఆకాశ్‌ దీప్‌ రెండు టెస్టులు, జశ్‌ప్రీత్‌ బుమ్రా రెండు టెస్టులు ఆడారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ ఓ టెస్టులో ఆడాడు. దీంతో మహ్మద్‌ సిరాజ్‌ పని భారంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచన చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సిరాజ్‌కు విశ్రాంతి లభించే అవకాశాలు కనిపించటం లేదు.

అన్షుల్‌కు పిలుపు
ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ గాయాల బారిన పడగా.. యువ పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌ (24)కు సెలక్టర్లు పిలుపు అందించారు. భారత్‌-ఏ తరఫున ఇంగ్లాండ్‌-ఏతో రెండు అనధికార టెస్టుల్లో ఆడిన అన్షుల్‌.. ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. రెండో టెస్టులో నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు తనుశ్‌ కొటియన్‌తో కలిసి అజేయంగా 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బంతిని పిచ్‌పై బలంగా సంధించి.. అదనపు బౌన్స్‌ రాబట్టడంలో అన్షుల్‌ దిట్ట. మాంచెస్టర్‌ పరిస్థితుల్లో అన్షుల్‌ బౌలింగ్‌ శైలికి గిల్‌సేనకు ఉపయుక్తంగా సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్షుల్‌ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -