Tuesday, July 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుముదిగొండ భూపోరాటం చిరస్మరణీయం

ముదిగొండ భూపోరాటం చిరస్మరణీయం

- Advertisement -

మత ఘర్షణలను రెచ్చగొడుతున్న బీజేపీ
ఉద్యమాలతోనే ప్రజావ్యతిరేక విధాలను తిప్పికొట్టాలి :
ముదిగొండ భూపోరాట అమరుల 18వ వర్థంతి సభలో
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ముదిగొండ

భూ పోరాటం చిరస్మరణీయమైనదని, భూమి ఉన్నంతవరకూ ఎర్రజెండా పోరాటాలు ఉంటాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ భూపోరాట అమరవీరుల 18వ వర్థంతి సభను సోమవారం ముదిగొండ మండల కేంద్రంలోని భూపోరాట వీరుల స్మారక స్థూపం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని మాట్లాడారు. పోలీస్‌ తూటాలకు ఎదురొడ్డి అమరులైన యోధులు ఉసికల గోపయ్య, ఎనగందుల వీరన్న, కత్తుల పెద్దలక్ష్మి, బంక గోపయ్య, పసుపులేటి కుటుంబరావు, జంగం బాలస్వామి, చిట్టూరి బాబురావు అమరత్వంతో తడిసిన నేల ముదిగొండ గడ్డని, వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2007 జులై 28న నిరుపేదలు, వ్యవసాయ కూలీలు జానెడు ఇంటి స్థలం కోసం ఆందోళన చేస్తే ఆనాటి వైఎస్‌ ప్రభుత్వం వారిపై కర్కశంగా లాఠీచార్జి చేసిందని అన్నారు. పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో ఏడుగురు బలి అయ్యారని, 18 మంది గాయపడ్డారని తెలిపారు. మండలంలో బలమైన పార్టీగా ఉన్న సీపీఐ(ఎం)ను బలహీనపరిచి దెబ్బతీయాలని భావించిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కుట్రలకు తెరలేపి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందన్నారు. రేవంత్‌ సర్కార్‌ ఇందిరమ్మ ఇండ్లను అనర్హులకు కాకుండా అర్హులకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజా ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. పాలకులు ప్రజా సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్నారన్నారు. ముదిగొండ భూపారాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలన్నారు. అనంతరం భూపోరాట అమరవీరుల చిత్రపటాల స్థూపం వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి పద్మ, మధిర డివిజన్‌ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, డివిజన్‌ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మంకెన దామోదర్‌, మండల నాయకులు వేల్పుల భద్రయ్య, అమరవీరుల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -