Sunday, July 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

- Advertisement -

– సీఎంపై వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం
– కొండాపూర్‌ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం
– గచ్చిబౌలి పోలీసుల బందోబస్తు
నవతెలంగాణ- శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డిపై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అటు వైపుగా వెళ్లకుండా బందోబస్తు నిర్వహించారు. దాంతో వారు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి విరమించుకొని.. కొండాపూర్‌ చౌరస్తాలో కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదిలా ఉంటే, బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం హీరోయిన్ల ఫోన్లను ట్యాప్‌ చేయిస్తున్నారు.. ప్రయివేట్‌ హ్యాకర్లతో కలిసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. రాత్రి 2 గంటల సమయంలో మైహౌమ్‌ భుజ అపార్ట్‌మెంట్‌కు హీరోయిన్‌ను కలవడానికి వెళ్లారు..’ అంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపాయి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కౌశిక్‌రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, పార్టీ పెద్దల ఆదేశానుసారం ఆ కార్యక్రమాన్ని విరమించుకుని కొండాపూర్‌ చౌరస్తాలో కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ.. కౌశిక్‌రెడ్డి వెంటనే సీఎం రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా స్వీయ నియంత్రణ లేకపోతే అతన్ని ఎక్కడికక్కడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కాంగ్రెస్‌ మహిళా నేత కల్వ సుజాత ఫిర్యాదు చేశారు.
రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్‌ రాజేంద్రనగర్‌ డివిజన్‌ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పాడి కౌశిక్‌రెడ్డిపై రాజేంద్రనగర్‌ పోలీసులు బీఎన్‌ఎస్‌ 356(2),353(బి)352 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌ సంస్కృతి కేవలం బీఆర్‌ఎస్‌కే ఉందని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. శవం పేరు చెప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్‌రెడ్డి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదన్నారు. అలాగే కేశంపేట, శంకర్‌పల్లి, ఆమనగల్‌ పోలీసుస్టేషన్లలో కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -