Tuesday, July 29, 2025
E-PAPER
Homeజాతీయంపహల్గాంకు పాక్‌ ఉగ్రవాదులు ఎలా వచ్చారు?

పహల్గాంకు పాక్‌ ఉగ్రవాదులు ఎలా వచ్చారు?

- Advertisement -

ఇప్పటి వరకు వారిని ఎందుకు పట్టుకోలేదు
మన దేశ అంతర్గత వ్యవహారంపై అమెరికా
జోక్యమెందుకు? : పార్లమెంట్‌ సాక్షిగా విపక్షాల నిలదీత
దేశ భద్రతా దళాల చర్యలకు మద్దతు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పహల్గాంకు పాక్‌ ఉగ్రవాదులు ఎలా వచ్చారు?, మన దేశ అంతర్గత వ్యవహారంపై అమెరికా జోక్యమెందుకు చేసుకుంటోంది? అంటూ పార్లమెంట్‌ సాక్షిగా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. పహల్గాంలో భద్రతా లోపాల గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతానికి ఎలా చేరుకున్నారు? వారిని ఎవరు రక్షించారు వంటి ప్రశ్నలకు సమాధానాలు దేశానికి అవసరమని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. సోమవారం లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా దేశ భద్రతా దళాల చర్యలకు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు, దేశ విదేశాంగ విధానానికి జరుగుతున్న నష్టం, అమెరికా జోక్యం తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించాయి. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గోగోరు మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ చాలా విషయాలు చెప్పారనీ, కాని పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారో చెప్పలేదని అన్నారు.

వేల మంది టూరిస్టులుండే ఈ ప్రాంతానికి ఆ ఐదుగురు ఉగ్రవాదులు ఎలా వచ్చారని, వారి ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. అంతేకాక వారిని ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని అడిగారు. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. పహల్గాం ఘటనను ఇన్‌ఫర్మేషన్‌ వార్‌ అని పేర్కొన్నారు. మతం ఆధారంగా ప్రజల్ని టార్గెట్‌ చేయవద్దని గోగోరు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి కేంద్రమంత్రి అమిత్‌ షా బాధ్యత వహించాల న్నారు. దీనికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను బలి చేయొద్దని చెప్పారు. అదే విధంగా రఫేల్‌ యుద్ధ విమానాలను కోల్పోయిన అంశంపై త్రివిధ దళాధిపతి అనిల్‌ చౌహాన్‌ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాన్ని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్‌, భారత్‌ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటివరకు 26 సార్లు వెల్లడించారని, దీనిపై నిజం ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి, సిందూర్‌ ఆపరేషన్‌ తరువాత జరిగిన అంతర్జాతీయ దౌత్యం గురించి వెల్లడించాలని పట్టుబట్టారు. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం అందకుండా ఇండియా ఎందుకు అడ్డుకోలే దనీ, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దేశం ఆపరేషన్‌ తందూర్‌ను కోరుకుంది : సమాజ్‌వాదీ పార్టీ నేత
పహల్గాం ఉగ్రదాడి తరువాత దేశం ఆపరేషన్‌ తందూర్‌ను కోరుకుందని సమాజ్‌వాదీ పార్టీ నేత ఎంపీ రామశంకర్‌ రాజ్‌భర్‌ అన్నారు. ఆ దాడికి కారణమైన ఉగ్రవాదులను రోస్ట్‌ చేయాలని దేశ ప్రజలు కోరుకున్నట్టు తెలిపారు. అయితే ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రభుత్వం సరైన రీతిలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు.

మోడీ పహల్గాంకు ఎందుకు వెళ్లలేదు? : శివసేన
త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌కు ప్రధాని మోడీ వెళ్లారని, కానీ ఉగ్రదాడి జరిగిన పహల్గాంకు మాత్రం ఎందుకు వెళ్లలేదని శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ ప్రశ్నించారు. అదే విధంగా ఇప్పటికీ మణిపూర్‌కు ఎందుకు వెళ్లలేదని అడిగారు.

