– గురువారం నుంచి ఐదో టెస్టు
– టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ
నవతెలంగాణ-లండన్ : టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో తొలి నాలుగు టెస్టులు ముగిశాయి. ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో కొనసాగుతుంది. ఐదు రోజుల పాటు ఉత్కంఠ రేపిన మాంచెస్టర్ టెస్టు భారత బ్యాటర్ల వీరోచిత పోరాటంతో డ్రాగా ముగిసింది. 311 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండోసారి బ్యాట్ పట్టిన టీమ్ ఇండియాపై ఎవరికీ అంచనాలు లేవు. తొలి ఓవర్లో 2 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తర్వాత 142 ఓవర్లలో మరో రెండు వికెట్లు మాత్రమే చేజార్చుకుంది. కెఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) పరాక్రమ రూపం చూపించారు. తొలి ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీలో వెనుకంజలో నిలిచిన భారత్.. గురువారం నుంచి ఆరంభం కానున్న ఆఖరు, ఐదో టెస్టుకు వ్యూహం సిద్ధం చేస్తోంది.
గాయాల దెబ్బ :
భీకర ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ గాయంతో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం గాయంతో ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నాడు. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేతి గాయం నుంచి కోలుకున్నాడో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఐదో టెస్టులో బుమ్రా ఆడటంపై ఆసక్తి నెలకొంది. ‘బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తే.. ఓవల్‌లో ఆడతాడు. అతడు ఆడితే ఐదో టెస్టులో భారత్‌కు గొప్ప అనుకూలత ఉంటుంది. బుమ్రా ఫిట్‌గా లేకున్నా.. మాకు మెరుగైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు’ అని శుభ్‌మన్ గిల్ అన్నాడు. వెన్నుగాయంతో ఇబ్బందిపడుతున్న బుమ్రా.. ఇంగ్లాండ్ పర్యటనలో మూడు టెస్టులే ఆడతాడని తొలుత వెల్లడించారు. తొలి నాలుగు టెస్టుల్లో బుమ్రా మూడింట ఆడాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 26 సగటు, 3.04 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌ను సమం చేసే అవకాశం ముంగిట బుమ్రా ఫిట్‌నెస్ కోసం భారత్ ఎదురుచూస్తోంది. ఇక ఏడు ఇన్నింగ్స్‌ల్లో 68.42 సగటుతో 479 పరుగులు చేసిన రిషబ్ పంత్ ఐదో టెస్టుకు దూరం కావటం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ కానుంది.
బుమ్రా ఆడతాడా?
- Advertisement -
- Advertisement -