రూ.160 కోట్ల దోపిడీకి తెరతీసిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు…
కాంగ్రెస్ నాయకుల తీరుతో కంపెనీలు పారిపోతున్నాయి
బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – పరకాల
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు సమీపంలో నాలా నిర్మాణం కోసం 160 కోట్ల దోపిడీకి మంత్రులు ఎమ్మెల్యేలు తెరలేపారని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థాపించిన పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500మంది మహిళలకు గతంలో కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరికి ఆదివారం పరకాల లలిత కన్వెన్షన్ హాల్లో పరకాల, నడికూడ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు పపిణి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. మెగా టెక్స్టైల్ పార్క్ సమీపంలో కాలువ నిర్మించడానికి జనవరి నెలలో రూ.137 కోట్లతో టెండర్లు పిలిచి టెండరింగ్ పూర్తి అయినప్పటికీ, ఆ పనికి తట్టెడుమట్టికూడ పోయకుండానే మార్చి నెలలో అదే పనికి ఎస్టిమేషన్ సరిపోదంటు మరో రూ.160 కోట్లు పెంచుతూ రీ టెండర్స్ పిలవడంలో మతలాబేంటంటు కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక కాలువ నిర్మాణంలో సుమారు రూ.160 కోట్ల దోపిడీకి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే దోపిడి అని, ఆ దండుపాళ్యం మూఠా ఆటలు ఆడనివ్వమంటు కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఓరుగల్లుకు తల మానికమైన ఆజాంజాహీ మిల్లు గత పాలకుల పుణ్యమా అని మూతపడిందన్నారు.
ఎంతో నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులు ఆజాంజాహి మిల్లు మూతపడ్డాక, పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస పోయిన చరిత్రను మరువలేమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నైపుణ్యని గుర్తించి, వలసలు నివారించాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పం వరంగల్ కేంద్రంగా ఆజాం జాహీ మిల్లుకు బదులుగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మించుకోవడం జరిగిందన్నారు. అప్పటి ఎమ్మెల్యేగా ధర్మారెడ్డి టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం రైతులను ఒప్పించి 1500 ఎకరాల భూమి సేకరించడం జరిగిందంటూ ధర్మారెడ్డి కృషిని కొనియాడారు. 2023లో తీవ్ర కరోనా కాలమైనప్పటికి, అనేక కంపెనీలతో చర్చించి కైటెక్స్, యంగ్ ఇండియా, గణేశా వంటి ఎన్నో కంపెనీలను ఒప్పించు టెక్స్టైల్ పార్క్ కు తీసుకురావడం జరిగిందన్నారు.
ప్రస్తుతం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పలు కంపెనీలలో 25వేల మందికి ఉద్యోగ కల్పించనున్నట్లు కంపెనీలు ప్రకటిస్తే, కాంగ్రెస్ నాయకులు పైరవీల పేరుతో చేస్తున్న బెదిరింపులను తట్టుకోలేక కంపెనీలు పారిపోతున్నాయన్నారు. అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి, ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వ్యవసాయ కూలీ మహిళలకు రూ. 2500, రూ.4 వేల పెన్షన్, తులం బంగారం, ఉచిత గ్యాస్ పంపిణీ, అన్నీ ఉత్త మాటలు గానే మిగిలాయన్నారు. ఉచిత బస్సు మాత్రం అమలు చేసి మొత్తం ఎగవేస్తామంటే చూస్తూ ఊరుకోకూడదంటు మహిళలనుద్దేశించి ప్రసంగించారు. జరుగబోయె స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఆదరించి అక్కున చేర్చుకోవల్సిన అవసరం ఉందన్నారు.
మీరు చూపించే ఆదరణ చూసిన కాంగ్రెసు నాయకులకు దిమ్మ తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకోని పనిచేసేలా ఉండాలన్నారు. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి ,మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, ఏనుగు రాకేష్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకన్న, మేడిపెల్లి శోభన్, మాజీ ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, పరకాల మండలం అద్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్, మాజీ జడ్పీటిసి సిలువేరు మొగిలి, బిఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న దోపిడీని నిలదీస్తాం: కేటీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES