Friday, August 15, 2025
E-PAPER
spot_img

వ్యయసాయమే

- Advertisement -

పెట్టుబడిభారంతో కుదేలవుతున్న రైతాంగం
పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు
వ్యవసాయం చేసేకన్నా కూలీకి వెళ్లడం బెటర్‌ అంటున్న అన్నదాతలు

‘వ్యవసాయం’ అనే పదంలోనే ‘సాయం’ ఉంది. ప్రకృతిని నమ్ముకొని, పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అనే భరోసా కూడా లేకుండా రైతు సమాజానికి ‘సాయం’ చేస్తూనే ఉన్నాడు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దానికి భిన్నంగా వారితో కూడా వ్యాపారం చేయడమే లక్ష్యంగా పాలకుల విధాన నిర్ణయాలు ఉంటున్నాయి. ఆ నిర్ణయాల దుష్పలితాలను భరించలేక అన్నదాత కుదేలవుతున్నాడు. ‘వ్యవసాయం చేసే కంటే కైకిలి పోవడం నయం’ అనే స్థితికి రైతుని పాలకులు నెట్టేస్తున్నారు.
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం దేశానికి ‘రైస్‌ బౌల్‌’ అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఆ ధాన్యం పండించిన రైతుల కడుపులు మాత్రం ఆకలితో అలమటిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు కోటి 30 లక్షల ఎకరాల్లో, దాదాపు 70 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. వర్షాధార భూముల్లో విత్తిన గింజలు మొలకెత్తడం ఒకెత్తు అయితే, మొలకెత్తిన పైరును కాపాడుకోవడం, పంట తీయడం మరో ఎత్తు. ప్రస్తుత సీజన్‌లో పంటల స్థితిగతులు, రైతుల కష్టాలు, కన్నీళ్లు, పెట్టుబడులు వంటి అంశాలపై పరిశీలన చేసేందుకు ‘నవతెలంగాణ’ ప్రతినిధి పలు ప్రాంతాల్లో పర్యటించారు. చాలామంది రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ‘వ్యవసాయం’పై తమ మక్కువను వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ సాదకబాదకాలను వెల్లడించారు.

రెండింతలు పెరిగిన పెట్టుబడి
సాగు పెట్టుబడి అమాంతం ఎగబాకింది. ఏటా ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఐదేండ్ల కాలంలో ఫెర్టిలైజర్స్‌ ధరలు భారీగా పెరిగాయి. 2022లో డీఏపీ రూ.1,200 ఉంటే, ప్రస్తుత ధర రూ.1,400 ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి రూ.1,500 నుంచి రూ.1,600 అవుతోంది. రైతు పొలానికి ఆ బస్తా చేరాలంటే దాదాపు మొత్తం ఖర్చు దాదాపు రూ.1,650 అవుతోంది. 2022లో యూరియా ధర రూ.240. ప్రస్తుతం రూ.300కు పెరిగింది. పొటాషియం 2022లో రూ.1,400 ఉంటే ప్రస్తుతం రూ.1,800 ఉంది.

పెరిగిన కూలి రేట్లు
కూలి రేట్లు కూడా అమాంతం పెరిగాయి. దీనికి పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పెరిగిన జీవన ప్రమాణాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. డీజిల్‌ ధర పెరగడంతో దున్నకం రేట్లూ పెరిగాయి. వరి కోత మిషన్ల రేట్లూ పెరిగాయి. ట్రాక్టర్‌తో పొలం దున్నితే గంటకు రూ.1,500, దుక్కి దున్నితే రూ.వెయ్యి తీసుకుంటున్నారు. ఎకరం పొలం దున్నేందుకు 1గంట 20 నిమిషాలు పడుతుంది. నాటు వేసే సరికి మూడుసార్లు దున్నాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎకరం పొలం దున్నేందుకు 4 గంటల సమయానికి రూ.6 వేలు అవుతుంది. ఎకరాలో నాట్లు వేస్తే రూ.8 వేలు, వరి కోతకు గంటకు రూ.2,500 నుంచి రూ.4వేలు వరకు అవుతుంది. సుమారుగా ఎకరం వరి సాగుకు ఖర్చు రూ.31,400 అవుతుందని అంచనా. ఈ ఎకరా సాగుతో ఆయా ప్రాంతాలను బట్టి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణ లెక్కల ప్రకారం ప్రస్తుత కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)తో ఎకరా ఆదాయం రూ.51,549 మాత్రమే. ఇందులో పెట్టుబడి రూ.31,400 తీసేస్తే రూ.20 వేలు రైతులకు వస్తోంది. అదీ ప్రకృతి సహకరిస్తే…ఆరునెలలకు పైగా రైతు కుటుంబం మొత్తం పనిచేస్తే వచ్చే ఆదాయం ఇది.

ఎకరం సాగు ఖర్చు ఇలా.. (రూపాయల్లో)
పొలం దున్నకం 6,000
డీఏపీ 2 2,800
యూరియా 600
పొటాష్‌ 1,800
నాట్లు 8,000
కలుపు మందు 1,200
ఫెస్టిసైడ్స్‌ 3,000
వరి కోత 4,000
టాన్స్‌పోర్టు 2,000
మార్కెట్‌ 2,000
——————————
మొత్తం 31,400
——————————
(ప్రాంతాన్ని బట్టి అంచనాలు మారతాయి)
కూలికి వెళ్లడమే ఉత్తమం
ఫరూక్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి మూడెకరాల తరి పొలంలో యాసంగి వరి సాగు చేశారు. దిగుబడి 66 క్వింటాళ్లు వచ్చింది. పంట సకాలంలో కొనుగోలు కాలేదు. ప్రయివేటుగా మిల్లర్‌కు క్వింటాల్‌ రూ.1900 చొప్పున విక్రయించాడు. పంటకు వచ్చిన డబ్బులు రూ.1,25,400 కాగా.. పెట్టుబడి రూ.96 వేలు అయింది. రైతుకు మిగిలింది రూ.29 వేలు మాత్రమే. ఇది ఆరునెలలు ఇంటిల్లిపాది చేసిన శ్రమకు దక్కిన ఫలితం. ”పొలం పడువా ఉన్నా ఫర్వాలేదు కానీ.. పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఏమీ గిట్టుబాటు కావడం లేదు..పొలం పని చేసినదాని కంటే, కూలీ పనులకు పోవుడు నయం’ సదరు రైతు నవతెలంగాణ ప్రతినిధితో తన అవేదన చెప్పుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad