రూ.11 కోట్లు ఖర్చు తో శంకుస్థాపనలు
పరిపాలన భవనం, నీటి సరఫరా పైప్‌లైన్,
ఆడిటోరియం పునరుద్ధరణ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. శుక్రవారం యూనివర్సిటీ పరిపాలన విభాగం మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.9 కోట్ల అంచనా వ్యయంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అలాగే యూనివర్సిటీ అంతర్గత నీటి సరఫరా పైప్‌లైన్ నిర్మాణానికి రూ.2.10 కోట్లతో శంకుస్థాపన చేయగా, పునరుద్ధరించిన ఆడిటోరియంను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… శాతవాహన యూనివర్సిటీ స్థాపనలో తన పాత్రను గుర్తు చేశారు. 2008లో మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో స్థలాన్ని చూపి 200 ఎకరాలు సేకరించి వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేశామని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు యూనివర్సిటీకి కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేశామని, ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కళాశాలల ఏర్పాటు జరిగిందన్నారు. విద్యా రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఐటీ ఐ లను, ఏ టీ సీ లుగా అభివృద్ధి చేయడం జరుగుతోందని చెప్పారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్‌కి ప్రాధాన్యత ఇస్తూ, పోటీ ప్రపంచంలో విజయాలు సాధించేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి ఫేజ్ కౌన్సిలింగ్‌లో 240 సీట్లలో 160 సీట్లు నిండాయని మంత్రి పేర్కొన్నారు. డిసెంబర్ 4న సీఎం పెద్దపల్లిలో లా, ఇంజనీరింగ్ కాలేజీల స్థాపనపై అధికారిక ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో విద్యకు సంబంధించిన ఏ సమస్య అయినా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉద్యోగ భర్తీల్లో వేగం…
ఇప్పటివరకు రాష్ట్రంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం, వచ్చే మార్చ్‌లోపు మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచినట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్టు వివరించారు. తన ఎంపీ కాలంలో కరీంనగర్, సిరిసిల్లకు కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూల్‌లు, పాస్‌పోర్ట్ ఆఫీస్, తిరుపతి రైలు వంటి సేవలు తీసుకొచ్చిన విషయాలను మంత్రి గుర్తు చేశారు. శాతవాహన ఉత్సవాలను కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించాలని, యూనివర్సిటీ ప్రాంగణంలో శాతవాహనుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ డా. పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.