అమెరికా అధ్యక్షుడంటే ఎందుకు భయపడుతున్నారు? : టీఎంసీ
ఆపరేషన్‌ సిందూర్‌ పట్ల అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, ఆ విషయాన్ని ఎందుకు ట్విట్టర్‌లో పోస్టు చేయడం లేదని ప్రధాని మోడీని టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడికి మీరెందుకు భయపడుతున్నార ని ప్రశ్నించారు. ఆర్‌జేడీ ఎంపీ అభరు కుమార్‌ సిన్హా మాట్లాడుతూ కాశ్మీర్‌లో భద్రతకు ప్రభుత్వం ఇచ్చిన హామీ, కుంభమేళాలో భద్రత, సరైన నిర్వహణకు ఇచ్చిన హామీని పోలి ఉందని ఎద్దేవా చేశారు.

భద్రతా లోపాలకు బాధ్యులెవరు? సీపీఐ(ఎం) ఎంపీ ఎస్‌.వెంకటేషన్‌
పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన భద్రతా లోపాలే కారణమని సీపీఐ(ఎం) ఎంపీ ఎస్‌. వెంకటేశన్‌ అన్నారు. ఈ తీవ్రమైన భద్రతా లోపాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్ర దాడి తరువాత కూడా, ఐఎంఎఫ్‌ పాకిస్తాన్‌కు భారీ ఆర్థిక సహాయం అందించిందని, కేంద్ర ప్రభుత్వం దానిని ఆపలేకపోయిందని అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ దౌత్యపరమైన లోపాల కారణంగానే జరిగిందని తెలిపారు.

ప్రభుత్వానికి ప్రతిపక్షాల మద్దతు: సుప్రియా సులే
ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ప్రధాని మోడీకి మద్దతునిచ్చాయని ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే అన్నారు. ”ఇది గొడవలకు సమయం కాదని కాంగ్రెస్‌ చెప్పింది. ఏది జరిగినా ప్రధాని ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని ప్రతిపక్షం చెప్పింది” అని ఆమె అన్నారు. పహల్గాం ఉగ్ర దాడిపై భారతదేశం స్పందించిన తీరుపై భారత ఆర్మీ అధికారి కల్నల్‌ సోఫియా ఖురేషి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, ఉగ్రవాద బాధితుడి భార్యపై జరిగిన దుర్మార్గపు ట్రోలింగ్‌ను ఆమె ఖండించారు.

లక్ష్యాలను సాధించాం.. అందుకే యుద్ధం ఆపాం : రాజ్‌నాథ్‌ సింగ్‌
ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. సోమవారం లోక్‌సభలో ఆయన చర్చను ప్రారంభించారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైన్యం సత్తాకు నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్‌ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందన్నారు. దీంతో ఆపరేషన్‌ సిందూర్‌కు విరామం ఇచ్చామని, భవిష్యత్తులో పాక్‌ మళ్లీ దుస్సాహసానికి పాల్పడితే ఆపరేషన్‌ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. సైనిక చర్యలపై ప్రశ్నలు వేసేటప్పుడు ఆచితూచి, ఆలోచించి ప్రశ్నించాలని ప్రతిపక్షాలకు సూచించారు.

విరమణలో అమెరికా ప్రమేయం ఎంత మాత్రం లేదు : కేంద్ర విదేశాంగ మంత్రి
భారత్‌-పాక్‌ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం ఎంత మాత్రం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఎలాంటి ఫోన్‌ సంభాషణలు జరగలేదని అన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను కొట్టివేశారు.
ఆపరేషన్‌ సిందూర్‌ఫై లోక్‌సభలో వాడీవేడిగా చర్చ జరుగుతుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చర్చ సందర్భంగా భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని ఎస్‌. జైశంకర్‌ చెప్పడంతో ప్రతిపక్ష సభ్యులు ఆయనపై ప్రశ్నలవర్షం కురిపించారు. దీంతో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా జోక్యం చేసుకుని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. జేడీయూ ఎంపీ, కేంద్ర పంచాయతీ రాజ్‌ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ మాట్లాడుతూ యూపీఏ పాలనలో ఉగ్రదాడుల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్యను గుర్తు చేశారు.

నేడు రాజ్యసభలో చర్చ
లోక్‌సభలో సోమవారం రాత్రి 12 గంటల వరకు ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ జరిగింది. రాజ్యసభలో మంగళవారం రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చను ప్రారంభించనున్నారు. లోక్‌సభలో మంగళవారం అమిత్‌ షా తొలుత ప్రసంగించనున్నారు. రాత్రి ఏడు గంటలకు ప్రధాని మోడీ ఆపరేషన్‌ సిందూర్‌ చర్చపై ప్రసంగించనున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, వివిధ పార్టీల నేతలు చర్చలో పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -