– ముంచుకు రానున్న వరదలు
– పట్టించుకోని పాలకులు
– గోదావరిలో కలుస్తున్న పంట పొలాలు
నవతెలంగాణ -ఏటూరు నాగారం ఐటీడీఏ
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం గ్రామం ప్రతి వర్షాకాలంలోనూ వరదలకు ముంపునకు గురవుతూ ప్రజలను అతలాకుతలం చేసేది. జంపన్న వాగు వరద ప్రవాహం కరకట్టకు తగలకుండా.. వరద నీరు గ్రామంలోకి రాకుండా రాయితో సుమారు అర కిలోమీటర్ మేర పొడవు, వంద మీటర్ల వెడల్పుతో ఐదు చోట్ల ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాతి కట్టడాలు నిర్మించారు. ఎక్కేల నుంచి ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడ ప్రాంతం వరకు కరకట్టను కూడా నిర్మించారు. అప్పటి నుంచి జంపన్న వాగులో వరద ఉధృతి ఎంత పెరిగినా రాతి కట్టడాలు అడ్డుకుంటున్నాయి. అయితే, ఓడవాడ నుంచి జంపన్న వాగు గోదావరి వరదలు ఆనుకుని ప్రవహించడంతో కరకట్ట అక్కడి నుంచి కోతకు గురవుతూ ప్రమాదకరంగా మారింది. అయినా అధికారులకు, పాలకులకు పట్టింపు లేదు. నిధులున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. కొద్ది రోజుల కిందట గోదావరి వరద రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికతో ప్రవహించింది. రానున్న రోజుల్లో వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహించే అవకాశాలున్నాయి. 1986లో గోదావరి వరద బీభత్సం సృష్టించింది. సుమారు 50 గ్రామాలు తాకిడికి గురయ్యాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మరికొన్ని గ్రామాల్లో ఇండ్లు నీట మునిగి నేలమట్టమయ్యాయి. కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఈ సంవత్సరం కార్పెట్ షీట్లతో ప్రయోగం
ఈ ఏడాది ఇరిగేషన్ శాఖ అధికారులు కొత్త ప్రయోగాన్ని కనిపెట్టారు. కరకట్టకు కార్పెట్ షీట్లు కప్పి చోద్యం చూస్తున్నారు. జియో ట్యూబ్‌ల ప్రతిపాదన అమలుకు నోచుకోకపోవడంతో.. ఇప్పుడు కరకట్ట కోతకు గురికాకుండా మలేషియా నుంచి తెప్పించిన కార్పెట్ షీట్లను పరుస్తున్నారు. వాటిపై ఇసుక బస్తాలను వేశారు. ఇది కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట అనే సామెతను గుర్తు చేస్తోంది. గోదావరి వరద తాకిడికి గుట్టలు సైతం కొట్టుకుపోతుంటే ఈ షీట్లు ఎలా ఆగుతాయో అర్థం కాని పరిస్థితి. ఇలా ప్రతి సంవత్సరం తాత్కాలిక మరమ్మతులు చేపడుతూ లక్షల రూపాయల నిధులను ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిపాలు చేస్తున్నారు. అయినా లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. దీనితో ఇరిగేషన్ శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు.
తాత్కాలిక మరమ్మతులతో నిధులు నీటి పాలు
గోదావరి వరదల నుంచి రక్షణ కోసం నిర్మించిన కరకట్ట డేంజర్ జోన్‌గా మారింది. లోతట్టు ప్రాంతాలు సురక్షితంగా ఉండాలని గతంలో గోదావరి తీరం వెంబడి దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇది కోతకు గురవుతూ ప్రమాదకరంగా మారింది. తాత్కాలిక మరమ్మతులు చేసినా ఉపయోగం లేకపోవడంతో దానికి వెచ్చించిన నిధులన్నీ నీటిపాలవుతున్నాయి. మరోపక్క రీ డిజైనింగ్ పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండగా ముంచుకొస్తున్న వరదలతో పంటపొలాలకు ముప్పు వాటిల్లుతోంది.
తాత్కాలిక మరమ్మతులతో కాలయాపన
కరకట్టను మరింత పటిష్టం చేయడానికి గత సంవత్సరం నీటిపారుదల శాఖ రూ. 70 లక్షలు కేటాయించింది. పలు ప్రాంతాల్లో ఎక్కడైతే కరకట్ట కోతకు గురైందో అక్కడ తాత్కాలికంగా కొత్తగా జియో ట్యూబ్ కంటైనర్లను ఏర్పాటు చేశారు. ఇవి కూడా పూర్తిస్థాయిలో చేయకపోవడంతో ఈ ప్రతిపాదన కూడా విఫలమైంది.
ఆ పనులకు ఇప్పటికీ ఆమోదం లభించలేదు. మంగపేట మండలంలోని పొదుమూరుకు చెందిన రైతుల పంట పొలాలు, ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం రామ్ నగర్ ప్రాంతాలకు చెందిన పంట పొలాలు కోతకు గురవుతూ ప్రతి ఏటా పంటలు గోదావరిలో కలిసిపోతున్నాయి. ఇలా భూములు నీటిలో కలవడంతో రైతులు కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
డేంజర్ జోన్‌లో గోదావరి కరకట్ట
- Advertisement -
- Advertisement -