– దేగాం వద్ద వంతెన పై నుంచి పడి మృతి
నవతెలంగాణ – భైంసా:
తన కూతురుని హైదరాబాద్‌లో ప్రైవేటు పాఠశాల హాస్టల్‌కు దింపేందుకు బైక్‌పై వెళ్తూ దేగాం వద్ద వంతెన పై నుంచి కిందపడ్డ సంఘటనలో సోమవారం గణేశ్(43) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే కుభీర్‌కు చెందిన గణేశ్ ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. భార్య, తన ముగ్గురు పిల్లలతో వ్యవసాయం చేస్తూ కుభీర్‌లోనే ఉంటున్నాడు. తన కూతురు నిఖిల హైదరాబాద్‌లోని చైతన్య పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. హాస్టల్‌కు దించేందుకు సోమవారం కుభీర్ నుంచి గణేశ్ ప్రయాణమయ్యాడు. వేకువజామున అజంత ఎక్స్‌ప్రెస్‌లో బాసర నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బాసర వరకు తన బుల్లెట్ వాహానంపై కూతురును తీసుకుని ప్రయాణిస్తున్నాడు.
దేగాం గ్రామం వద్ద 161బీబీ హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పాత వంతెనకు ఆనుకుని మరోవంతెన నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న వంతెనకు ముందు రోడ్డు విశాలంగా ఉంది. వేకువ జామున ఈ విషయాన్ని గుర్తించకపోవడం, హైవేపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు, లైట్లు లేక పోవడంతో గణేశ్ నడుపుతున్న వాహానం వంతెన పై నుంచి కింద పడింది. ఈ సంఘటనలో గణేశ్ అక్కడే మృతి చెందాడు. తన కూతురు నిఖిలకు తీవ్రగాయాలయ్యాయి. నిఖిలను 108 అంబులెన్సులో భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గణేశ్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, కుభీర్‌వాసులు భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.