Thursday, May 1, 2025
HomeUncategorizedతెలంగాణ, ఏపీ అసెంబ్లీ సీట్ల పెంపుపైసుప్రీం తీర్పు రిజర్వ్‌

తెలంగాణ, ఏపీ అసెంబ్లీ సీట్ల పెంపుపైసుప్రీం తీర్పు రిజర్వ్‌

– 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సిందే
– కేంద్రం తరఫున ఏఎస్‌జీ వాదనలు
– రెండు రాష్ట్రాలకూ అత్యంత ప్రాధాన్యంగా సీట్ల పెంపు అంశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు పునర్విభజన ప్రక్రియను ప్రారంభించే విధంగా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రొఫెసర్‌ కె. పురుషోత్తం రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసు రాజకీయ, రాజ్యాంగ దృష్ట్యా రెండు రాష్ట్రాలకూ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలిచింది.
ఈ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26ని అమలు చేయడానికి ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను మినహాయించి, కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలను మాత్రమే డీలిమిట్‌ చేయడం అసమంజస మైనదనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 2022లో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతిస్పందనలను కోరింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు జమ్మూకాశ్మీర్‌తో సమానత్వాన్ని కోరుతున్నారని వాదించారు. జమ్మూకాశ్మీర్‌ కోసం చేపట్టిన డీలిమిటేషన్‌ కసరత్తును ఎత్తి చూపుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జమ్మూకాశ్మీర్‌ కోసం నియమించబడిన ఏకైక కమిషన్‌ డీలిమిటేషన్‌ కమిషన్‌ అని అన్నారు. ఈ కమిషన్‌ నోటిఫికేషన్‌లో రాష్ట్రాలను చేర్చడం, మినహాయిం చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్న ఎన్నికల కమిషన్‌ అఫిడవిట్‌ను న్యాయవాది ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా సమాధానం దాఖలు చేయలేదని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం వైఖరితో ఏకీభవిస్తూ.. జస్టిస్‌ సూర్యకాంత్‌ ”ఎన్నికల కమిషన్‌ సరైనదే, వారు ఆదేశాన్ని మాత్రమే పరిష్కరించగలరు” అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) కె.ఎం నటరాజ్‌ వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం ఈ ప్రక్రియ 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సి ఉంటుందని వివరించారు. డీ లిమిటేషన్‌ అనేది రాత్రికి రాత్రే చేపట్టలేని ఒక భారీ కసరత్తు అని అన్నారు. పిటిషనర్‌ లేవనెత్తిన జమ్మూకాశ్మీర్‌ డీలిమిటేషన్‌ యూటీ విషయంలో జరిగిందని ఏఎస్‌జీ తెలిపారు.
గతంలో కూడా..
డాక్టర్‌ పురుషోత్తమ్‌ రెడ్డి తన పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సెక్షన్‌ 26ను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ నిబంధనను అమలు చేయాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ విషయంపై గతంలో కూడా సుప్రీంకోర్టులో చర్చలు జరిగినప్పటికీ, తాజా విచారణ చర్చనీయాంశంగా మారింది.
విచారణలో కీలక అంశాలు
జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కె.సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విస్తృతంగా విచారించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదిస్తూ.. రెండు రాష్ట్రాల్లో జనాభా వృద్ధి, భౌగోళిక అవసరాల ఆధారంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం తప్పనిసరి అని ప్రస్తావించారు. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ సీట్లు, ఏపీలో 175 స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్యను పెంచితే, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి, రాజకీయ ప్రాతినిధ్యం మరింత సమర్థవంతంగా ఉంటుందని వాదించారు.
ఇది సంక్లిష్టమైన ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ఎన్నికల సంఘం తమ వైఖరిని సమర్థించుకుంది. రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 170 ప్రకారం 2026 తరువాత జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని వాదించింది. అంతకుముందు సీట్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ అవసరమనీ, ఇది సంక్లిష్టమైన ప్రక్రియ అని వివరించింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున ఈ అంశంలో కేంద్రం ఆలస్యం చేయడం సమంజసం కాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
పిటిషన్‌ నేపథ్యం
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్‌ 26 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని చట్టం సూచిస్తుంది. ఈ నిబంధన అమలు చేయాలని కోరుతూ డాక్టర్‌ కె. పురుషోత్తమ్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ చట్టం ప్రకారం, రెండు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, రాజకీయ ప్రాతినిథ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల సంఖ్యను సమీక్షించి, పెంచాల్సి ఉంటుంది. అయితే, గత కొన్నేండ్లుగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో ఈ పిటిషన్‌ దాఖలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img