Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంన్యాయవాదం వృత్తి కాదు.. బాధ్యత

న్యాయవాదం వృత్తి కాదు.. బాధ్యత

- Advertisement -

– ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌ : యువ అడ్వకేట్లకు మంత్రి శ్రీధర్‌ బాబు సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

న్యాయవాదం వృత్తి కాదనీ, అది సమాజంతో ముడిపడి ఉన్న గొప్ప బాధ్యతగా భావించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో లెక్స్‌ విట్‌ నెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రాండ్‌ మాస్టర్‌ 2025 హైదరాబాద్‌ ఎడిషన్‌’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాదనీ, సమానత్వాన్ని అందించే వాస్తు శిల్పులు, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన హక్కులకు సంరక్షకులని కొనియాడారు. ‘చట్టాన్ని తెలుసుకోవడమే కాదు, మార్పులకు అనుగుణంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే నేర్పును అలవర్చుకోవాలి. నిజమైన క్లయింట్‌ కేవలం మిమ్మల్ని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ మాత్రమే కాదు. మీపై ఆధారపడిన వ్యవస్థ అని కూడా గుర్తించాలి. రాజ్యాంగ పీఠిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందించేందుకు కృషి చేయాలి. ఎల్లప్పుడూ న్యాయం పక్షానే ఉండాలి’ అని యువ న్యాయవాదులకు మంత్రి సూచించారు. ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్‌ ‘ఎమర్జింగ్‌ లీగల్‌ టెక్‌ హబ్‌’ గా మారుతోందని అన్నారు. ‘ఒక న్యాయవాదిగానే నా ప్రస్థానం మొదలయ్యింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటికీ… ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో అనేక మార్పులొచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగింది. ఏఐ ఆధారిత న్యాయ పరిశోధన, వర్చువల్‌ కోర్టు రూమ్‌లు, రియల్‌ టైమ్‌ కేసు ట్రాకింగ్‌, ఈ-ఫైలింగ్‌ లాంటివి అందుబాటులోకొచ్చాయి’ అని మంత్రి వివరించారు. కార్యక్రమంలో లెక్స్‌ విట్‌ నెస్‌ ప్రతినిధులు అభిజిత్‌, శ్రీనివాస్‌, పలు కంపెనీల లీగల్‌ హెడ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -