Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫుడ్‌ పాయిజన్‌తో ఆర్టీసీ కండక్టర్‌ మృతి

ఫుడ్‌ పాయిజన్‌తో ఆర్టీసీ కండక్టర్‌ మృతి

- Advertisement -

– అదే కుటుంబానికి చెందిన 9 మందికి అస్వస్థత
– బోనాల పండుగకు వండిన మాంసాహారం వల్లే..
నవతెలంగాణ-వనస్థలిపురం

బోనాల పండుగ సందర్భంగా ఇంట్లో వండిన మాంసాహారాన్ని మరుసటి రోజు తినడంతో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి ఆర్టీసీ కండక్టర్‌ మృతిచెందాడు. అదే కుటుంబంలో మరో 9 మందికి ఫుడ్‌ పాయిజన్‌ అయింది. ఈ ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేటకు చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌(46) ఫలక్‌నుమా ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య రజిత, కుమార్తెలు జస్విత, లహరితో కలిసి వనస్థలిపురంలోని చింతలకుంట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 20న ఆదివారం బోనాల పండుగను పురస్కరించుకుని వారి ఇంటికి షాద్‌నగర్‌ నుంచి శ్రీనివాస్‌ తల్లి గౌరమ్మ, తండ్రి, సోదరుడు సంతోష్‌ కుమార్‌, అతని భార్య రాధిక, వారి కుమార్తెలు పూర్విక, క్రితజ్ఞ, మరో కుటుంబసభ్యుడు జీవన్‌ వచ్చారు. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు చికెన్‌, మటన్‌ బోటి వండుకుని భోజనం చేశారు. మిగిలిన నాన్‌వెజ్‌ను ఫ్రిజ్‌లో పెట్టారు. సోమవారం ఉదయం మిగిలిన నాన్‌వెజ్‌ను వేడి చేసి తిన్నారు. మంగళవారం వారికి వాంతులు, విరోచనాలయ్యాయి. శ్రీనివాస్‌ యాదవ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మిగతా కుటుంబసభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్‌ తండ్రికి నాన్‌వెజ్‌ అలవాటు లేకపోవడంతో అతనికి ఏమీ కాలేదు. మృతుడి తల్లి గౌరమ్మ, కూతురు జస్విత పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -