ట్రంప్ సుంకాలపై దక్షిణ కొరియాలో వ్యతిరేకత
సియోల్ : దక్షిణ కొరియా, అమెరికాలది చిరకాల మైత్రి. అయితే ఇదంతా నిన్నటి ముచ్చట. దక్షిణ కొరియా ఉత్పత్తులపై ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నిన్నటి వరకూ అమెరికాను, ట్రంప్‌ను ఎంతో ఇష్టపడిన దక్షిణ కొరియా వాసులు ఇప్పుడు ముఖం తిప్పుకుంటున్నారు. ‘అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో బలమైనది. అయితే ఇప్పుడు అమెరికా భౌగోళిక రాజకీయ సమతూకానికి ముప్పు కలిగిస్తోంది’ అని సిడ్నీ సిమ్ అనే వ్యక్తి విమర్శించారు. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం బిజినెస్ వీసాపై అమెరికా వెళ్లి వచ్చారు.
అమెరికా, దక్షిణ కొరియా మధ్య దీర్ఘకాలంగా ‘ఫెవికాల్’ బంధం కొనసాగుతోంది. ఆసియాలో అమెరికాకు దక్షిణ కొరియా అత్యంత సన్నిహిత భాగస్వామి. ఉత్తర కొరియా వ్యతిరేక కార్యకలాపాల నిమిత్తం 28,000 మంది అమెరికా సైనికులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇతర దేశాల కంటే అమెరికాలోనే ప్రవాస దక్షిణ కొరియా వాసులు ఎక్కువ మంది నివసిస్తున్నారు. అయితే ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అజెండా కారణంగా ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఈ వారం ప్రారంభంలో ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో 61 శాతం మంది దక్షిణ కొరియన్లు అమెరికా పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. గత సంవత్సరం జరిపిన సర్వేలో ఈ సానుకూలత 77 శాతం ఉండడం గమనార్హం.
అమెరికాతో వచ్చే నెల 1వ తేదీ నాటికి వాణిజ్య ఒప్పందం కుదరని పక్షంలో దక్షిణ కొరియా తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, నౌకలు, కార్లు, జనరేటర్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దక్షిణ కొరియా తన ఎగుమతుల ద్వారా జీడీపీలో 40 శాతానికి పైగా పొందుతోంది. ట్రంప్ తన టారిఫ్ హెచ్చరికలపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ లే-మయుంగ్‌కు లేఖ రాయడంతో పాటు ఆ దేశంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలోని తమ దళాలకు సియోల్ పెద్దగా చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. ఇదిలావుండగా అమెరికాతో గడువు నాటికి ఒప్పందం కుదిరే అవకాశమేమీ లేదని దక్షిణ కొరియా తేల్చి చెప్పింది.
ఆ నాటి ప్రేమ నేడేది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES