నవతెలంగాణ మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎన్‌పీ వాడ జడ్పీహెచ్‌ఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌కె ప్రసాద్ అనే ఉపాధ్యాయుడ్ని ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్ చేశారు. ఈ నెల 24న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించినందుకుగాను గవర్నమెంట్ స్కూల్ టీచర్‌పై వేటు పడింది. ఈ ఘటనను విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
జులై 24న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఎన్‌పీ వాడ జడ్పీహెచ్ పాఠశాలలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు కుర్చీలను పంపిణీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. బీఆర్‌ఎస్ కండువాలు వేసుకున్న నాయకులు.. పాఠశాలలో జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.
విద్యార్థులతో సైతం నినాదాలు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల వరకు చేరింది. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఈ చర్యలు ఉండడంతో.. జిల్లా విద్యాధికారి యాదయ్య విచారణ జరిపి ఆ రోజు ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించిన ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.