ఎల్‌ఐసి కేవలం ఒక కార్పొరేట్ దిగ్గజం మాత్రమే కాదు, దేశాన్ని బాగా అర్థం చేసుకున్న విశిష్ట ప్రభుత్వ రంగ సంస్థ. మహిళలకు ఉపాధి కల్పనలో దాని స్థానం ప్రత్యేకం. 1960లలో భారతదేశంలో తాను అందించే పాలసీలు కేవలం బీమా రక్షణకే పరిమితము కాకుండా, సేవింగ్స్ అంశంపై కూడా ఎల్‌ఐసీ దృష్టి పెట్టింది. పిల్లల చదువులకూ, యువతుల పెళ్లిళ్లకూ అందివచ్చేలా మధ్యంతర, తుది చెల్లింపులు, బీమారక్షణ ఉండే పాలసీలను రూపొందించింది. సంస్థ చొరవ కారణంగా చాలా మంది గృహిణులు ఎల్‌ఐసి ఏజెన్సీ తీసుకుని విశేషంగా రాణించారు.ప్రస్తుతం ఎల్‌ఐసి సంస్థలో మొత్తం ఏజెంట్ల సంఖ్య 14.80 లక్షలు పైబడి కాగా , అందులో మహిళా ఏజెంట్ల సంఖ్య ఐదు లక్షలు పైమాటే.మూడేండ్లపాటు పరిమితులతో కూడిన స్టైఫెండ్‌ను చెల్లించే బీమా సఖి అనబడే ఒక ఉపాధి పథకం మహిళల కోసం ప్రత్యే కంగా జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) అమలు పరుస్తున్నది. 2024 డిసెంబర్ 9 ప్రధానమంత్రి చే ప్రారంభించబడిన ఈ పథకం కేవలం నిరు ద్యోగ మహిళలకోసం రూపొందించబడింది. ఈ మధ్యకాలంలో ఈ పథకం కింద 2 లక్షల పైగా మహిళా ఏజెంట్లను (2,05,896)ఎల్‌ఐసి నియమించింది.సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలో (తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్) ఇప్పటికే 45 వేల మంది బీమా సఖులుగా నియామకాలు పొందారు.
ఐఆర్డిఎఐ నిబందనలానుసారం ఈ పథకం కింద ఎల్‌ఐసిలో ఏజెన్సీ తీసుకుని నిర్దేశిత పరిమిత వ్యాపారం సేకరించిన ప్రతి ఒక్కరికీ మొదటియేడు రూ.7వేలు, రెండవయేడు రూ.6వేలు, మూడో యేడు రూ.5వేల స్టైఫెండ్ చెల్లించబడుతుంది. ఈ పథకం దేశంలోని నిరుద్యోగాన్ని రూపుమాపుతుందని చెప్పలేం గానీ అర్దంతరంగా చదువును ఆపేసి ఉపాధి నిస్సహాయతలో ఉన్న ఔత్సాహికులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు మానేసిన చాలామంది సబలలకు తమను తాము మలచుకునేందుకు ఇది ఒక సదవకాశం. ఈ పథకాన్ని ప్రారంభించడానికీ, తదనంతర ప్రక్రియలకు ఎల్‌ఐసి వ్యయప్రయాసలకోర్చి ఉండవచ్చు. అయితే ఎల్‌ఐసి లక్ష్యాలలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు బీమా వ్యాపారాన్ని విస్తరింపజేయాలంటే బీమా సఖి ఒక మంచి ప్రయత్నమే. ఇందులో అంచెలంచెలుగా ఎదిగే అవకాశమూ ఉన్నది. వీరు ఐదేళ్లు ఏజెంట్‌గా పనిచేస్తే, అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అవడానికి అర్హత పొందుతారు.నిర్నీత సర్వీసు, వయసూ దాటిన తర్వాత గ్రాట్యుటీ, వారసత్వ కమీషనూ లభించే వెసులుబాటూ ఉన్నది.గత ఆర్థిక సంవత్సరంలో బీమా సఖి పధకం ద్వారా రూ 62.36 కోట్లు చెల్లించిన ఎల్‌ఐసి,ఈ ఏడాది రూ 520 కోట్లు చెల్లించాలని లక్ష్యం పెట్టుకుంది.
కోవిడ్-19 మహమ్మారి బీమాను ప్రాథమిక ఆర్థిక అవసరంగా చూసేలా బీమా వైపు ప్రజల దృక్పథాన్ని మార్చింది. ఇండియా స్పెండ్ సర్వే ప్రకారం, భారతీయ కుటుంబాలు తమ ఆదాయంలో 39శాతం రుణ వాయిదాలపై, 32శాతం వారి అవసరాలకు, 29శాతం విచక్షణా వ్యయంపై ఖర్చు చేస్తాయి.అత్యల్ప నికర పొదుపు ఉన్నప్పటికీ, ఎల్‌ఐసి చక్కటి మార్కెటింగ్ వ్యూహంతో జీవిత బీమా రంగంలో ముందంజలో ఉంది.ప్రభుత్వరంగ బీమా సంస్థలు విస్తృత వర్గాల ప్రజలను చేరుకోవడానికి ప్రత్యేక మైన, తక్కువ ఖర్చుతో కూడిన, సులభంగా అర్థమయ్యే ఆరోగ్య ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. సంఘటిత రంగ ఉపాధులలో మహిళా భాగస్వామ్యం దేశంలో నామమాత్రమే. అందుకే ఇలాంటి ప్రయత్నం ఆహ్వానించదగినదే. ప్రభుత్వ, ప్రయివేటు వ్యవస్థల్లోని సంఘటిత, అసంఘటిత రంగాలన్నీ ఇలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే నైపుణ్య లోపం యువతలో ఎక్కువవుతుండటం వల్ల ఉపాధి సాధన కష్టమౌతున్నదని అంతటా వినిపిస్తున్న రాగం. అందుచేత నైపుణ్య స్థాయిని బట్టి నూతనా విష్కరణల ద్వారా కొత్త ఉపాధిని కల్పిస్తే క్రమం తప్పని స్థిరత్వం ఏర్పడటం సులభం. కానీ అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టీకరణల ద్వారా జరుగుతున్న ఉపాధి కల్పనలో మధ్యవర్తుల ప్రమేయం పెరిగి యాజమాన్యమిచ్చే మొత్తం పారితోషికంలో కోతలు పెట్టి చెల్లిస్తున్నారు. అంతే కాకుండా ఉన్న ఉపాధిలోనే జీవిత కాలం కొనసాగవలసి వస్తుంది. కానీ ప్రభుత్వ రంగంలో ఉపాధి పొందినప్పుడు పారితోషికంలో కోతలేవీ లేకపోవడమే కాకుండా కాలక్రమేణా రావలసిన ఎదుగుదలలో ఎలాంటి నష్టమూ ఉండదు.
65శాతం మంది భారతీయులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. ఈ యువ మార్కెట్‌ను ఉపయో గించుకోవడానికి ,ఈ యువతరం విభిన్న అవసరా లను తీర్చడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్ల నైపుణ్యాలను పెంపొందించడానికి ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని పెంచడానికి, తద్వారా బీమా విస్తృతిని పెంచడానికి బీమా సఖి పథకం ఉపయోగపడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బీమా సఖి యోజనను ప్రోత్సహించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖతో ఎల్‌ఐసి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. గ్రామీణ కుటుంబాలకు వారి కుటుంబ ఆదాయాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశ్యం. బీమా ఉత్పత్తుల వినూత్న రూపకల్పనను ఎల్‌ఐసి చేపడుతున్న ఈ సందర్భం లో, బీమా సఖి ద్వారా నియామకాలు పొందిన వారు తమ కుటుంబ ఆదాయాలు పెంచుకోవడమే గాక, గ్రామీణ ప్రాంతాల్లో బీమా వ్యాప్తికి దోహద పడతారని ఆశిద్దాం.
– జి.తిరుపతయ్య డ పి.సతీష్
ప్రభుత్వ రంగంతోనే మహిళా సాధికారత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES