Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలకు బాసటగా మహాలక్ష్మీ

మహిళలకు బాసటగా మహాలక్ష్మీ

- Advertisement -

– ఆర్టీసీలో ఉచిత ప్రయాణ విలువ రూ.6,700 కోట్లు
– 200 కోట్లకు చేరిన జీరో టిక్కెట్లు
– నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 200 కోట్ల(జీరో టిక్కెట్లు) మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆ ఉచిత ప్రయాణాల విలువ రూ.6,700 కోట్లుగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ సొమ్మును విడతలవారీగా టీజీఎస్‌ఆర్టీసీకి అందిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. 200 కోట్ల జీరో టిక్కెట్ల మైలురాయిని చేరిన సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్టేషన్లలో సంబురాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరిగిందని ఆయన చెప్పారు. 2023 డిసెంబర్‌ 9 నుంచి ఈ పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి ఐదుగురు విజేతలకు పుస్తకాలు, వాటర్‌ బాటిళ్లు, పెన్‌ సెట్లు వంటి బహుమతుల్ని అందించనున్నారు.

సీఎం అభినందనలు
మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం 200 కోట్ల జీరో టికెట్ల మైలు రాయిని చేరుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. ”18 నెలల ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయి…ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉంది. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు. పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు” అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -