పంచకుల మహిళా పోలీసులు రోడ్డుపక్కన ప్రసవం చేశారు. ప్రసూతి ఆరోగ్య పథకాలకు, ఆరోగ్యకరమైన ప్రసవ రేటుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రంగా గొప్పగా చెప్పుకునే హర్యానాలో ఇది జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా మహిళల దుస్థితికి ఇదో నిదర్శనం. సురక్షితమైన ప్రసవానికి కూడా నోచుకోలేని స్థితిలో మన భారతీయ మహిళ ఉంది. చిన్నారి దుర్గ సురక్షితంగా జన్మించింది కానీ గ్రామీణ మహిళలకు వైద్యం అందుబాటులోలేని దయనీయ స్థితిని ఈ ప్రపంచానికి చూపించింది.
వారం రోజుల కిందట హర్యానాలోని పంచకులలోని తవా చౌక్ సమీపంలో ఓ మారుమూల ప్రదేశంలో పోలీసులు గస్తీలో ఉన్నారు. ఆ సమయంలో ఓ ఊహించని పరిణామం జరిగింది. పంచకులకు చెందిన లక్ష్మి అనే యువతి రోడ్డు పక్కన ప్రసవ నొప్పితో బాధపడుతోంది. ఆ సమయంలో ఆమె భర్త ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నాడు. అక్కడి నుండి ఆస్పత్రి ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ విషయం తెలిసి పంచకులలోని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నేహా సంధుతో పాటు పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లింది. లక్ష్మి భరించలేని నొప్పితో బాధపడుతోంది. అప్పటికే శిశువు తల దాదాపు బయటకు కనిపిస్తోంది. కానీ ఆమెను వాహనంలో తీసుకెళ్లడానికి అవకాశం లేదు.
దుర్గా శక్తిపై అభిమానంతో…
నొప్పులతో తల్లడిల్లుతున్న లక్ష్మి పరిస్థితి గమనించి హర్యానా ప్రత్యేక పోలీసు విభాగం దుర్గా శక్తి రాపిడ్ యాక్షన్ టీం సభ్యులతో పాటు అధికారులు నేహా, ఇన్‌స్పెక్టర్ రేణు, కానిస్టేబుల్ అంజలి అత్యంత సమర్థవంతంగా వ్యవహరించారు. వారు ధరించిన జాకెట్లు, శాలువాలను లక్ష్మి చుట్టూ కట్టారు. ఆ చీకట్లో వెలుగు కోసం టార్చెస్ ఉపయోగించారు. రోడ్డు పక్కన పడి ఉన్న లక్ష్మికి సహాయం చేశారు. ఒక ఆడ శిశువును ప్రపంచంలోకి తీసుకువచ్చారు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన దుర్గా శక్తి కేడర్‌పై అభిమానంతో తమ బిడ్డకు దుర్గా అని ఆ తల్లిదండ్రులు పేరు పెట్టారు. మౌలిక సదుపాయాలు అధికంగా ఉన్నాయని, ప్రసూతి ఆరోగ్య విధానాలకు ప్రసిద్ధి చెందిందని చెప్పుకునే హర్యానా రాష్ట్రంలో ఒక ప్రసవం ఇలా హృదయ విధారకంగా జరిగింది. చాలా మంది మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు అత్యవసర వైద్య సదుపాయం ఇప్పటికీ ఓ అందని ద్రాక్షగానే ఉందని ఈ సంఘటన గుర్తు చేసింది.
సరైన సమయంలో…
లక్ష్మికి ప్రసవం అయ్యేసరికి అంబులెన్స్ వచ్చింది. తల్లి, నవజాత శిశువును వెంటనే సమీపంలోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరి ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే స్పందించి సరైన సమయంలో తల్లీ బిడ్డను కాపాడిన మహిళా పోలీసు అధికారులకు డాక్టర్లు ధన్యవాదాలు చెప్పారు. ఆ క్షణంలో వాళ్లు ఆనందంతో పొంగిపోయారు. వారిలో ఎవరికీ ప్రసవం చేయడంలో అవగాహన లేకపోయినా సమయానికి చేయగలిగింది చేశారు. సమీపంలో ఉన్న కొంతమంది వృద్ధ మహిళలను పిలిచి సాయం తీసుకున్నట్టు నేహా చెప్పారు.
పెద్ద సమస్య పట్ల చిన్న చూపు
పత్రికల్లో ఈ అత్యవసర డెలివరీ ఒక మంచి వార్త అయినప్పటికీ, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది మహిళలకు సకాలంలో, సురక్షితమైన ప్రసూతి సంరక్షణ ఎంత దుర్లభంగా ఉందో ఇది వెల్లడించింది. జనని సురక్ష యోజన (జేఎస్‌వై), జనని శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే) వంటి పథకాలు హర్యానాలో అమలులో ఉన్నాయి. దీని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ ఆచరణలో భౌగోళిక, కుల ఆధారిత అసమానతలు స్పష్టంగా ఉన్నాయి. హర్యానాలోని 12,191 మంది తల్లులపై జరిగిన ఒక రాష్ట్ర స్థాయి అధ్యయనం ప్రసూతి ఆరోగ్య సేవా కవరేజీలో జిల్లాకు, జిల్లాలకు మధ్య అసమానతలను వెలుగులోకి తెచ్చింది. పంచకుల, అంబాలా, గురుగ్రామ్, మేవాట్ సహా కొన్ని జిల్లాల్లో, ఉప కేంద్రాలలో 50శాతం కంటే తక్కువ మందికి మాత్రమే ప్రసవానంతర సంరక్షణ అందుతుంది. ఇది భౌగోళిక, సామాజిక, ఆర్థిక మినహాయింపులను ప్రతిబింబిస్తుంది.
కొనసాగుతున్న అసమానతలు
హెల్త్ రీసెర్చ్ పాలసీ అండ్ సిస్టమ్స్‌లో ప్రచురించబడిన 2020 అధ్యయనం ప్రకారం మేవాట్, పంచకుల, అంబాలా వంటి జిల్లాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. ప్రాథమిక ప్రసవానంతర, ప్రసవ సంరక్షణలో వెనుకబడి ఉన్నాయి. ఉదాహరణకు మేవాట్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రాథమిక రోగ నిర్ధారణ సేవలు, శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో లేరు. ప్రభుత్వ సేవలు ఉన్నప్పటికీ చాలా మంది మహిళలు ప్రైవేట్ లేదా అనధికారిక ఆస్పత్రులపై ఆధారపడుతున్నారు. అంబాలాలో జరిగిన ఒక ప్రాథమిక సర్వే ఈ అసమానతను మరింత నొక్కి చెప్పింది. పూర్తి స్థాయిలో పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్న గ్రామాలలో ప్రసవానంతర మరణాలు చాలా తక్కువగా ఉండగా, ఎటువంటి ఆరోగ్య కేంద్రం లేని చోట రేట్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. పీహెచ్‌సీకి లేని గ్రామాల్లోని మహిళలు శిక్షణ లేని మంత్రసానులపై ఆధారపడుతున్నారు.
వ్యవస్థాగత అంతరాలు
నైపుణ్యం కలిగిన జనన సహాయకులను సకాలంలో పొందడం వల్ల ప్రసూతి మరణాలను 75శాతం వరకు తగ్గించవచ్చని యూనెసెఫ్ అంచనా వేసింది. హర్యానా ఈ విషయంలో కొంత పురోగతిని సాధించినప్పటికీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం సమస్య కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ వ్యవస్థాగత అంతరాలు, మహిళల సమస్యలను బహిర్గతం చేస్తున్నాయి. చిన్నారి దుర్గా జన్మించింది. ఆ పాపతో పాటే భారతదేశ ప్రసూతి సంరక్షణ, దాని దుర్బలత్వం, అందుబాటులో ఉన్న అవకాశలను ప్రతిబింబించే కథ కూడా జనించింది. గ్రామీణ ప్రాంతాల వరకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచితే ఏ స్త్రీ కూడా ఇలా రోడ్డు పక్కన బిడ్డను ప్రసవించాల్సిన అవసరం ఉండదు.
– సలీమ