– వరంగల్ జిల్లా ప్రగతికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : రివ్యూ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మామునూరు ఎయిర్‌పోర్టు పనులపై దృష్టి సారించాలనీ, పనుల్లో వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి, మంత్రులు కొండా సురేఖ, డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలనీ, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను సీఎం ఆదేశాల మేరకు వారంలో ఒకటి, రెండుసార్లు సందర్శించాలని సూచించారు. వరంగల్ నగర అభివృద్ధి, వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్‌టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై మంత్రులు సంయుక్తంగా సమీక్షించారు. అందులో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాశ్, ఎంపీ పి. బలరాం నాయిక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, నాయిని రాజేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, అంజిరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్, రాహుల్ శర్మ, రిజ్వాన్ భాషా షేక్, ఆయా జిల్లాల ఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్ పోర్టు నిధులు కేటాయించి నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వెటర్నరీ ఆస్పత్రులను కలెక్టర్లు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పరిశీలిం చాలన్నారు. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించి డీపీఆర్, టెండర్, పనులు ప్రారంభించడానికి, పూర్తి చేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని పనిచేయాలని సూచిం చారు. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమిని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని సూచించారు. భూ సేకరణకు ఆర్ధిక ఇబ్బందులు లేవనీ, రెండు రోజుల క్రితం రూ. 205 కోట్లను విడుదల చేశామని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు సంబంధించి ప్రగతి జరుగు తుందన్నారు. మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్ధానిక యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రూ. 4,170 కోట్లతో 2057 జనాభాను దృష్టిలో పెట్టుకుని వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామనీ, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించడానికి వీలుగా పనులను విభజించుకొని దశల వారీగా చేపట్టాలని సూచిం చారు. భద్రకాళి దేవాలయ అభివృద్ధి పనులు వచ్చే దసరా నాటికి పూర్తిచేసేలా ప్రణాళికను రూపొందించుకొని పనిచేయాలని ఆదేశించారు.
ఎయిర్‌పోర్టు పనులపై దృష్టి సారించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES