Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయం సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం!

 సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సెల్ఫీ మోజులో ఓ కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ సమీపంలోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద నిన్న జరిగిందీ ఘటన. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు జలపాతాన్ని సందర్శించారు. అక్కడ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

సాక్షుల కథనం ప్రకారం భటిండా జలపాతం వద్ద వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం సమీపంలో సెల్ఫీలు తీసుకునేందుకు బాధిత కుటుంబం ప్రయత్నించింది. ఈ క్రమంలో కుటుంబంలోని ఒక మహిళ అకస్మాత్తుగా కాలు జారి నీటిలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త, కొడుకు, కూతురు ఆమెను రక్షించేందుకు వెంటనే నీటిలోకి దూకారు. అయితే, జలపాతం వద్ద ఉన్న బలమైన ప్రవాహం కారణంగా నలుగురూ మునిగిపోయారు. సమీపంలో చేపలు పట్టుకుంటున్న స్థానికులు గమనించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్లలో దూకి వారిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.

భటిండా జలపాతంలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురైన ఘటనలు గతంలోనూ జరిగాయి. 2024 ఆగస్టులో సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోగా స్థానికులు వారిని రక్షించారు. కాగా, తాజాగా ప్రమాదం నుంచి బయటపడిన కుటుంబ సభ్యులను చికిత్స కోసం ప్రైవేటు ఆస్ప‌త్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -