– యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి
– కార్మికుల భద్రత పట్ల నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు తీవ్రం చేస్తాం : సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, పి.పాండు రంగారెడ్డి
– డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ముందు సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ-రామచంద్రాపురం
సిగాచీ పరిశ్రమ ఆస్తులు జప్తు చేసి.. ప్రమాద బాధిత కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, కోటి రూపాయలు నష్టపరిహారం ఒకే విడతలో చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, పి.పాండురంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టాలని, కార్మికుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీస్ ముందు శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మానిక్, పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 25 రోజులు దాటినా బాధిత కుటుంబాలను పట్టించుకునే నాధుడు లేడన్నారు. ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతిచెందడంతో ఆ కుటుంబాలు అనాధలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి రూ.10 లక్షల నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఇప్పటికీ బాధితులను పట్టించుకున్న వారు లేరన్నారు. ఆచూకీ దొరకని ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఇచ్చి ఇండ్లకు పంపారన్నారు. మూడు నెలల తర్వాత మిగతా రూ.85 లక్షల పరిహారం ఇస్తామని అధికారులు, యాజమాన్యం ప్రకటించిందని చెప్పారు. మృతదేహాలు దొరికిన 46 కార్మిక బాధిత కుటుంబాల్లో 15 కుటుంబాలకే రూ.10 లక్షల చొప్పున చెల్లించారని, మిగతా వారికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పరిహారం ఇస్తారో లేదోనన్న ఆందోళనతో బాధితులు ఉన్నార న్నారు. ఇంతటి ప్రమాదానికి కారణమైన సిగాచీ యాజమాన్యంపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల భద్రత, సంక్షేమం పట్టించుకోని ప్రభుత్వాల విధానాలపై కార్మికుల ఐక్యంగా పోరాడాలన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టాలని, తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత పట్ల నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సత్తిబాబు, వీరారావు, మధుకర్‌రెడ్డి, రామకృష్ణ, గంగాధర్, నర్సింలు, వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.
‘సిగాచీ’ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES