Wednesday, July 23, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపుండు ఒకచోట... మందు మరోచోటా?

పుండు ఒకచోట… మందు మరోచోటా?

- Advertisement -

పలకా బలపం మాయమై రెండు దశాబ్దాలు దాటింది పలక కేవలం బండ్ల వద్ద పండ్లు, కూరగాయల ధర ప్రదర్శించడానికి పరిమితమైంది.మారిన కాలమాన పరిస్థితుల్లో తరగతి గదిలో పలక బలపం, మోటుతనానికి వెనుకబాటుతనానికి చిహ్నమైన పరిస్థితి నెలకొంది. వాటి స్థానంలో పెన్ను, నోట్‌బుక్‌ దర్శనమిస్తున్నాయి. పిల్లలకు కేవలం బొమ్మలు చూపడం, అక్షరాలు నేర్పడం ద్వారా చిన్న పదాలు, వాక్యాలు – ఈ విధంగా అభ్యసన క్రమం కొనసాగుతుంది. కానీ తరాలు మారుతున్న క్రమేణా చిన్నారులు మొబైల్‌ ఫోన్లను బాగా వినియోగిస్తున్నారు. యువతరాన్ని మినహాయించి అరవైయేండ్ల పైబడిన వారు మొబైల్‌ ఫోన్లను అంత బాగా వాడలేరు. అందుకేనేమో ప్రభుత్వం కూడా విద్యార్థులకు చిన్ననాటి నుండే డిజిటల్‌ విద్య, కంప్యూటర్‌ విద్య, కోడింగ్‌ అంటూ కొత్త విద్యా విధానానికి నాంది పలుకుతున్నది. అంటే రాబోయే రోజుల్లో విద్యార్థుల చేతుల్లో మొబైల్‌ ఫోన్లు, ట్యాబులు దర్శనమివ్వ బోతున్నాయన్నమాట! పుట్టిన ప్రతిబిడ్డ చూపును కేంద్రీకృతం చేయడానికి మనుషులను లేదా వస్తువులను గుర్తుపట్టడానికి కొద్ది నెలలు పడుతుంది. ఆ తర్వాత వినడం, పలకడం, చదవడం, రాయడం అనే ప్రక్రియల ద్వారా అభ్యసనా కార్యక్రమం జరుగుతుంది. విన్న పదాలను మళ్లీ మళ్లీ అనడం ద్వారా అతని నోరు, నాడీ వ్యవస్థ ఒక సమన్వ యంతో పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకేనేమో గతంలోనూ ఇప్పటికీ ప్రాథమిక తరగతుల్లో బాగా వల్లె వేయించడం ద్వారా విద్యార్థులకు పలకడం బాగా నేర్ప డాన్ని మనం గమనిస్తాం. తర్వాత ఆ పదాలను గుర్తించి చదవడం మొదలు పెడతారు. అది రాయడమనే దశకు చేరు కోవడంతో నైపుణ్యాలు పెరుగుతుంటాయి. అభ్యసనా సామర్థ్యం పెరుగుతూ అన్ని విషయాలు చదివి రాసి నేర్చుకునే స్థాయికి చేరడం ఒక క్రమంలో జరగడం సహజం.

సాంకేతిక విప్లవ విస్ఫోటనాన్ని తరగతిగదిలో ఉపయోగించు కోవటానికి ప్రభుత్వా లు అత్యుత్సాహాన్ని చూపుతున్నాయి. మంచిదే, కానీ ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా, మౌలిక వసతులను కల్పించకుండా ఏకంగా టెక్నాలజీని తరగతిగదిలో ప్రవేశపెట్టి విద్యార్థుల నుండి అద్భుతాలు ఆశించడం సబబు కాదేమో! ఒకపక్క వేల పాఠశాలల్లో పాఠశాలలకు పక్కా భవనాలు లేవు. మంచినీటి సౌకర్యాలు మృగ్యం. మరుగుదొడ్లు మరుగున పడ్డాయి. ఉన్న వాటిని సరిగా వాడుకునే పరిస్థితుల్లో లేవు. విద్యుత్‌ సరఫరా అంతంతే. కానీ వాస్తవాన్ని మరిచి స్మార్ట్‌బోర్డులు అంటారు, స్మార్ట్‌ క్లాసురూమ్‌ అంటారు. ఎన్ని పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది? ఉన్నా ఎంతమంది ఉపాధ్యా యులు దాన్ని ఉపయోగించి బోధించ గలుగుతారు? ఆ విధంగా ఉపయోగించ గలిగిన శిక్షకులను ప్రభుత్వ నియమించగలదా? తరగతి గదికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించడానికి దశలవారీగా ప్రక్రియ చేయబడుతున్న ప్రభుత్వాలు సాంకేతిక సహాయకులను నియమించే దుస్సాహసానికి ఒడిగడతాయా? లేక ఉపాధ్యాయులకే శిక్షణ ఇస్తాయా? సాంకేతిక పరిజ్ఞానం అంతా ఇంగ్లీషులోనే లభ్యమవుతుంది. మరి చిన్న తరగతి విద్యార్థులు ఇంగ్లీషును అర్థం చేసుకోగలుగుతారా? లేదా ఇంటి వద్ద వారు అభ్యాసం చేయడానికి సరైన మద్దతు, అవకాశం తల్లి దండ్రుల నుంచి పొందే పరిస్థితి ఉందా?ప్రతి ఇంట్లో కూడా ఇంటర్నెట్‌, సాంకేతిక పరికరాలు ఆశించలేం కదా. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేవంటే డిజిటల్‌ విద్య, కోడింగ్‌, కంప్యూటర్లు, స్మార్ట్‌ బోర్డులు, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు అంటూ వెంపర్లాడటం ప్రజాధనాన్ని వృథా చేయడమే. అసలు సమస్యలను పక్కదారి పట్టించడమే.

దేశాభివృద్ధిలో సాంకేతికత అవసరాన్ని దాని కీలక పాత్రను ఎవరు కాదనరు. కానీ తరగతి గదిలో అది ఏ మేరకు సహాయపడుతుందో ముఖ్యంగా పాఠశాల స్థాయి వరకు అనేది ఒక అధ్యయనం అవసరం. కొంతకాలం కంప్యూటర్లు సరఫరా చేసి సాంకేతికవిద్యను అందించిన అజీమ్‌ ఫౌండేషన్‌ చివరకు ఏం సాధించింది? అదితరగతి గదిలో సాధించిన అద్భుతాలేమిటి? చెడిపోయిన కంప్యూటర్లు ఐడేండ్ల తర్వాత ఈ-వేస్ట్‌ గా మిగిలిపోయాయి. దీనిపై సరైనఅవగాహన లేకుండా కేవలం పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకున్నామని ప్రకటనలు చేస్తే కలిగే ప్రయోజనం శూన్యం. వారికున్న అర్హతలు, అనుభవాలు కూడా అధ్యయనం చేయాలి. వారు సాధించిన విజయాలపై సమీక్ష జరిపి ఒప్పందాలు చేసుకోవడం విజ్ఞత. వాటికి జవాబుదారీతనం కూడా నిర్దేశించాలి. వారిలోని వ్యాపారాత్మక ఆలోచనలు కూడా గమనించాలి.

తరగతిగదికి ఉపాధ్యాయుడు మూల స్తంభం. విద్యార్థులు గురువునుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. నడక, నటన, ప్రవర్తన, హావభావాలు ఇవన్నీ బోధనలో భాగం. తరగతి గది నియంత్రణ అనేది అతని విధిలో చాలా ముఖ్యమైనది. ఇవేవీ యంత్రాలు సాంకేతికత చేయలేవు. స్మార్ట్‌ బోర్డుపై బొమ్మలు కనబడితే పిల్లలు నోరు అప్పలించి ఆనందిస్తుంటారు. కండ్లప్పగించి చూస్తుంటారు. నేర్చుకునేది స్వల్పమే. శ్రవణం కన్నా దృశ్యం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందనేది నిజమే. అంతకన్నా చేతలు, క్రియలు విద్యార్థులకు శాశ్వతంగా గుర్తుండి పోయేలా చేస్తాయి. అంటే ప్రయోగశాలలు అభ్యసన ప్రక్రియలో కీలక పాత్ర వహిస్తాయి. కానీ వాటిని బలోపేతం చేయకుండా విద్య నేర్పుదాం అనుకోవడం దుర్లభం. అదే భాషా పండితులైతే తాము నటిస్తూ విద్యార్థులతోనటింపజేస్తూ, పాడుతూ పాడిస్తూ, వల్లే వేయిస్తూ, రోల్‌ ప్లే లాంటి అనేక ప్రక్రియల ద్వారా బోధన సాగిస్తారు. అందువల్ల తరగతి గది చాలా చురుకుగా సజీవంగా ఉంటుంది. దృశ్య శ్రవణ మాధ్యమాలు చెవులకు కండ్లకు ఆనందాన్ని కలుగజేస్తాయి. మెదడును కొంతమేరకే ప్రభావితం చేస్తాయి. యంత్రాలే పాఠాలు చెబితే సాంకేతికతకు పితామహుడుగా చెప్పుకునే ముఖ్యమంత్రి గతంలోనే తరగతి గదిలో ప్రవేశపెట్టేవాడు. అదే నిజమైతే ఏదో ఒకనాడు రోబోలు ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేస్తాయి. మన ప్రభుత్వాలు కూడా అవే కోరుకుంటున్నాయేమో? అధికారులకు కావా ల్సింది కూడా అదేనేమో?

సాంకేతికత సమీక్షలకు బాగా పనికొస్తుంది. ఎక్కడ ఫలితాలు వస్తున్నాయి, ఎవరి పనితీరు ఎలా ఉంది అనే విషయాలు మదింపు చేయడానికి, ఏ విషయాల్లో ఎక్కడ వెనుకబడ్డామో తెలియ జేయడానికి ఉపకరిస్తుంది.ఒక స్థాయిలో దాని వినియోగం కొంతమేరకు సహేతుకమైనది. కానీ పాఠశాల స్థాయిలో అది దుష్ఫలితాలను చూపిస్తుంది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ బోధన ఏ మేరకు ఫలితాలను ఇచ్చిందో అధికారులు సమీక్షించారా? అది నేడు విద్యార్థులకు అలవాటుగా మారి ఎక్కువగా స్క్రీన్‌ టైంలో వారు సమయాన్ని గడుపుతున్నారు. మొబైల్‌ను ఇంకా ఇతర కార్యక్రమాలు చూడటానికి నేర్చుకోవడానికి కూడా ఉపయోగించి దారి తప్పుతుండడం అందరికీ తెలిసిన విషయమే. సంక్షోభాలు అధిగమించడానికి సాంకేతికత ఉపయోగపడదు. సమస్యల మూలాలు శోధించి వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఇతర దేశాల్లో డిజిటల్‌ విద్య ఏ రకమైన ఫలితాలను ఇచ్చిందో అధ్యయనం చేశారా? పిల్లవాడు ఎదుగుతున్న దశలో సైకో మోటార్‌ స్కిల్స్‌ చాలా ముఖ్యం. అది ఉపాధ్యాయుడు మాత్రమే పెంపొందించగలడు. సాంప్ర దాయ తరగతి గదికి సాంకేతికత ప్రత్యామ్నాయం కాదు. దాన్ని అవసరమైన చోట అవసరమైనంతవరకే విచక్షణతో, వివేకంతో వినియోగించాలి. సాంకేతికత అవసరం, వాడకం శృతిమించితే వచ్చే అనర్ధాలు ఎవరూ సరిదిద్దలేరు. అందుకే సాంకేతికత కంటే ముందు విద్యా ప్రమాణాలు పెరగాలి. శిక్షణ, మానిటరింగ్‌ వ్యవస్థలు మరింత బలోపేతం కావాలి, సమర్ధవంతంగా పనిచేయాలి. అసర్‌ గణాంకాలు మన పనితీరును వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో గుణపాఠాలు నేర్చుకోవాలి. మానవ వనరుల అభివృద్ధికి సహేతుకమైన చర్యలతో అభ్యసన సామర్ధ్యాల పెంపుదలకు నిర్మాణాత్మకమైన కృషి చేయాలి.
శ్రీ శ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -