నవతెలంగాణ… అనుదినం జనస్వరమై… ప్రతి అక్షరం ప్రజా పక్షమై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకొని పదో ఏడాదిలోకి పయనిస్తోంది. సమాజంలో నెలకొని ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక దొంతరలను ఎండగడుతూ, ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు సాగుతోంది. రచయితలు, కాలమిస్టులు, పాఠకులు, శ్రేయోభిలాషుల అండదండలతో ప్రజల గొంతుకై నినదిస్తోంది. అన్ని రంగాల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను, సాధిస్తున్న విజయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ ముందుకు నడుస్తోంది. ముఖ్యంగా ఆదివారం అనుబంధం సోపతి ద్వారా ఇంటిల్లపాది చదువుకునే వాళ్ల విజ్ఞాన సంచికగా ఎంతో మందికి చేరవయింది. పత్రికను ఆదరిస్తూ, చేయూతనిస్తూ, అభిమానిస్తూ సమసమాజ దిశగా పయనిస్తున్న మన నవతెలంగాణ మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్న పాఠకుల అభిప్రాయాలు నేటి సోపతిలో…
సామాజిక చైతన్యంతో…
భౌతిగోళికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా తెలంగాణ ఒక ప్రత్యేక ఆస్థిత్వమున్న ప్రాంతం. ఈ ప్రాంతంలోని చైతన్యాన్ని సాహితీ రూపంలోకి పరిచయడం చేయడానికి నవతెలంగాణ పత్రిక మంచి ప్రయత్నం చేస్తుంది. ఇక ఆదివారం ప్రధానంగా ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, సాహితీ అభిలాషలు ప్రతిబింబించే విధంగా సోపతి ఆదివారం సంచిక ఆహ్వానించదగ్గది. నేను ప్రతివారం సోపతి చదువుతుంటాను. అన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి. చరిత్ర, వారసత్వం, సాహిత్యం, మనోఉల్లాసం, సామాజిక విషయాలతో కూడి సకల అంశాల సమ్మేళనంగా సోపతి ఉంది. సోపతి అంటే తెలంగాణలో దోస్త్ (స్నేహితుడు) అని అర్థం. పేరుకు తగ్గట్టుగా నిజంగానే సాహితీ అభిమానులకు, ప్రగతిశీల కాముకులకు, సమాజంలో మార్పు, ఆ మార్పు చైతన్యవంతంగా ఉండేలా, ప్రశ్నించేలా ఉన్నత విలువలతో ఉండేలా ప్రజలతో సోపతి మంచి దోస్త్‌గా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఈ సోపతి మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. మారుతున్న పరిస్థితులకు, సామాజిక విలువలకు, సమాజిక చైతన్యానికి అనుగుణంగా మరింత ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా పది వసంతాల చరిత్రను పూర్తి చేసుకొని పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్న నవతెలంగాణకు అభినందనలు. సోపతి ద్వారా ప్రజలకు సాహిత్యాన్ని, ఈస్టటిక్స్‌ను సౌందర్య ఆహ్లాద విలువలను పరిచయం చేస్తున్నందకు నా తరపున, అన్ని జిల్లాల గ్రంథాలయ శాఖల తరపున హృదయపూర్వక శుభాక్షాంక్షలు. ఈ సోపతి భవిష్యత్తులో మరింత మందితో సోపతి చేయాలని మనసారా కోరుకుంటున్నాను.
– డా.రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్.
అభినందన
నవతెలంగాణ దినపత్రిక ఆదివారం సంచిక ‘సోపతి’ పెద్దలని, పిల్లలని, కవులని, రచయితల్ని, సినీ ప్రేమికులతో పాటు అన్ని వర్గాల పాఠకులని అలరిస్తుంది, ఆలోచింపచేస్తుంది. ఈ సంచికలో శీర్షికలు ‘అంతరంగం, సినీ వ్యాసాలు, కథ, కవిత్వం, సమీక్షలు’ చదువరులను ఆకట్టుకునే రీతిలో సరళమైన భాషలో ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయా వారంలో ముఖ్యమైన సందర్భంపై వస్తున్న కవర్ స్టోరీలో ప్రచురితమవుతున్న వ్యాసాలు సోపతికి హైలెట్‌గా నిలుస్తూ వైవిద్యంగా ఉంటున్నాయి. అలాగే ‘నెమలిక’ శీర్షిక పిల్లల ఐక్యూ పొంచేందుకు దోహద పడుతుంది. అక్షర దోషాలు లేకుండా, రంగురంగుల చిత్రాలతో చక్కటి పేజీ లె-అవుట్‌తో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకుని తెలుగు పాఠకుల మనసులో ‘సోపతి’ చెరగని ముద్రని వేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నవతెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, ఎడిటోరియల్ సిబ్బందికి, వ్యాసకర్తలకు, సోపతి రూపకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు.
