న్యూఢిల్లీ : దేశంలో మలేరియాను రూపుమాపడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అడ్‌ఫాల్కివాక్స్ అనే బహుళ-దశల స్వదేశీ రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఐసీఎంఆర్ దాని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, భువనేశ్వర్(ఆర్‌ఎంఆర్‌సీబీబీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్(ఎన్‌ఐఎంఆర్) ద్వారా బయో టెక్నాలజీ విభాగం-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ(డీబీటీ-ఎన్‌ఐఐ) భాగస్వామ్యంతో అడ్‌ఫాల్సీవాక్స్ అనే రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అడ్‌ఫాల్సీవాక్స్ అనేది మలేరియాను కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న రెండు క్లిష్టమైన దశలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన మొట్టమొదటి చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ మానవులను మలేరియా సంక్రమణ నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తున్నట్టు గుర్తించింది. ఐసీఎంఆర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ దశలో మంచి ఫలితాన్ని చూపింది. ఇప్పటికే ఉన్న సింగిల్-స్టేజ్ వ్యాక్సిన్‌ల కంటే అడ్‌ఫాల్సీవాక్స్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నట్టు ప్రీ-క్లినికల్ డేటా చెబుతోంది. ఇది మానవుల్లో మెరుగైన దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని పెంచి..మలేరియా నిర్మూలనకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన దశలోనే ఉంది. ఇంకా మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు.