– బీహార్‌లోని ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ఆందోళన
– ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు
– రెండోరోజూ వాయిదాల పర్వం.. ఉభయ సభలు నేటికి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజూ ఎలాంటి చర్చ లేకుండా సాగాయి. బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్‌ఐఆర్) పేరుతో ఓటర్ల జాబితాను సవరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు మంగళవారం ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో, రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ నారాయణ సింగ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాల హౌరెత్తించారు. దీంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల సభ్యుల ఆందోళనతో ఉభయసభలు తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఆ తరువాత పునఃప్రారంభమైనప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పు రాలేదు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదాపడ్డాయి. తిరిగి ప్రారంభమైన సభల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో ఉభయసభలు నేటికి వాయిదా పడ్డాయి.
పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్‌ఐఆర్)ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టారు. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల ప్రారంభానికి ముందు మకర ద్వారం ఎదురుగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ పార్టీల నేతలు ప్లకార్డులు చేబూని ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాల హౌరె త్తించారు. ప్రభుత్వ రివ్యూ ఉద్దేశం, చట్టబద్ధ తను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందో ళనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్‌పి నేత అఖిలేష్ యాదవ్, డీఎంకె నేతలు కనిమొళి, టిఆర్ బాలు, ఎ.రాజా, ఆర్‌జేడీ ఎంపీలు మీసా భారతి, మనోజ్ కుమార్ ఝా, సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, రాధాకృష్ణన్ తదితర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అంతకుముందు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇండియా బ్లాక్ పార్టీల నేతల సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.