Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిన్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక : సోషలిస్టు మమ్దానీ ఓటమికి కుట్రలు!

న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక : సోషలిస్టు మమ్దానీ ఓటమికి కుట్రలు!

- Advertisement -

మీడియా తీరుతెన్నులను చూస్తుంటే అధ్యక్ష ఎన్నికల కంటే న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో 33 ఏండ్ల సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ ఓటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక నగర మేయర్‌ పదవికి నిజంగా అంతగా కేంద్రీకరిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు గానీ అది పచ్చినిజం. మహా భారతంలో కౌరవులు పన్నిన పద్మవ్యూహంలో అభిమన్యుడు వీరోచితంగా పోరాడి అశువులు బాశాడు. న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో శత్రువులు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపే రంగంలోకి దిగి జోహ్రాన్‌ ఓటమికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాడంటే అతిశయోక్తి కాదు.నవంబరు నాలుగవ తేదీన జరిగే ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రముఖుల్లో జోహ్రాన్‌ ముందున్నట్లు తాజా సర్వేలు సూచి స్తున్నాయి. అయితే ఇంకా చాలా వ్యవధి ఉన్నందున ఏమైనా జరగవచ్చు అంటూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రతి సర్వే సంస్థ బుద్దిశుద్ధికి పూనుకుంది.
జెఫ్రీ ఎపస్టెయిన్‌ ఫైల్స్‌ గురించి అమెరికా మీడియాకు పెద్దగా పట్టలేదు.ఎపస్టెయిన్‌ ఖాతాదార్లలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకడు అన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్నమాట. ఎలన్‌మస్క్‌ కూడా దాని సంగతేమిటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక్కడా ఖాతాదార్లంటే ఎపస్టెయిన్‌ అనేవాడు కల్లుదుకాణం నడుపుతుంటే రోజూ తాగేందుకు వెళ్లేవారు కాదు.మైనర్లయిన బాలికలకు వలవేసి ట్రంప్‌ వంటి తాతయ్యలు, డబ్బున్న విచ్చలవిడిగాళ్లకు తార్చేవాడు. వాడెంత పెద్దవాడంటే స్వంత విమానం కూడా నడిపేంత పేరుమోసిన వాడు. ఒక కేసుల్లో జైల్లో చచ్చాడు. ఎలా జరిగిందన్నది అనేక అనుమానాలు, పెద్దలందరూ కలసి తమపేర్లు బయటకు రాకుండా పనికానిచ్చేశారని చెబుతారు. అలాంటి ఖాతాదార్ల జాబితాను బయటపెట్టాల న్నది ఒక పెద్ద సమస్యగా మారింది.ట్రంప్‌ ఆ వివాదంలో మాట్లాడిన మాటలు అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి.గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అసలు అలాంటి ఖాతాదార్ల జాబితా లేదని న్యాయశాఖ చెప్పింది. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమిటి ? ఆ జాబితాలో తన పేరు ఉన్నదని తానెప్పుడూ చెప్పలేదని, తన మీద కుట్ర జరుగుతోందని ట్రంప్‌ అంటున్నాడు. అయితే కచ్చితంగా ఏదో ఉండే ఉంటుందని ట్రంప్‌ గురించి తెలిసిన వారందరూ నమ్ముతున్నారు. గొర్రెల గోత్రాల కాపరులకే ఎరుక అని ఊరికే చెప్పలేదు పెద్దలు. ట్రంప్‌ గురించి పెద్దగా పట్టించుకోని మీడియా, సామాజిక మాధ్యమం జోహ్రాన్‌ మమ్దానీ గురించి గోరంతను కొండంతలుగా చేస్తోంది. అసలు జరిగింది ఏమిటట?
సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ 27 ఏండ్ల రమా దువాజీ అనే యువతిని లేపుకుపోయాడని మీడియా వర్ణించింది. ఇది పచ్చి అబద్దం. అమెరికా సమాజంలో కొంతకాలం సహజీవనం, వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కనటం, కావాలనుకుంటే వివాహం చేసుకోవటం సర్వసాధారణం. డేటింగ్‌ యాప్‌ ద్వారా కలిగిన పరిచయం ప్రేమగా మారి ఫిబ్రవరిలో వారు వివాహం చేసుకున్నారు. ఆ విషయాన్నీ జోహ్రాన్‌ స్వయంగా చెప్పాడు. నా రాజకీయ అభిప్రాయాలను విమర్శించండి గానీ కుటుంబ వ్యవహరాల్లోకి తొంగి చూడవద్దని హుందాగా ‘ఎక్స్‌’ద్వారా స్పందించాడు. వివాహం జరిగినపుడు ఎలాంటి వివాదం లేదు, ఆ తర్వాత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసినపుడు ఎలాంటి రచ్చ లేదు. ఇప్పుడు జూలై మూడవ వారంలో సన్నిహితులను పిలిచి వివాహ విందు ఇవ్వటాన్ని అమెరికా మీడియా రచ్చ చేసింది. ఉగాండాలో జన్మించిన జోహ్రాన్‌ మమ్దానీ ఏడేండ్ల వయస్సులో అమెరికా వచ్చాడు. 2018లో పౌరసత్వం వచ్చింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నాడు.
ఒక సోషలిస్టు అయి ఉండి వివాహ విందును మూడు రోజుల పాటు అంత భారీగా ఇవ్వటమా? అంటూ మీడియా విశ్లేషకులు గుండెలు బాదుకుంటున్నారు.ఉగాండా రాజధాని కంపాలా శివార్లలో ధనికులు ఉండే ప్రాంతంలోని రెండెకరాల్లో ఉన్న వారి కుటుంబ ఫాంహౌస్‌లో విందు జరిగింది. అక్కడ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ, తల్లి మీరా నాయర్‌ ఉంటారు. వారు న్యూయార్క్‌, న్యూఢిల్లీలను తరచూ సందర్శించి కొంత కాలం అక్కడా ఉంటారు. దాని చుట్టూ ఉద్యానవనాలు(వారివి కాదు), విక్టోరియా సరస్సు,ఎంతో అందమైన ప్రాంతంలో దానికి మూడు గేట్లు ఉన్నాయట, వివాహ సమయంలో ముసుగులు ధరించిన భద్రతా సిబ్బంది ఇరవైమంది కాపలా ఉన్నారట,సెల్‌ఫోన్లు పనిచేయకుండా జామర్లను అమర్చారు, చెట్లకు విద్యుత్‌ దీపాలను అమర్చారు, ఆహ్వానించిన అతిధులను మాత్రమే అనుమతించారు.వారు ఖరీదైన కార్లలో వచ్చారు.అర్ధరాత్రి వరకు డిజెలతో కాలక్షేపం చేశారు. భారతీయ పద్ధతిలో అతిధులకు పండ్ల రసాలు ఇచ్చారు. ఇలా కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించినట్లుగా చిలవలు పలవలతో వర్ణించారు. ఆ సమయంలో ఉగాండా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు మరణించారట. సంతాపం తెలపాల్సిన ఆ సమయంలో విందు, విలాసాలేమిటని మనోభావాలను ముందుకుతెచ్చే అంశాన్ని కూడా జోడించారు. ప్రభుత్వం సంతాపదినాలుగా ప్రకటించిందో లేదో తెలియదు, ఒకవేళ ప్రకటించినా అది అధికారిక కార్యకలాపాలకు తప్ప ప్రయివేటు, అదీ కూడా ఎంతో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు వర్తించదు, బహిరంగ ఊరేగింపులు, అలాంటివేమీ లేవు. జోహ్రాన్‌ వివాహ విందు గురించి స్థానికులను ప్రశ్నిస్తే తమకు పెద్దగా తెలియదని, ఏదో పెద్దలు వచ్చినట్లు, భారీగా విందు జరిగినట్లు తాము కూడా గమనించామని చెబుతూనే తమ దగ్గర జన్మించిన బుడ్డడు న్యూయార్క్‌ నగరమేయర్‌గా పోటీ చేసేంత గొప్ప వాడయ్యాడా అని సంబరపడిన వారు కూడా ఉన్నారట. బురద చల్లదలచుకొంటే ఇలానే మీడియా వ్యవహరిస్తుంది. ఎందుకంత కంటగింపు?
జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నికైతే అది భీతిగొలిపే పరిణామం అవుతుందని జూనియర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా తండ్రితో గొంతుకలిపాడు.ప్రపంచంలో సమాధి అయిన భావజాలాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నాడు.జోహ్రాన్‌ గనుక ఎన్నికైతే న్యూయార్క్‌ వాసులందరూ ఫ్లోరిడాకు వలసపోతారని చెప్పాడు. న్యూయార్క్‌ నగర రాబడిలో 80శాతం కేవలం 18వేల మంది మాత్రమే చెల్లిస్తున్నారని, వారంతా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలరని ఈ కొత్త మేయర్‌ అపని చేస్తారన్నాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన తనకు భయమేస్తున్నదని చెప్పుకున్నాడు. జోహ్రాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి జూనియర్‌ ట్రంప్‌ చెప్పిన మాటలు ప్రతిబింబం.నగరంలోని యావత్‌ ధనికులను రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బును రంగంలోకి దించి తమకు అనుకూలమైన వారిని గెలిపించుకోవాలన్న యావ కనిపిస్తున్నది. తాను ఎన్నికల్లో భాగస్వామి కావటం లేదని, అయితే అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశం కాజాలదని జూనియర్‌ ట్రంప్‌ చెప్పాడు.
జోహ్రాన్‌ మమ్దానీని ఓడించేందుకు డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు, రిపబ్లికన్‌ పార్టీ, ఇతరులందరూ ఒక్కటి కావాలని చూస్తున్నప్పటికీ వారి మధ్య ఇప్పటివరకు ఏకాభిప్రాయం లేదు. వైరుధ్యాలు కూడా బహిర్గతమ య్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నట్లు ప్రకటించుకున్న డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమోకు తాను మద్దతు ఇస్తున్నట్లు డోనాల్డ్‌ట్రంప్‌ సంచలనాత్మక ప్రకటన చేశాడు. పార్లమెంటును తప్పుదారి పట్టించినం దుకు అతని మీద విచారణకు తానే ఆదేశించినప్పటికీ అతను ఒక కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా ఉన్నాడని, కనుక రంగంలో ఉండాలని అన్నాడు.డెమోక్రటిక్‌ పార్టీకే చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కూడా స్వతంత్రుడిగా పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. అయితే అతన్ని బలపరుస్తారా అన్న ప్రశ్నకు తానేమీ చెప్పదలచుకోలేదంటూ వ్యతిరేకతను వెల్లడించాడు. ఎవరికి వారే మమ్దానికి వ్యతిరేకంగా ఏకైక అభ్యర్థిగా తానే ఉండాలని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వైపు అందరినీ కూడగట్టేందుకు చూస్తూనే మరోవైపు అసలు పోటీకి దూరం చేసేందుకు జోహ్రాన్‌పై ట్రంప్‌ సర్కార్‌ కుట్రలకు పూనుకుంది. జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వ్యక్తిగా చిత్రించి ఆ పేరుతో పోటీకి అనర్హుడిగా చేసేందుకు అలాంటి వారి జాబితాను రూపొందించాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించింది. ఆ పేరుతో రూపొందించిన జాబితాలను కోర్టులు కూడా సమీక్షించే