– స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
– ఈ భూమ్మీద ఏ పత్రాన్నైనా ఫోర్జరీ చేయడానికి అవకాశం వుందంటూ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బీహార్‌లో అమలు జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో గుర్తింపు కార్డులుగా ఆధార్, ఓటర్ కార్డులను అమోదించాలని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేసింది. ఎన్నికలు జరగనున్న బీహార్‌లో చేపట్టిన ఈ ప్రక్రియ, పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చుకునేలా వుండాలి కానీ పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేలా వుండకూడదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. ముసాయిదా ఓటర్లజాబితా ను ప్రచురించడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువుండడంతో కోర్టు సూచనల ను ఇసి ప్రతిఘటిస్తోంది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను సులభంగా ఫోర్జరీ చేయవ చ్చని వాదిస్తోంది. దీనిపై సుప్రీం తీవ్రంగా స్పందిస్తూ, ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్‌నై నా ఫోర్జరీ చేయవచ్చని వ్యాఖ్యానించింది. వంద ఓటర్ల కార్డుల్లో బహుశా ఏ ఒక్కటో నిజమైన కార్డు కాకపోవచ్చని పేర్కొంది. అటువంటి విషయాలను ఏ కేసుకు ఆ కేసుగానే చూడాలి తప్ప అన్నింటికీ వర్తించలేమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్యా బగ్చిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఆధార్, ఓటర్ కార్డులు సరైనవేననే భావన వుందని జస్టిస్ కాంత్ అన్నారు. ఆధార్ వినియోగంలో వున్నపుడు దాన్ని ధ్రువీకరించేందుకు ఒక వ్యవస్థ వుందని అన్నారు. ఓటరు కార్డు అయితే ఎన్నికల కమిషనే ఇచ్చింది. కాబట్టి ఆధార్, ఓటర్ కార్డులను గుర్తింపు కార్డులుగా ఆమోదించవచ్చని అన్నారు. గుర్తింపు కార్డులుగా సూచించిన 11 డాక్యుమెంట్ల జాబితాలో ఏవీ కూడా నిర్ణయాత్మకమైన స్వభావం కలిగినవి కావని, అది నివాస పత్రం కావచ్చు లేదా కుల ధ్రువీకరణ పత్రం కావచ్చని జస్టిస్ బగ్చి పేర్కొన్నారు. ‘మీ అభిప్రాయం ప్రకారం, ఆ 11 డాక్యుమెంట్లలో ఏవీ కూడా కచ్చితమైనవి, నిర్ణయాత్మకమైనవి కానపుడు, అవి కేవలం జన గణన ఫారమ్‌లతో పాటూ జత పరిచిన పత్రాలు అనుకున్నపుడు ఎవరైనా ఆధార్‌ను గుర్తింపు కార్డుగా ఇస్తే, వారిని ఓటర్ల జాబితాలో ఎందుకు చేర్చరు?” అని జస్టిస్ బగ్చి ప్రశ్నించారు. ఈ కేసులో తుది వాదనలు వినడానికి సక్రమ షెడ్యూల్‌ను, ముందస్తు తేదీని 29వ తేదిన ప్రకటిస్తామని కోర్టు పేర్కొంది. ఆగస్టు 1 ముసాయిదా ప్రచురణకు గడువు దగ్గర పడుతోం దని ఈసీ తరపు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ ప్రస్తావించారు. ‘అది కేవలం ముసాయిదా మాత్రమే’ అని జస్టిస్ కాంత్ వ్యాఖ్యానించారు. ప్రచురణలపై స్టే ఇవ్వాలని కానీ ఎస్‌ఐఆర్ ప్రక్రియను స్తంభింపచేయాలని కానీ పిటిషనర్లు కోరలేదని ఆయన గుర్తు చేశారు. అయినా ముసాయిదా ప్రచురితమైనంత మాత్రాన ఈసీ నిర్ణయాన్ని సవరించేందుకు కోర్టుకు గల అధికారాలు తగ్గిపోవని న్యాయమూర్తి పిటిషనర్లకు హామీ ఇచ్చారు. పౌరసత్వపు హోదాను పరిశీలించేందుకే ఈసీ ఎస్‌ఐఆర్ చేపట్టిందని మానవ, సామాజిక హక్కుల కార్యకర్తల నుంచి రాజకీయ పార్టీల వరకు అనేకమంది తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ మూడు డాక్యుమెంట్లను గుర్తింపు కార్డులుగా అంగీకరించాల్సిందిగా జులై 10న సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్‌ను కోరింది.
భారీ ఓటరు నమోదే ఎస్‌ఐఆర్ లక్ష్యంగా వుండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES