పెన్షనర్ ల బకాయిలు విడుదల చేయాలి.
యూటీఎఫ్ రాష్ట్ర అద్యక్షులు చావ రవి
విద్యా బోధన,పాఠశాల నిర్వహణ పై అంకితభావం సంఘం చలువే
ప్రధానోపాధ్యాయురాలు ఆర్.పద్మావతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
పీఆర్సీ అమలు గడువు దాటి రెండు సంవత్సరాలు గడిచినందున వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 1 జులై 2023 నుండి పీఆర్సీ అమలు చేయాలని,2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పదవీవిరమణ అనంతర ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు.
బుధవారం అశ్వారావుపేట మండలం నారాయణపురం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రామడుగు పద్మావతి ఉద్యోగ విరమణ అభినందన సభ హింది బోధకులు సాయిబాబు అద్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా హాజరైన చావ రవి మాట్లాడుతూ.. పద్మావతి 39 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేశారని, పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ఉన్నతికి కృషి చేశారని,నూతన ఉపాధ్యాయులు పద్మావతిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ప్రమాదంలో ఉందని,ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఊరి బడిని కాపాడుకోవాల్సిన అవసరం సమాజానికి ఉందన్నారు.
ప్రాధమిక ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని,తరగతి కొక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించాల్సి వచ్చిందని,ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లేకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ,ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతినెల రూ 700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు కానీ గత నెల రూ. 183 కోట్లు మాత్రమే విడుదల చేశారు అని అన్నారు. నిర్ణయించిన ప్రకారం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల పని వేళలు శాస్త్రీయంగా సవరించాలని, మోడల్ స్కూల్,గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని, కేజీ బీవీ,యూఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని,డీఈఓ,డిప్యూటీ ఈఓ,ఎంఈఓ,డైట్ లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయాలని,గిరిజన సంక్షేమ శాఖలో పండిట్,పీఈటీ పోస్టులు అప్ గ్రేడ్ చేయాలని, నూతన పోస్టులు మంజూరు చేయాలని కోరారు.
అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు బదిలీలు,పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని,సీపీఎస్ రద్దు చేయాలని,2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బోధన పై శ్రద్ద,పాఠశాలలు పట్ల అంకిత భావం యూటీఎఫ్ సంఘం చలువే నని పదవీవిరమణ పొందిన,ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి అన్నారు.విద్యార్ధులు పట్ల చనువుగా ఉండే ఉపాద్యాయులు పై వారికి అపారమైన గౌరవమర్యాదలు,ఆదరణ ఉంటుందని తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు పద్మావతి గారికి ఘన సన్మానం.. జెడ్పీ హెచ్ ఎస్ నారాయణపురం ప్రధానోపాధ్యాయులు రామడుగు పద్మావతి పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట,దమ్మపేట,చుంచు పల్లి ఎంఈఓ లు పి. ప్రసాదరావు,కే.లక్ష్మి, పి.కృష్ణయ్య,జెడ్పీ హెచ్ ఎస్ అశ్వారావుపేట,అచ్యుతాపురం,గుమ్మడి వల్లి ప్రధానోపాధ్యాయులు పి హరిత,ఎన్.కొండలరావు, షాహీ నా బేగం,తాళ్ళపాటి వీరేశ్వరరావు,యూటీఎఫ్ బాధ్యులు నాయకులు కళ్యాణం నాగేశ్వరరావు,రావెళ్ళ రమేష్,ముడివి క్రిష్ణా రావు,మడకం వెంకటేశ్వరావు,కాపుల హరినాథ్ బాబు లు హాజరయ్యారు.