అవకాశం లేదని వార్తలు. ఇంతకు ముందు ఎవరినీ ఈ సాకుతో పోటీకి దూరం చేయలేదు. జోహ్రాన్‌ మమ్దానీ అమెరికాలో చట్టవిరుద్దంగా ఉంటున్నట్లు అనేక మంది చెబుతున్నారని, ప్రతిదాన్నీ తాను పరిశీలిస్తానని, న్యూయార్క్‌ను నాశనం చేసే ఈ పిచ్చి, నూటికి నూరుశాతం కమ్యూనిస్టును తాను వదిలేది లేదని ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. అంతర్గత భద్రత సలహా కమిటీ సమావేశంలో ట్రంప్‌ బూట్లు నాకే రూడీ గియులియానీ కమిటీ కార్యదర్శి క్రిస్టీ నియోమ్‌తో మాట్లాడుతూ మమ్దానీ బదులు ఒక దొంగ అయిన ఎరిక్‌ ఆడమ్స్‌ అయినా పర్వా లేదని ఎందుకంటే అతను కమ్యూనిస్టు కాదని అన్నాడు. మమ్దానీలో ఇస్లామిక్‌ ఉగ్రవాది, కమ్యూనిస్టు కలిసి ఉన్నట్లు నోరుపారవేసుకున్నాడు. ఇది అధికారిక సమావేశంలో జరిగిన ఉదంతం గనుక ఏకంగా ప్రభుత్వమే కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీసిందన్నది స్పష్టం. అందుకే ఏదో ఒకసాకుతో జోహ్రాన్‌ అభ్యర్ధిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది.
అభ్యర్థిత్వం కోసం పోటీ ప్రారంభమైన సమయంలో ఎవరు నెగ్గినప్పటికీ అందరూ ఐక్యంగా బలపరచాలని చెప్పిన డెమోక్రటిక్‌ పార్టీ పెద్దలు తీరా జోహ్రాన్‌ ఎన్నికైన తరువాత మాట మార్చారు.మితవాదులు ఎన్నికైతే ఎక్కడ పురోగామివాదులు వ్యతిరేకిస్తారో అని ముందరి కాళ్లకు బంధం వేసినట్లుగా వ్యవహరించిన వారి అసలు రంగు ఇప్పుడు కనిపిస్తోంది.జోహ్రాన్‌ మమ్దానీ గెలిస్తే అమెరికా చరిత్రలో స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించినట్లు(జోహ్రాన్‌ చెప్పుకోలేదు) ఒక కమ్యూనిస్టు ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్ర కుంభస్థలమైన న్యూయార్క్‌ మేయర్‌ పీఠంపై కూర్చోవటం నిజంగా ఒక చరిత్రే అవుతుంది. ప్రపంచమంతటా సోషలిస్టులు, కమ్యూనిస్టుల పెరుగుదలను అరికట్టాలంటూ దశాబ్దాల తరబడి అమెరికా పాలకవర్గం చేసిన ప్రచారం, దానికి గాను ఖర్చు చేసిన వందలాది బిలియన్‌ డాలర్ల సొమ్ము స్వంత గడ్డమీదనే గాలికి కొట్టుకు పోతుంది. అమెరికాలో కూడా సోషలిస్టు ప్రత్యామ్నాయం సాధ్యమే అనే అభిప్రాయం బల పడుతుంది. అనేక మందిలో ఉన్న సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకత కరిగిపోతుంది. ఏ విధంగా చూసినా పురోగామి శక్తులకు యావత్‌ ప్రపంచంలోనే ఎంతో ఊపువస్తుంది. ఒకవేళ ఓడితే అమెరికాలో డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల నిజస్వరూపం మరింత బట్టబయలు అవుతుంది.ప్రత్నామాయ శక్తులు ఎదగకుండా చేసేందుకు ఆ పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని మరింతగా కార్మికవర్గానికి అర్థమవుతుంది. ఏవిధంగా చూసినప్పటికీ పురోగామి ఉద్యమాలు ముందుకు పోవటానికి, ఆశక్తులు బలపడటానికే న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక దోహదం చేయటం ఖాయం!
ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad