– కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్
గతంలో ఆదేశించిన మేరకు పిటిషనర్‌కు రెండు నెలల్లోగా వేతన బకాయిలను చెల్లించాలనీ, లేనిపక్షంలో జైలుకెళ్లాలని కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ యాదగిరిని హైకోర్టు ఆదేశించింది. ఈసారి జీతం చెల్లించకపోతే రెండు నెలలు జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మోడల్ డిగ్రీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరావును తొలగించడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు గతంలోనే తప్పుపట్టింది. పూర్తి వేతనం చెల్లించాలనే ఆదేశాలను అమలు చేయలేదంటూ పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందనీ, మరోసారి ఉత్తర్వుల అమలుకు గడువు ఇస్తున్నామని జస్టిస్ పి. మాధవీదేవి చెప్పారు. ఈసారి మెడికల్ మినహా జీతం బాకీలు చెల్లించాలని, లేనిపక్షంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీర్పులో పేర్కొన్నారు.
ఎంప్లాయిస్ కమ్యూటేషన్ విధానం కరెక్టే
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యూటేషన్ విధానంలో తీసుకున్న డబ్బును 15 ఏండ్ల గడువులో వాయిదాల పద్ధతిపై చెల్లించాలనే నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు వెల్లడించింది. కమ్యూటేషన్ పెన్షన్ రూపంలో ఏకమొత్తంలో తీసుకున్న డబ్బును అసలు, వడ్డీలతో కలిపి 11 ఏండ్ల మూడు నెలలు మాత్రమే వసూలుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ రిటైర్డు ఉద్యోగులు వేసిన వంద పిటిషన్లను కొట్టివేసింది. తమకొచ్చే పెన్షన్ సొమ్ములో కమ్యూటేషన్ పెన్షన్ కింద ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15ఏండ్ల పాటు రికవరీ చేయడం చెల్లదన్న వాళ్ల వాదనను జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తెలంగాణ సివిల్ పెన్షన్స్ (కమ్యూటేషన్) రూల్ 18ని సవాల్ చేయడాన్ని తప్పుపట్టింది. రూల్ 18 ఏం చెబుతుందో తెలిసే ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ విధానాన్ని ఎంచుకున్నారనీ, ఇప్పుడు పిటిషన్ వేయడం చెల్లదని తీర్పు చెప్పింది.
జీతం చెల్లించండి..లేదంటే జైలుకెళ్లండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES