ఆగస్టు 10 వరకు మండల కేంద్రాల వారీగా పంపిణీ
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ఆస్తి, ప్రాణ నష్టం జరిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించం
ఫర్టిలైజర్ షాపుల ముందు స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలి
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
త్వరలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 9695299 రేషన్ కార్డుల ద్వారా. 3.12 కోట్ల మందికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. కొత్తగా దాదాపు 7 లక్షల కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనీ, దీంతో 31 లక్షల మంది లబ్ధి పొందుతారని చెప్పారు. ”గతంలో రేషన్ షాపులపై ఆసక్తి ఉండేది కాదు. సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగింది. కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి. కొత్త కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ. ఆందోళన అవసరం లేదు” అని సీఎం అన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించమని హెచ్చరించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 శాతం వర్షపాతం తక్కువ నమోదైనా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు.
అన్ని విభాగాలను అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వాతావరణ సూచనలకనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీంలను పంపిస్తున్నామని తెలిపారు. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పీహెచ్‌సీ సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ”రాష్ట్రంలో ఎరువులు అందుబాటులో లేవని కృత్రిమ ప్రచారం చేస్తున్నారు.
ఫలితంగా రైతులు ఆందోళన చెంది షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలి. తెలంగాణకు కేటాయించిన ఎరువుల్లో 20 నుంచి 25 శాతం పక్కదారి పడుతున్నాయని కేంద్రం అంటోంది. పక్క రాష్ట్రాలకు అక్రమ రవాణా చేయడంతో పాటు ఇతర వ్యాపారాలకు సబ్సీడి ఎరువులను వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువులు పక్కదారి పడితే క్రిమినల్ కేసులు పెట్టండి. రైతులకు నష్టం జరిగే పని చేస్తే కఠిన చర్యలు తప్పవు. టోల్ ఫ్రీ నెంబర్లను షాపులతో పాటు బస్టాండ్లు ఇతర పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయాలి” అని సీఎం అధికారులకు సూచించారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో అంచనాలకు తగ్గట్టుగా వర్షాలు కురిసినప్పటికి గోదావరి బేసిన్‌లో వర్షాలు కురవ లేదని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలని సూచించారు.
నీటి నిల్వలను అంచనా వేసుకుని వర్షాలనుగుణంగా వినియోగ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైనందనీ, త్వరలోనే నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని అన్నారు. గతేడాది రికార్డు స్థాయిలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలనీ, రోజు వారీగా ఏం పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, సీతక్క, సీంఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే కొత్తగూడెం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గిగ్ కార్మికుల డేటాను ఆన్‌లైన్‌లో పెట్టండి
సంక్షేమ నిధి, ప్రమాదబీమా, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించండి : అధికారులను ఆదేశించిన సీఎం
గిగ్ కార్మికుల డేటా ఆన్‌లైన్‌లో ఉంచేలా, వారికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదబీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గిగ్ కార్మికుల సంక్షేమంపై ప్రతిపాదిత పాలసీపై సీఎం సమీ క్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలను అధికారులు వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించాలని ప్రతిపా దించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..గిగ్ కార్మికుల పాలసీపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇంకా ఏమైనా మెరుగైన అంశాలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అంతిమంగా ప్రభుత్వం తీసుకు రాబోయే పాలసీ ఆదర్శంగా ఉండేలా చూడాలని సూచించారు.
25 నుంచి కొత్త రేషన్ కార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES