రాష్ట్రంలో గురుకులాలు మృత్యు కుహరాలుగా మారాయా?, ఫుడ్‌పాయిజన్‌కు కేంద్రాలుగా తయారయ్యాయా?అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రతిరోజూ ఏదో ఓచోట విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఈనెల పద్నాలుగున ఒక్కరోజే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ వారం రోజుల్లోనే రెండు వందలకు పైగా విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవ్వడం తల్లిదండ్రులకూ గుబులు పుట్టిస్తోంది. అసలు గురుకులాల్లో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసు కుంటున్నారు? ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలేంటి? అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఇలాంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే విచారణకు ఆదేశించడం, తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడం, తర్వాత మళ్లీ ‘షరా మామూలే’!
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన చదువు, మంచి భోజనం దొరుకుతుందని విద్యాలయాల్లో చేర్పించారు. కానీ వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే అందుకు భిన్నం.గురుకులాల్లో అననుకూల వాతావరణం విద్యార్థులకు మానసిక ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విద్యార్థిని గురుకులంలో ఉండలేక అదే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి కారణాలతోనే సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇద్దరు మృత్యుఒడికి చేరారు. పసి మనసుకి అంతగా ఎదురవుతున్న సమస్యలేంటి? అన్న కోణంలో ప్రభుత్వం ఆరా తీయడం లేదు. ప్రధానంగా విద్యార్థులకు దూర ప్రాంతాల్లో అడ్మిషన్లు రావడం, వారు ఒక్కసారిగా తల్లిదండ్రులను వీడటం, అధిక ఆందోళన, మానసిక ఒత్తిడి, చదువుల్లో రాణించలేమోననే భయం, విద్యార్యుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టు సైకాలజిస్టుల విశ్లేషణ. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఉపాధ్యాయులకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోననే ఆవేదనతో ఈ నిర్ణయానికి వస్తున్నట్టు అభిప్రాయం.
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వెయ్యికి పైగా గురుకులాల్లో మూడు లక్షల ఎనభైవేల పైచిలుకు విద్యా ర్థులు ఉంటున్నారు. వీటిని నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. గురుకులాలకు పంపిణీ చేసే బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయాలు చాలా నాసిరకంగా ఉంటు న్నాయి. ఉడకని అన్నం, నీళ్లచారు, బల్లి, జెర్రీ, బొద్దింకలు పడ్డ కూరలు, కుళ్లిన కోడిగుడ్లు తినడం వల్ల వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అస్పత్రుల పాలవుతున్నారు. మొన్న సంగారెడ్డి జిల్లా మొర్గి ఆదర్శ పాఠశాలలో కుళ్లిన చికెన్ తినడంతో పదకొండుమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా సాయికుంటలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు ఆస్పత్రిలో చేరగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు. విద్యార్థులు గురుకులంలో ఉండేందుకు ఆసక్తి చూపకపోవడానికి ఇది కూడా ఓ కారణం. ఈ రెండేండ్ల కాలంగా చూస్తే పాముకాట్లు, ఫుడ్ పాయిజనింగ్, బలవన్మరణాలతో సుమారు తొంభై మూడు మంది చనిపోవడం కుటుంబాలకు తీరని శోకం.
గురుకులాలు, ఇంటర్ కళాశాలలు, విద్యాలయాల్లో ఇలాంటి సమస్యల్ని చక్కదిద్దేందుకు గత సర్కార్ ఓ కమిటీని నియమించింది. అందులో టీచర్, డాక్టర్, లాయర్, సైకలాజిస్టుతో పాటు పేరెంట్ ఉంటారు. అవసరాన్ని బట్టి, నెలకోసారి గురుకులాల్ని పర్యవేక్షించి విద్యార్థులకు సలహాలు, సూచనలివ్వాలి. ఆత్మహత్య లాంటి ఘటనలు జరిగితే అక్కడ సమావేశమై పిల్లల్లో మనోధైర్యం నింపాలి. కానీ ఈ కమిటీ నామమాత్రంగా పనిచేసిందని విద్యావేత్తలు, మేధావుల విమర్శ. ప్రస్తుతం కొత్తగా జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీ, మండల స్థాయిలో తహశీల్దార్, ఎస్‌ఐ గురుకులాల్ని పర్యవేక్షించాలని, ఆహారాన్ని, కిచెన్ శుభ్రతను పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. కానీ, అది క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది.
గురుకులాల నిర్వహణ పట్ల గతేడాది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగానే మందలించింది. ‘అధికారులు నిద్ర పోతున్నారా?’ అని ప్రశ్నించింది. ‘వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులేం చేస్తున్నారు. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?, హైకోర్టు ఆదేశాలిస్తేనే అధికారులు పనిచేస్తారా? మీకూ పిల్లలున్నారు కదా..మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ పాలకుల్లో కించిత్ మార్పు కూడా రాకపోవడం శోచనీయం.ఇప్పటికైనా గురుకులాల్లో ఆత్మహత్యలపై సమగ్ర అధ్యయనం చేయాలి. వాటి నివారణకు కమిటీని పునరుద్ధరించాలి. ఫుడ్ పాయిజన్ జరగకుండా తగిన జాగ్త్రత్తలు తీసుకోవాలి. ఇది సర్కార్ బాధ్యత, అంతకుమించి విద్యార్థులకు కల్పించాల్సిన భద్రత.
గురుకులాల్లో ఏం జరుగుతోంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES