– అధికారుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
నవతెలంగాణ-హవేలీ ఘనపూర్
బోరు మోటార్ వద్ద స్టార్టర్ డబ్బా మరమ్మత్తు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై కౌలు రైతు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం వాడి గ్రామానికి చెందిన ఆకుల జగన్నాథం (50) కొన్నేండ్లుగా అదే గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర సుమారు మూడు ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బోరు మోటార్ నడవకపోవడంతో స్టార్టర్ డబ్బా వద్ద సర్వీస్ వైర్‌ను పరిశీలిస్తున్న జగన్నాథంకు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. కాగా, విద్యుత్ అంతరాయంపై ట్రాన్స్‌కో అధికారులను ఎల్‌సీ ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల కాలంలోనే కరెంటు షాక్‌తో ఇద్దరు రైతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
- Advertisement -
- Advertisement -