నవతెలంగాణ – జక్రాన్ పల్లి
అవసరం మెరా యూరియాను వాడండి.. అధిక దిగుబడి సాధించండి మండల వ్యవసాయ అధికారి దేవిక అన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని నవతెలంగాణ ఇంటర్వ్యూ..
నవతెలంగాణ: అసలు యూరియాలో ఏముంది ? ఎలా పనిచేస్తుంది ?
వ్యవసాయ అధికారి: యూరియా .. 46% నత్రజని కలిగిన అత్యంత శక్తివంతమైన ఎరువు, తెల్లని గుళికలు రూపంలో ఉన్న ఈ ఎరువు వెదజల్లుటకు అనుకూలంగా ఉంటుంది. తేలికగా నీటిలో కరిగి మొక్కకు అందుబాటులోకి మారుతుంది.
నవతెలంగాణ: యూరియా ఎక్కువగా వాడితే ఏమవుతుంది?
వ్యవసాయ అధికారి: యూరియా తేలికగా నీటిలో కరుగుతుంది, గాలిలో కలిసిపోతుంది కనుక గాలి, నీరు, కాలుష్యం.. చివరకు తల్లిపాలు కాలుష్యం అవుతాయి. ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడం, పూత ఆలస్యంగా వచ్చి పంట కలం పెరగడటం, తాలు గింజలు ఏర్పడటం జరుగుతుంది. బెల్లం దగ్గరకు చీమలు చేరినట్లు అధికంగా యూరియా వాడిన పంట చేలా దగ్గరికి చీడపీడలు సులభంగా చేరుతాయి! ఆర్థిక పెట్టుబడులు పెరగడం.. దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది.
నవతెలంగాణ:: మరి యూరియాతో ఎలా లాభం పొందాలి ?
వ్యవసాయ అధికారి: పైరుకు నత్రజని అవసరం మొదటి నుండి చివరి వరకు ఉంటుంది, కాబట్టి 3 -4 దఫాలుగా యూరియా వేయాలి. యూరియా వేసేటప్పుడు తేమ ఉండేలా చూడాలి. వరి నాట్లు వేసేప్పుడు, పిలక దశలో చిరుపొట్ట దశలో వేయాలి. అంతే కాదు నీరు తీసివేసి, బురద పదును మీద చల్లి 24 -48 గంటల తర్వాత నీరు పెట్టాలి.
యూరియా వేపపిండి కలిపి వేసుకుంటే నత్రజని సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు చీడపీడలను అరికడుతుంది. (50 కిలోల యూరియాను 5 కిలోల వేపపిండి కలపాలి) భూమిలో తగిన తేమ లేనప్పుడు, ఎరువును వేసిన తరువాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సమస్యాత్మక భూములలో నత్రజని అందించడానికి సాధారణంగా అన్ని పంటల మీద, ఫలవృక్షములు మీద 2 -3 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
మెట్ట పైర్లలో యూరియా వెదజల్లుట కాని మొక్క ప్రక్క గుంతలో వేసి మట్టి కప్పడం వలన యూరియా వృధానీ అరికట్టవచ్చును. ఎక్కువ మోతాదులో వేసే యూరియా … ఆకర్షిస్తుంది. చీడపీడలను అధికం చేస్తుంది. పెట్టుబడులను అవసరం మేర యూరియాను వాడి, అధిక దిగుబడి సాధించండి.