Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకుడి కాలువ నీటి విడుదల పైకేఆర్‌ఎంబీకి ఫిర్యాదు

కుడి కాలువ నీటి విడుదల పైకేఆర్‌ఎంబీకి ఫిర్యాదు

- Advertisement -

ఏండ్ల తరబడి కొలిక్కిరాని సాగర్‌ జల వివాదం
నవతెలంగాణ- నాగార్జునసాగర్‌

నాగార్జునసాగర్‌ కుడి కాలువ నీటి విడుదలపై తెలంగాణ ఇరిగేషన్‌, ప్రాజెక్టు అధికారులు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం ఇవ్వకుండా, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు అనుమతి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ అధికారులు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీనిపై నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అధికారులు కేఆర్‌ఎంబీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సాగర్‌ డ్యాం ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. కుడి కాలువ నీటి విడుదల విషయంలో ఏపీ ఇరిగేషన్‌ అధికారులపై కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదు చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ పంపించామన్నారు.నాగార్జునసాగర్‌ జలాల వినియోగం విషయంలో ప్రతిసారీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజుకోవడం సర్వసాధారణమైంది. కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా బుధవారం ఏపీ ఇరిగేషన్‌ అధికారులు కుడి కాలువకు నీటి విడుదల చేయడంతో మరోమారు జల వివాదానికి కారణమైంది. ఐదేండ్లుగా కృష్ణానది జలాల వివాదాలను పరిశీలనలోకి తీసుకుంటే.. ముందుగా పులిచింతల కేంద్రంగా జలవివాదం ముదిరి అది కాస్త ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసేవరకు వెళ్లింది. నాగార్జునసాగర్‌ జలాశయ నీటి వినియోగ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో 2015-2016లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కృష్ణా నది జలాలను తెలంగాణకు 34 శాతం, ఆంధ్రకు 66శాతం చొప్పున కేటాయించారు. ప్రతిఏటా తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను అవసరం మేరకే వినియోగించుకుంటున్నా.. పూర్తిస్థాయిలో మాత్రం ఉపయోగించుకోవడం లేదు. అయితే సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు పెంచుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమస్యను తీవ్రం చేయకుండా వెంటనే పరిష్కరించుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -