అమెరికాపై మండిపడిన లూలా
బ్రసిలియా : మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొ నారోపై జరుగుతున్న విచారణతో సంబంధమున్న అధికారులపై వీసా నిషేధం విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా తప్పుపట్టారు. అమెరికా నిర్ణయం ఏకపక్షమని, నిరాధారమని మండిపడ్డారు. తమ న్యాయ వ్యవస్థలో విదేశీ జోక్యాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమత్వానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను అమెరికా చర్య ఉల్లంఘిస్తోందని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. బోల్సొనారోపై విచారణ జరుపుతున్న బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మొరాయస్, ఆయన కుటుంబం, కొందరు కోర్టు అధికారులపై అమెరికా ప్రభుత్వం మూడు రోజుల క్రితం వీసా ఆంక్షలు విధించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బ్రెజిల్ ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పరాజయం పాలైన ట్రంప్ సన్నిహితుడు బోల్కొనారో తిరుగుబాటుకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బోల్సొనారో పై సెర్చ్ వారంట్లు, ఆంక్షల ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయిం చింది. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఏకంగా బ్రెజిల్ న్యాయ వ్యవస్థలోనే తలదూర్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇతర అధికారులపై వీసా నిషేధాన్ని విధించారు. దీనిపై లూలా స్పందిస్తూ ‘బ్రెజిల్ అధికారాలు, సంస్థల ముఖ్యమైన కార్యకలాపాలలో జోక్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ సహించం. ఎవరు ఏ రూపంలో భయపెట్టినా లేదా బెదిరించినా రాజీ పడే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆ సంస్థలు, అధికారాలు ప్రజాస్వామిక పాలనను శాశ్వతంగా కాపాడతాయి. పరిరక్షిస్తాయి’ అని స్పష్టం చేశారు. ఇదిలావుండగా ప్రాసిక్యూటర్ జనరల్ పాలో గోనెట్‌పై కూడా అమెరికా వీసా నిషేధం విధించిందని సొలిసిటర్ జనరల్ జార్జ్ మెస్సియాస్ తెలిపారు. మొత్తంమీద బ్రెజిల్ సుప్రీంకోర్టులోని 11 మంది న్యాయమూర్తులలో ఏడుగురిపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది.
న్యాయ వ్యవస్థలో విదేశీ జోక్యమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES