నితీశ్ ప్రభుత్వంపై చిరాగ్ అసహనం
బీహార్‌లో నేరాలు పెరిగిపోవటంపై కేంద్రమంత్రి ఆగ్రహం
పాట్నా : బీహార్‌లో ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై అధికార కూటమిలో భాగస్వామ్య పక్షమైన లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు ఎంతో విచారంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై చిరాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళను గయలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్తూ అంబులెన్సులోనే ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలను అదుపు చేయ డంలో నితీష్ ప్రభుత్వం విఫలమైందని, ఇలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు విచారిస్తున్నానని శనివారం మీడియా ఎదుట చెప్పారు.
‘బీహార్‌లో నేరాలు జరుగుతున్న తీరును గమనిస్తుంటే, అధికార యంత్రాంగం క్రిమినల్స్ ముందు పూర్తిగా మోకరిల్లినట్లు కనిపిస్తోంది’ అని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఒకటి తర్వాత ఒకటిగా హత్యలు, దోపిడీలు, నేరాలు, దొంగతనాలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, ఇవి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో భయానక పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం నేరస్థులతో కుమ్మక్కైనా అయిఉండాలి… లేదా ఆ వ్యవస్థ నిర్వీర్యమైనా అయి ఉండాలి. ఇలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు సిగ్గు పడుతున్నాను’ అని చెప్పారు. నితీశ్ ప్రభుత్వంపై చిరాగ్ ధ్వజమెత్తడం ఇదేమీ మొదటిసారి కాదు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో జరిగిన హత్యపై గత వారం ఆయన స్పందిస్తూ నేరస్తుల మనోబలం ఆకాశాన్ని తాకుతోందని ఎద్దేవా చేశారు. నేరస్తులు చట్టాన్ని, పాలనా యంత్రాంగాన్ని బహిరంగంగానే సవాలు చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌లో ఇంకా ఎన్ని హత్యలు జరగాలని ప్రశ్నించారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ మొత్తం 243 స్థానాలకూ పోటీ చేస్తుందని చిరాగ్ ప్రకటించారు.
ఎన్డీఏలో లుకలుకలు
- Advertisement -
- Advertisement -