Tuesday, July 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

- Advertisement -

– మృతుల కుటుంబాలకు రూ.కోటి వెంటనే చెల్లించాలి
– యాజమాన్యంతో సీఎం రేవంత్‌ లాలూచీ
– బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందడానికి కారణమైన యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్టు చేయాలని, మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.

దారుణమైన ప్రమాదం జరిగి అనేక మంది మరణించగా, ఇంకొందరు తీవ్రంగా గాయాలపాలైన ఘటన జరిగిన తర్వాత కంపెనీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగలేదన్నారు. కంపెనీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారాన్ని కంపెనీ యాజమాన్యం నుంచి 15 రోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చి నెల రోజులైనా ఎందుకు డబ్బులు ఇప్పించలేదని ప్రశ్నించారు. తీవ్రంగా గాయపడ్డ కార్మికులకు రూ.50 లక్షలు, తక్కువ గాయాలైన వారికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల కుటుంబ సభ్యులు సంగారెడ్డికి వచ్చి వెళ్లాలంటే రూ.20 వేల ఖర్చు అవుతున్నందున చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చనిపోయిన వారి పేర్లు, ఎవరెవరికి ఎంత సాయం చేశారో.. గాయపడిన వారికి ఎంత ఇచ్చారనే వివరాల్ని ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు.

యాజమాన్యం పూర్తి నిర్లక్షంగా వ్యవహరించిందని ఫిర్యాదు చేసినా ఎందుకని యాజమాన్యాన్ని రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కంపెనీతో ఉన్న లాలూచీ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మృతదేహాలు ఇవ్వకుండా 8 మంది మిస్సింగ్‌ అంటూ ఎందుకు వేధిస్తున్నారన్నారు. వారికి వెంటనే డెత్‌ సర్టిఫికెట్స్‌ ఇచ్చి ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు. 54 మంది కార్మికులు చనిపోతే ఎందుకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగి 150 రోజులైనా శవాలు దొరకలేదని, సిగాచిలోనూ 8 మంది శవాలు ఇంత వరకు లభించలేదని తెలిపారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే జైలుకు పంపే ప్రభుత్వం.. ఎంతో మంది కార్మికుల్ని బలితీసుకున్న సిగాచి యాజమాన్యాన్ని ఎందకు అరెస్టు చేసి జైలుకు పంపట్లేదని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, చింత ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, డీసీఎంఎస్‌ చైర్మెన్‌ శివకుమార్‌, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -