– సమిష్టి పోరాటంతోనే మానవ అక్రమ రవాణ నివారణ సాధ్యం
– సునీతాకృష్ణన్ పోరాటం అభినందనీయ : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) తెలిపారు. సమిష్టి పోరాటంతోనే మానవ అక్రమ రవాణ నివారణ సాధ్యమని నొక్కి చెప్పారు. అన్ని విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో గల ఫ్యాప్సీ భవనంలో ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, తదితరులు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణ తీరును వివరిస్తూ నృత్య ప్రదర్శనలను, షార్ట్‌ఫిలిమ్‌లను ప్రదర్శించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రజ్వల ఫౌండేషన్ చైర్మెన్ సునీతా కృష్ణన్‌ను అభినందించారు. 32 వేల మంది అమ్మాయిలను వ్యభిచారం కూపం నుంచి ఆమె విముక్తి కల్పించారని కొనియాడారు. ఆమె బాటలో అమ్మాయిలు, మహిళల కోసం పనిచేస్తున్న ఆరుగురు ప్రముఖులను సన్మానించడం సంతోషకరమన్నారు. మానవ అక్రమ రవాణా వెనుక పెద్ద ముఠా ఉందని చెప్పారు. ప్రాణాలకు తెగించి ఆ ముఠాపై పోరాటం చేస్తున్నవారి కృషిని కొనియాడారు. సమాజంలో కొందరు దుర్మార్గులు మహిళల శరీరాలతో వ్యాపారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళతో వ్యాపారం చేసి ఆస్తులు కూడ పెట్టే వారికి తల్లి, అక్కజెళ్లెళ్లు లేరా? అని ప్రశ్నించారు. ఇంట్లో మహిళలను పెట్టుకుని, ఇతర మహిళలతో వ్యాపారాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహిళా భద్రత కోసం తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామ న్నారు. మహిళలకు ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా రుణాలను ఇస్తున్నామనీ, వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదని తెలిపారు. మహిళా సంఘం సభ్యులకు రూ.10 లక్షల ప్రమా బీమా, రెండు లక్షల లోన్ బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘం అంటే కేవలం ఆర్థిక స్వావలంబనే కాదనీ, అది మహిళల్లో సామాజిక భద్రతను, మానసిక ధైర్యాన్ని కలిగిస్తోందని అన్నారు.
మహిళా భద్రత కోసం కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES