Tuesday, July 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి రైతులకు డబ్బులు చెల్లించాలి

పత్తి రైతులకు డబ్బులు చెల్లించాలి

- Advertisement -

– సీడ్‌ కంపెనీలకు మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను నెల రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీడ్స్‌ కంపెనీలను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గద్వాల జిల్లా రైతులు సుమారు 50వేల ఎకరాల్లో పత్తి విత్తనాలను సాగు చేశారని తెలిపారు. నెలలు గడిచినా రైతులకు కంపెనీలు డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి విత్తనాల ఉత్పత్తిలో గద్వాల దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు ఇస్తే…రైతులకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు. ఇప్పటికైనా ఆయా కంపెనీలు తక్షణమే స్పందించి నెలరోజుల్లోగా ఉన్న బకాయిలను రైతులకు చెల్లించి వారిని ఆదుకోవాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. ఆయా కంపెనీల ద్వారా రైతులకు సుమారు రూ.700 కోట్లు బకాయిలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రైతులు, వారిపై ఆధారపడిన కూలీలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కష్ణమోహన్‌రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ సుంకేట అన్వేష్‌రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి, రాష్ట్ర సీడ్స్‌మెన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు రామకృష్ణ, ప్రవీణ్‌, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మంజిల్లాలో టూరిజంపై దృష్టి సారించండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వివిధ చారిత్రాత్మక ప్రదేశాలను అభివృద్ధి చేయడంతోపాటు టూరిజం సెక్టార్‌ను బలోపేతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఖమ్మం టూరిజం అభివృద్ధిపై సమీక్షించారు. ఖమ్మం జిల్లాలో ఏకో, టెంపుల్‌ టూరిజంను అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్‌, నేలకొండపల్లి బౌద్ధస్థూపం, పర్ణశాల, భద్రాచలం టెంపుల్‌, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరిత హోటల్‌, కనిగిరి హిల్స్‌, వైరా రిజర్వాయర్‌, వెలుగుమట్ల అర్బన్‌ పార్కు, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే, ఖమ్మంలో కొత్తగా ఒక హరిత హోటల్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో టూరిజం శాఖకు చెందిన అధికారులు, జిల్లా కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో పర్యటించి తగు కార్యాచరణను రూపొందించాలని సూచించారు. ఖమ్మం పట్టణ సమీపంలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఏకో టూరిజానికి సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో టూరిజం కార్పొరేషన్‌ ఎమ్‌డీ వల్లూరి క్రాంతి, జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -