– రెట్టింపు బిల్లులతో వినియోగదారుల బెంబేలు
– కట్టి తీరాల్సిందేనని తేల్చి చెప్తున్న అధికారులు
– కోట జంక్షన్లో ఉన్న ఫ్రూట్ జ్యూష్ షాపు యజమాని ఆర్‌వి నర్సింహంకు ఈ ఏడాది మార్చి వరకూ నెలకు రూ.1,800 నుంచి 1,900 వరకు విద్యుత్ బిల్లు వచ్చేది. స్మార్ట్ మీటరు పెట్టిన తర్వాత ఏప్రిల్‌లో రూ.2,733, మేలో రూ.3,922, జూన్‌లో రూ.4,106, జులైలో రూ.3,908 బిల్లు వచ్చింది. చిన్న షాపు నడుపుకుంటున్న తనకు ఇంత బిల్లులు వస్తే ఎలా బతుకుతామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– పావనీ నగర్‌లో చిన్న టైలరింగ్ షాపుతో జీవనోపాధి పొందుతున్న దుర్గమ్మకు గత మార్చిలో రూ.315 బిల్లు వచ్చింది. స్మార్ట్ మీటరు పెట్టాక ప్రతి నెలా రూ.550 దాటి బిల్లు వస్తోంది.
– గణేష్ కోవెల వద్ద పాన్‌షాపు నడుపుతున్న అబ్దుల్ షహీద్ షాపునకు ఫిబ్రవరిలో రూ.988 బిల్లు వచ్చింది. స్మార్ట్ మీటరు పెట్టాక మేలో రూ.1,331, జూన్‌లో 1,578, జులైలో రూ.1,441 బిల్లు వచ్చింది.
ఇవీ కొన్ని ఉదాహరణలే.. స్మార్ట్ మీటర్లతో అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు వస్తుండడంతో విజయనగరంలో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. దీనిపై అధికారులను సంప్రదిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఎంత బిల్లు వస్తే అంతా కట్టి తీరాల్సిందేనని తేల్చి చెప్తుండడంతో వినియోగదారులు ఆవేదనకు గురవుతున్నారు. స్మార్ట్ మీటర్ల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పాత మీటర్లు ఉన్నప్పుడు ఇంటింటికీ వచ్చి రీడింగ్ తీసి బిల్లు ఇచ్చేవారు. ఈ బిల్లులో ఎన్ని యూనిట్లు వినియోగించారు, ఎంత బిల్లు కట్టాలో స్పష్టంగా పేర్కొనేవారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత వినియోగదారులకు సెల్‌కు ఎంత బిల్లు కట్టాలో మెసేజ్ మాత్రమే వస్తోంది. ఎన్ని యూనిట్లు వినియోగించారో వివరాలు అందులో ఉండడం లేదు. తమ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంప్రదిస్తే ఎన్ని యూనిట్లు వాడాలో తెలియజేస్తామని అధికారులు బదులిస్తున్నారు. దీంతో, కార్యాలయానికి వెళ్లలేక వచ్చిన బిల్లును వినియోగదారులు చెల్లిస్తున్నారు. కొంతమందికి మెసేజ్‌లు కూడా రావడం లేదు. విద్యుత్ కార్యాలయానికి వెళ్లి సంప్రదించాల్సి వస్తోంది. విద్యుత్ వినియోగం పెరగకపోయినా విద్యుత్ బిల్లులు పెరుగుతుండడం, కొందరికి రెట్టింపు బిల్లు వస్తుండడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల పెట్టనీయకుండా ప్రజలు అడ్డుకోవాలని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరారు.
– విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డులో ఉంటున్న ఫర్నిచర్ షాపు యజమాని మందాన అశోక్ కుమార్ షాపునకు అధికారులు ఇటీవల అదాని స్మార్ట్ మీటరు బిగించారు. పాత మీటరు ఉన్నప్పుడు నెలకు రూ.5 వేలు నుంచి రూ.6 వేలు బిల్లు వచ్చేది. జనవరిలో ఆయనకు రూ.5,569 బిల్లు వచ్చింది. అదాని స్మార్ట్ మీటరు బిగించాక మే, జూన్ నెలలకు కలిపి రూ.18,524 బిల్లు వచ్చింది. అంతమొత్తం ఒకేసారి చెల్లించలేక రూ.10,022లను చెల్లించారు. మిగిలిన బ్యాలెన్స్‌ను తర్వాతపైనా చెల్లించాల్సిందేనని అధికారులు ఆయనకు తేల్చి చెప్పారు.
ఏపీలో’స్మార్ట్’గా వాత
- Advertisement -
- Advertisement -