Sunday, July 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎరువుల కృత్రిమ కొరత

ఎరువుల కృత్రిమ కొరత

- Advertisement -

– దుకాణాల వద్ద బారులు తీరుతున్న రైతులు
– ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న అక్రమార్కులు
– ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు కేసులు నమోదు
– కొరత లేదంటున్న అధికారులు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో పలు చోట్ల ఎరువుల కోసం రైతులు డిపోల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. గంగల తరబడి క్యూలో ఉంటున్నారు. తగినంత ఎరువుల సరఫరా చేయడంలో కేంద్రం విఫలం కాగా.. మరోవైపు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సాగు ప్రారంభించిన రైతులకు.. ఆలస్యంగా వర్షాలు కురవడంతోపాటు అవసరమయ్యే ఎరువుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమైతే 3 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందింది. దాంతో జులై నెలలో తీవ్ర కొరత నెలకొంది. ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతున్నా.. ఎందుకీ సమస్య వస్తుందన్న దానిపై దృష్టిసారించడానికి సిద్ధపడటం లేదు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నా.. తూ.తూ మంత్రంగా తనిఖీలు తప్ప చర్యలు లేవు.

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొందరు ప్రయివేటు ట్రేడర్స్‌ కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఎరువులకు బదులు ఇతర ఎరువులను కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు కావల్సిన కంపెనీ ఎరువులు ఇవ్వకపోవడంతో ఆయా మండలాల్లో ప్రభుత్వ ఎరువుల కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత ఉందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 150 బ్యాగుల ఫెర్టిలైజర్‌ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అదేవిధంగా భీంపూర్‌ మండలం నుంచి ఇతర ప్రాంతానికి తరలిస్తున్న ఎరువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో అధికారులు విస్తృతంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నారు.

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక రైతులు వర్షాధారిత పంటలు పండిస్తుంటారు. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న తరుణంలో ఎరువుల కొరత అన్నదాతలను వేధిస్తోంది. ఎరువులు దొరకవేమోనని రైతులు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. పెద్దఎత్తున రద్దీ ఏర్పడటంతో నిర్వాహకులు టోకెన్‌ సిస్టమ్‌ ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయితే, వరుసలు కట్టిన రైతులను చూసి ఎరువుల కొరత తీవ్రంగా ఉందని పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగవుతున్న 17లక్షల ఎకరాలకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచామని, రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

సొసైటీలకు చేరిన ఎరువులు
వ్యవసాయ అధికారులు అవసరానికి మించి ఎరువులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించగా.. ఇదివరకే 50 శాతం ఆయా జిల్లాలకు ఎరువులు చేరాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన స్టాక్‌ నుంచి 50శాతం వరకు రైతులకు అందాయి. ఆగ్రో సేవా కేంద్రాలు, డీసీఎంఎస్‌, హాకా, పీఏసీఎస్‌, ఎన్‌జీఓస్‌, ప్రయివేటు డీలర్ల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించి రూ.266.50కు బస్తా విక్రయిస్తున్నారు. ఆయా మండలాల్లో సొసైటీలు అందుబాటులో లేక ఇతర మండలాలకు రైతులు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ
రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో మొత్తం 234 ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. యూరియా, డీఏపీ, ఎస్‌ఎస్‌పీ, ఎంఓపీ, కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విడతల వారీగా వచ్చిన ఎరువులను ఆయా సోసైటీలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాల్లో 20వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయగా మరో 25వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాకు 60వేల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉందని ప్రతిపాదించగా ప్రభుత్వం ఇదివరకు 28వేల మెట్రిక్‌ టన్నులు కేటాయించింది. అందులో 12వేల మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేయగా.. 16వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 78వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా.. 49వేల మెట్రిక్‌ టన్నులు జిల్లాకు చేరాయి. ప్రస్తుతం 14వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉండగా మరో 28వేల మెట్రిక్‌ టన్నులు రావాల్సి ఉంది.

రైతుల ఆందోళనలకు కారణమిదేనా?
ప్రయివేటు డీలర్లు తమకు ఎక్కువ మార్జిన్‌ లభించే ఎరువులను అంటగట్టేందుకు ఇతర కంపెనీలతో కుమ్మక్కై రైతులను ఆందోళనకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల కన్నా అత్యధికంగా ఉన్న ప్రయివేటు దుకాణాల యజమానులనే రైతులు నమ్ముతుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -