– సీఎం, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి : రామోజీ ఫిల్మ్ సిటీ ఇండ్ల స్థలాల సాధన కమిటీ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండ్ల స్థలాల సాధనకు మరో పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్ పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో నిర్వహించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఇండ్ల స్థలాల సాధన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగన్‌పల్లి సర్వేనెంబర్ 189, 203లో దాదాపు 700 మంది పేదలకు ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చారన్నారు. గత మార్చి 26న లబ్దిదారులందరూ ఇంటి స్థలాల దగ్గరికి వెళ్లగా.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి మహిళలని కూడా చూడకుండా చెదరగొట్టారని తెలిపారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి ఇంటి స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు చెప్పారన్నారు. కానీ నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదన్నారు. ఎన్నికల ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చి.. ఇప్పుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. అంతేకాక, తమ పార్టీ బృందం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సందర్భంగా త్వరలోనే అక్కడ సర్టిఫికెట్ ఉన్న పేదలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే లబ్దిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గ్రామాల వారీగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి దశల వారీగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. గ్రామాల వారీగా నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇండ్ల స్థలాలు సాధించే వరకూ పోరాటం ఆగదని, సీఎం ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గ రాములు, ఇండ్ల స్థలాల సాధన కమిటీ కన్వీనర్ జగన్, రాయపోల్ మాజీ ఎంపీటీసీ నీరుడు భిక్షపతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాల కోసం మరో పోరాటానికి సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES