Monday, July 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభద్రత లేని బతుకులు

భద్రత లేని బతుకులు

- Advertisement -

– ‘గోపాలమిత్ర’ల గోడు వినేదెవరు..?
– పశువుల వైద్య సేవల్లో ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదు
– అరకొర వేతనం.. అది సైతం పెండింగ్‌
– సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం

గోపాలమిత్ర.. పేరుకు గొప్ప పోస్టుగా కనిపిస్తున్నా వారి జీవనం మాత్రం దుర్భరంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నా.. వారి బతుకులకు మాత్రం భద్రత లేకుండా పోయింది. పశువులకు గర్భధారణ, టీకాలు వేసే క్రమంలో పశువుల దాడిలో గాయాలపాలవుతున్నారు. ప్రాణాంతక టీకాలను తరలిస్తూ పశువులకు అందజేస్తున్నారు. ఊర్లకు వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నారు. ఇంత చేస్తున్నా వారికి వచ్చేది అరకొర వేతనమే. ఆ వేతనం కూడా నెలలుగా పెండింగ్‌లో పెడుతున్నారు. తమ గోడును సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 25 ఏండ్లుగా పని చేస్తున్న తమను ప్రభుత్వం ఎప్పటికైనా రెగ్యూలర్‌ చేయకపోదా అన్న ఆశతో పని చేస్తున్నామని గోపాలమిత్రలు వాపోతున్నారు.

నవతెలంగాణ-భిక్కనూర్‌
గోపాలమిత్రలను 2000వ సంవత్సరంలో నియమించారు. ప్రధానంగా పశువులకు గర్భధారణ టీకాలు వేసేందుకు ఒక గోపాల మిత్ర చొప్పున మొత్తం 1530 మందిని రాష్ట్రవ్యాప్తంగా నియమించారు. ప్రస్తుతం 1484 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2000 సంవత్స రంలో వీరిని నియమించినా.. 2005 సంవత్స రంలో గౌరవ వేతనం అమల్లోకి వచ్చింది. 2014లో రూ.3500, 2017లో రూ.8500, 2022లో రూ.11050 జీతం చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పల్లెల్లో ప్రస్తుతం పాడి పశువులకు టీకాలు, నట్టల నివారణ, గాలికుంటు టీకాలు, కృత్రిమ గర్భాధారణ, వ్యాధి నివారణా టీకాలు సైతం వీరే వేస్తున్నారు.
అరకొర వేతనం.. పది నెలలుగా పెండింగ్‌
వీరికి ప్రస్తుతం గౌరవ వేతనం కింద రూ.11,050 ఇస్తున్నప్పటికీ అవి కూడా ప్రతినెల ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం 10 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండగా.. తాజాగా శనివారం నాలుగు నెలల వేతనం వారి ఖాతాల్లో జమచేయడం గమనార్హం. ప్రతినెలా వేతనాలు సక్రమంగా రాకపోవడంతో పిల్లల స్కూల్‌ ఫీజులకు, ఇంట్లో నిత్యావసరాలకు వడ్డీలకు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 25 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు చేస్తున్నా.. ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.
ప్రమాదాల్లో పలువురు మృతి
పశువులకు అత్యవసర పరిస్థితి తలెత్తిన సమయంలో రైతులు ఫోన్‌ చేసే అర్ధరాత్రి.. అపరాత్రి.. అనే తేడా లేకుండా వెంటనే వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఇలా వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురై పలువురు గోపాల మిత్రలు చనిపోయారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు. పశు వైద్య సేవలకు వెళుతున్న సమయంలో సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢకొీని గోపాలమిత్ర మరణించారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఒకరు అంగవైకల్యానికి గురయ్యారు. కామారెడ్డి జిల్లాలో విద్యుత్‌ షాక్‌ తగిలి గోపాలమిత్ర మరణించారు. ఇన్నేండ్ల తమ సర్వీసులో ఇలా ప్రమాదాల బారినపడి చనిపోతే బాధిత కుటుంబాలను పలకరించాల్సిన ప్రభుత్వం నుంచి కనీసం పలకరించే దిక్కు లేదని.. ఆర్థికంగా ఆదుకున్న ఘటనలు లేవని వాపోతున్నారు.
భద్రత లేదు.. పదోన్నతులు రావు
రాష్ట్రంలో అత్యధికంగా పశువులు, హైబ్రిడ్‌ జాతి పశువులు ఉన్నాయి. కనీసం సెల్‌ఫోన్‌ సౌకర్యం కూడా లేని ప్రాంతాలు, గుట్టల వద్ద పశు వైద్య సేవలకు వెళ్లడానికి సరైన రహదారులు లేని మహబూబ్‌నగర్‌ జిల్లాలో వైద్య సేవలు అందించడంలో గోపాల మిత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన హెచ్‌ఎస్‌, ఎస్‌ఎండీ, బ్రుసెల్సిస్‌ వ్యాక్సిన్‌ సైతం పశువులకు గోపాల మిత్రులే తమ ప్రాణాలను పణంగా పెట్టి వేస్తున్నారు. ఇంత చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత కల్పిం చడం లేదని, ఏండ్లుగా సేవ చేస్తున్నా తమకు పదోన్నతులు సైతం కల్పించడం లేదని వాపోతున్నారు.
2017లో అప్పటి ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు నిర్వహించినా.. గోపాల మిత్రులకు ఎలాంటి పర్సంటేజ్‌ లేని కారణంగా చాలామంది గోపాల మిత్రులు ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంతాల్లోనే పశు వైద్య సేవలు చేస్తున్నారు. కనబడిన ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, జిల్లా కలెక్టర్లకు తమ సమస్యను పట్టిం చుకోండి అని వేడుకుంటున్నా గోపాల మిత్రులపై 25 సంవత్సరాలుగా కనికరం చూపడం లేదని వాపోతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, శ్రీహరి, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీకి సైతం వినతిపత్రాలు అందజేసినా ఇప్పటికీ తమకు ఎలాంటి భరోసా కల్పించలేదని వాపోతున్నారు. తమ గోడు పట్టించుకొని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
గోపాల మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి. మరణించిన గోపాల మిత్రుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఉద్యోగ అవకాశం కల్పించాలి. సీనియర్‌ గోపాల మిత్రులకు పదోన్నతి కల్పించాలి.
-సిహెచ్‌ శ్రీనివాస్‌ గోపాలమిత్ర.
రాష్ట్ర గోపాలమిత్ర అధ్యక్షుడు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -