Thursday, May 1, 2025
Homeజాతీయంమే 1 నుంచి పలు కీలక మార్పులు..చార్జీల పెంపు

మే 1 నుంచి పలు కీలక మార్పులు..చార్జీల పెంపు

న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్ : ఈ నెల 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ రుసుములు పెరుగుతాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినందు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. 11 రాష్ర్టాల్లో బ్యాంకుల విలీనం ప్రభావం పడుతుంది.
ఏటీఎం ఫీజు
ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును మే 1 నుంచి పెంచడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, బ్యాలన్స్‌ చెక్‌, పిన్‌ ఛేంజ్‌ వంటి లావాదేవీలకు నెలవారీ పరిమితులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిమితికి మించిన ప్రతి లావాదేవీకి ప్రస్తుతం రూ.21 వసూలు చేస్తున్నారు. దీనిని మే 1 నుంచి రూ.23కు పెంచారు.
రైల్వే టికెట్లు
వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టికెట్లతో ప్రయాణికులు మే 1 నుంచి స్లీపర్‌, ఏసీ బోగీల్లో ప్రయాణించరాదని భారతీయ రైల్వే ప్రకటించింది. వీరు జనరల్‌ బోగీల్లో ప్రయాణించవచ్చునని చెప్పింది. క్యాన్సిలేషన్‌ రిఫండ్‌ సమయాన్ని 2 రోజులకు తగ్గించింది.
ఆదాయపు పన్ను రిటర్నులు
ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్‌ 30న ఐటీఆర్‌ ఫారం 1, 4లను విడుదల చేసింది. సంవత్సరానికి రూ.50 లక్షల కన్నా తక్కువ ఆదాయం గల వ్యక్తులు, సంస్థలు తమ ఐటీ రిటర్నులను మే నెలలో దాఖలు చేయవచ్చు.
బ్యాంకుల విలీనం
‘ఒక రాష్ట్రం-ఒకే ఆర్‌ఆర్‌బీ’ విధానం మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. 11 రాష్ర్టాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ‘ఒక రాష్ర్టానికి ఒకే ఆర్‌ఆర్‌బీ’గా విలీనమవుతాయి.
గ్యాస్ సిలిండర్ ధర..
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను గత నెలలోనే రూ.50 మేర పెంచారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ప్రస్తుతం సిలిండర్ ధర రూ.550గా ఉంది. ఇతర సబ్సిడీ సిలిండర్ ధర రూ.853గా ఉంది. ప్రతి 15 నెలలకు ఒకసారి సిలిండర్ ధరలను సమీక్షిస్తామని కొద్ది రోజుల క్రితమే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. అయితే అధికారిక నోటిఫికేషన్ రాలేదు. కానీ, మే నెలలో ఈ మార్పులు జరగవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img