– డా. పొన్నం రవిచంద్ర, కవి,రచయిత, ఫిల్మ్ క్రిటిక్
నవ ‘తెలంగాణ కలంతో ప్రజల గళం’
పదో ఏడాదిలోకి పయనమైన నవ తెలంగాణకు శుభాకాంక్షలు. అమ్మ కడుపులో పుట్టిన ప్రతి బిడ్డ గొప్పగా కాలేదు. విభిన్న రకాల మనసులు, అభిప్రాయాలు, లక్షణాలు కలిగి ఉంటారు. కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవిస్తూ తనకంటూ ఒక గుర్తింపు స్థాన్నాని పొందినప్పుడే ఆ బిడ్డకు పుట్టుకు సార్ధకత చేకూరుతుంది. అదే.. దట్ ఈజ్ నవతెలంగాణ. ఈ రాష్ట్రంలో అనేక పత్రికలు విభిన్న లక్షణాలు, అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు ప్రతిబింబిస్తూ ఒక మార్గదర్శకంగా ఉంటూ జర్నలిజం వృత్తికి వన్నె తెస్తుంది. అనునిత్యం నిక్కచ్చిగా, నికరంగా, నిజాయితీగా, నిబద్ధతగా, కట్టు కల్పితాలు లేకుండా ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక దినపత్రిక నవతెలంగాణ. ఎన్ని ఆటపోట్లు, అవంతరాలు వచ్చినా అధిగమిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. అనేక శీర్షిక, కథనాలు, వార్తలుతో నవతెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తుంది. తొమ్మిదేండ్లు పూర్తి చేసుకోని పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా నవతెలంగాణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. సండే వచ్చిందంటే సందడి ఉండాలని శోధించి రాస్తుంది సోపతి. ప్రకృతి అందాలను పసిగట్టి ప్రతిబింబిస్తుంది. యువతీ యువకులకు ఉత్సాహం నింపుతుంది జోష్. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వులు పువ్వుల్. బాలలకు బాలసాహిత్యం. మనిషి ఎదుగుదలకు కెరీర్ ముఖ్యం. అనేక సమస్యలతో మానసికంగా కుంగిపోతున్న వారికి మానసిక వికాసం… ఇవే కాదు అనేకం చూడొచ్చు సోపతిలో. ఇలా మేధావుల అభిప్రాయాలు, వ్యాసాలు, చరిత్ర, సాంస్కృతి, సాంప్రదాయాలు, త్యాగాలు పోరాటాలను బుక్కు రూపంలో మలిచి ప్రజల్లో చైతన్యాన్నింపటానికి ఈ సమాజానికి అందిస్తుంది నవతెలంగాణ. అందకే ఈ పత్రిక మన అందరి పత్రిక.
– గడగోజు రవీంద్రాచారి, 9848772232
సాహిత్యపు విలువలతో…
నవ తెలంగాణ సోపతిలో నా ‘చౌరస్తా’ కాలమ్ ఏప్రిల్ 12, 2015న ఆరంభమైంది. కరోనా కల్లోలం వచ్చిన తర్వాత సోపతి డిజిటల్‌గా మారేంతవరకు ప్రతి వారం చౌరస్తా ఉండేది. 2020 తర్వాత ఆల్టర్నేట్ ఆదివారాలలో చౌరస్తాని అందిస్తున్నాను. ఈ కాలమ్‌తో పాటు కవితలు, కథలు, సమీక్షలు, కవర్ పేజీ వ్యాసాలు అందించాను. నవ తెలంగాణ ఆదివారం అనుబంధంగా ఒక వారపత్రికకు ఉండాల్సిన అన్ని మెరిట్స్‌తో పాటు ఆరంభమైన సోపతిలో మొదట్లో సీరియల్ కూడా ఉండేది. ప్రామాణికమైన కవితలు,కథలు, కవర్ పేజీ కథనాలు,వ్యాసాలు, సమీక్షలు, బాల సాహిత్యం, హాసవిలాసం వంటి అంశాలతో అన్ని రకాల పాఠకులను ఆకట్టుకునే నవతెలంగాణ సోపతి ఆదివారం ఉబుసుపోకకు తిరగేసే పత్రికగా కాకుండా ఒక సాహిత్య వారపత్రికగా ఆరంభించారు. సాహిత్యపు విలువలని కొనసాగిస్తూ సాహిత్యంతో పాటు సామాజిక సాంస్కృతిక మానసిక సంబంధమైన విషయాలతో వార వారం కొత్త అంశాలతో నవతెలంగాణ సోపతిని అందిస్తున్నందుకు పత్రికను అభినందిస్తున్నాను. నవ తెలంగాణ సోపతి ఇలాగే కలకాలం పాఠకులను ఆత్మీయంగా స్పర్శించి పలకరించాలని ఆశిస్తున్నాను.
– చింతపట్ల సుదర్శన్
ప్రజల గొంతుకై…
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలను అనేక రంగాలు ప్రతిబింభించేలా పనులు జరిగాయి. సాంస్కృతి, సాహిత్య రంగాల్లో ఇది ప్రధానంగా కనిపించింది. అందులో భాగంగా పత్రికా రంగంలో కొన్ని ఆధిపత్యశక్తులు తప్ప ప్రజాస్వామ్య, సాంస్కృతిక రంగాలతో పనిచేసిన ప్రతి సంస్థ ఆ దిశగా నడిచింది. అలా కొత్త వెలుగుగా కొత్త పేరుతో ప్రారంభమైన నవ తెలంగాణకు పదేండ్లు. ‘నవ తెలంగాణ’ దిన పత్రిక తన ఆశయాలకు అద్ధంగా నిలుస్తూనే ఇటు ప్రజల గొంతుకై నిలవడం విశేషం. పదేండ్లలో ఆ స్వరం మరింగ గట్టిగా నిలిచింది. శీర్షికలు, రచనలు, నిర్వహణలో అది అక్షరమక్షరాన కనిపిస్తోంది. ఆగామి కాలంలో ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూనే పీడితుల చేతిలో జండాయై, ప్రజల పక్షాన ప్రతిపక్షమై నిలవాలని కోరిక. ఇక ఇందులోని శీర్షికలు, రచయితల రచనలు పత్రిక ఆశయాలకు అచ్చంగా సరిపోవడమే కాక హేతువు, ప్రశ్న, ఆలోచన కలిగించేవిగా ఉండడం అభినందనీయం. అయితే వైజ్ఞానిక అంశాల విషయంలో పత్రిక మరింతగా చొరవ తీసుకోవాల్సిన అవసరముందని నాభావన. దీనికి తోడు రేపటి వారసత్వమైన యువతరంతో పాటు, ఎదుగుతున్న ఎదగాల్సిన కొత్త తరమైన బాలల కోసం లేదా వారికి సంబంధించిన అంశాల కోసం వీలుని బట్టి స్థానాన్ని కల్పించాల్సిందిగా కోరిక. మహిళలకు సంబంధించిన శీర్శికలు ఆలోచనాత్మకంగావున్నాయి. నవంతెలంగాణ పదేండ్ల పండుగ సందర్భంగా… కుటుంబ సభ్యులందరికి ఆత్మతో అభినందనలు…
– పత్తిపాక మోహన్, ‘బాల సాహితీ శిఖరాలు’ కాలం రచయిత
అభినందనలు.
2016లో ఈ పత్రిక మానవి పేజీలో జోగిని నవలా రచయితగా నన్ను పరిచయం చేసినప్పటి నుండి పత్రికతో అనుబంధం ఏర్పడింది. ఆదివారం అనుబంధంగా వచ్చే సోపతితో అనుబంధం మరింత ఎక్కువ అనే చెప్పాలి. సాధారణంగా దినపత్రికల ఆదివారం అనుబంధం సమాచారం, వినోదం, పాఠకుల ఆసక్తిని రేకెత్తించే అంశాలతో నిండి రోజువారి వార్తలకు భిన్నంగా ఉంటుంది. మిగతా దినపత్రికల ఆదివారం అనుబంధం తో పోల్చినప్పుడు సోపతి కొంత భిన్నంగా ఉంది. ఫీచర్స్, వ్యాసం , కథ, సంస్కృతి , చరిత్ర వాటితో పాటు బాల సాహిత్యానికి పెద్ద పీట వేసి ఒక పేజీ బాల సాహితీకారుల పరిచయం కోసం, మరో పేజీ బాల సాహిత్యం కోసం) కేటాయించడం గొప్ప విషయం. అంతేకాకుండా హాస్యానికి కూడా చోటు ఉండడం. సమయం, సందర్భం ప్రకారం ప్రధాన వ్యాసం కోసం అంశం ఎంపిక చేసుకుని ఆ అంశంతో లోతైన అవగాహన ఉన్న రచయితలతో వ్యాసం రాయించడం వల్ల నాణ్యమైన రచనలు వస్తున్నాయి. నా మటుకు నేను ఆదివారం అనుబంధం కోసం ప్రత్యేక వ్యాసాలు రాయాలని, రాస్తానని అసలు అనుకోలేదు. అటువంటిది సోపతి కోసం రాశాను. ఆ అవకాశం కల్పించిన సోపతి టీం కి ధన్యవాదాలు. అనేక ఆసక్తికరమైన కథనాలతో సమాజంలో సానుకూల మార్పుకు లోతైన విశ్లేషణలతో వస్తున్న ఈ ఆదివారం అనుబంధంలో పర్యావరణం, పర్యటక ట్రావెల్ గైడ్స్ , సాహస యాత్రలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, గ్రీన్ లివింగ్, సాధారణ వ్వక్తుల అసాధారణ పనుల వంటి వాటితో విభిన్న వ్యక్తుల భిన్న వయసుల ఆసక్తులు పాఠకులకు మరింత చేరువ కావాలని అభిలషిస్తున్నా. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికగా వస్తున్న సోపతి ప్రింటు రూపంలో కూడా వేస్తే మరింత మందికి చేరువ అవుతుంది
– వి.శాంతి ప్రభోద
సోపతికి శుభాకాంక్షలు
సోపతి అంటేనే తోడు. అచ్చమైన తెలంగాణ పదం. ఈ పేరుతోనే ప్రత్యేకంగా పుస్తకం రావడం అంటే ఒక మనిషి మానసిక వికాసానికి ఎటువంటి తోడు కావాలో వాటన్నింటిని కలబోసి అందించడమే. నవ తెలంగాణ పత్రికకు అనుబంధంగా వస్తున్న సోపతిలో అనేకానేకాంశాలు ప్రచురితమవుతున్నాయి. సకుటుంబ సమేతంగా చదవగలిగే అంశాలన్నింటినీ ఒకేచోట అందించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వయసుల వారికి కావలిసిన సమగ్ర సమాచారాన్ని అందించేందుకు సోపతి టీమ్ విశేషంగా కృషి చేస్తున్నారు. ముఖచిత్ర కథనాలు కూడా బాగుంటున్నాయి. ఇందులో సమకాలీన అంశాలతోపాటు చారిత్రక అంశాలకు చోటు కల్పిస్తుండటం విశేషం. పదేళ్లుగా నిరంతరాయంగా పాఠకుల మదిలో చెరగని ముద్ర వేసిన, వేస్తున్న సోపతికి శుభాకాంక్షలు. ఇప్పటికి కొనసాగుతున్న శీర్షికలన్నీ మేలైనవిగానే ఉన్నాయి. వీటికితోడు స్ఫూర్తిదాయకమైన మహిళల కోసం, సైన్స్, ఫ్యాషన్ కోసం కూడా శీర్షికలు కేటాయిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. – నస్రీన్ ఖాన్
సకల విషయాల సమాచార సంపతి
ఒక వ్యాసం విషయ సమాచారాన్ని ఇస్తే, మరో వ్యాసం జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక ఆదివారం అనుబంధంలో సంపాదకీయం, రాజకీయం, అంతర్జాతీయ సమకాలీన విషయాల మీద అవగాహనా వ్యాసాలు, కథ, కవిత్వ, విమర్శ, పాట, బాలసాహిత్యం, కవర్ స్టోరీ ఇన్ని విభిన్న అంశాలు పొందుపరచడం కష్టసాధ్యం. సోపతి అలాంటి ఒక సకల విషయాల సమాచార సంపతి. ఆదివారం కోసం ఎదురుచూడడం సోపతి కోసం ఎదురుచూడడమే. కొన్ని విలువలకు కట్టుబడి ఒక పత్రికను నడపడం, అదీ ఈరోజుల్లో నడపడానికి చాలా శక్తి, సిద్దాంత బలం, ఆర్థిక బలం, నమ్మిన విలువల్ని ఆచరిస్తూ, వెంట నడిచే మనుషులు, ఆశయాన్ని కొనసాగించాలన్న పట్టుదల కావాలి. ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే మేధలు జత కలవాలి. చేతులు కలపాలి. సోపతి నాలుగు చెరుగుల నుండి వచ్చే ఆలోచనలకు ఆలవాలమైన సోపతి. ఏ పాపులర్ పత్రిక ఆదివారం అనుబంధానికి కూడా తీసిపోకుండా నాణ్యతగా నడపడానకి సంపాదకులు చేస్తున్న కృషి స్పష్టంగా తెలుస్తుంది. నవతెలంగాణ ఇలాంటి విలువైన అనుబంధాలని చిరకాలం కొనసాగించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. – పి.శ్రీనివాస్ గౌడ్