Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంప్రజ్వల్‌ రేవణ్ణ దోషి

ప్రజ్వల్‌ రేవణ్ణ దోషి

- Advertisement -

– లైంగికదాడి కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు
– జేడీ(ఎస్‌) మాజీ ఎంపీకి న్యాయస్థానంలో షాక్‌
– నేడు శిక్ష ఖరారు చేసే అవకాశం
న్యూఢిల్లీ :
కర్నాటకలోని జనతాదళ్‌ (సెక్యూలర్‌) (జేడీఎస్‌) మాజీ ఎంపీ, భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు న్యాయస్థానంలో షాక్‌ తగిలింది. ఓ లైంగికదాడి కేసులో ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. కేవలం 14 నెలల్లో ఆయనను దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పును వెలువర్చటం గమనార్హం. రేవణ్ణపై ప్రస్తుతం మూడు లైంగికదాడి కేసులు, ఒకటి లైంగికవేధింపుల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మొదటి లైంగికదాడి కేసులో ఆయన దోషిగా తేలారు. ఆయనపై ఉన్న ఇంకా రెండు లైంగికదాడి కేసులు, లైంగిక వేధింపుల కేసులు విచారణలో ఉన్నాయి. ప్రస్తుత కేసులో బాధితురాలు (48).. హస్సన్‌లో రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌజ్‌లో గతంలో పని చేసేది. ఆ సమయంలో రేవణ్ణ ఆమెపై లైంగికదాడికి దిగాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసులో విచారణ జరిపి మాజీ ఎంపీని ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. అయితే ఆయనకు ఇంకా శిక్షను ఖరారు చేయాల్సి ఉన్నది. దీనిపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేడు (శనివారం) ఈ శిక్షను ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది.
‘ఇది బాధితురాలి విజయం’
క్రిమినల్‌ కేసుల్లో మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణ జరిపే బెంగళూరులోని ప్రత్యేక సెషన్స్‌ కోర్టు.. లైంగికదాడి కేసులో రేవణ్ణపై ఈ ఏడాది మే 2న ట్రయల్‌ను ప్రారంభించింది. గతనెల 18న ఈ విచారణ పూర్తయింది. అదే నెల 30కి ఆర్డర్లను రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ సంతోశ్‌ గజానన్‌ భట్‌.. మొబైల్‌ లొకేషన్‌, ఇతర సాంకేతిక ఆధారాల విషయంలో స్పష్టత కోసం శుక్రవారానికి (ఆగస్టు 1) తీర్పును వాయిదా వేశారు. బాధితురాలి తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా సీనియర్‌ అడ్వొకేట్లు అశోక్‌ నాయక్‌, బి.ఎన్‌ జగదీశలు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్‌ 26 మంది సాక్షులను విచారంచిందనీ, 180 డాక్యుమెంట్లను సమర్పించిందని అశోక్‌ నాయక్‌ చెప్పారు. ఇది బాధితురాలి విజయమనీ, సిట్‌ బృందాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. మౌఖిక సాక్ష్యం పైనే కాకుండా డిజిటల్‌, టెక్నికల్‌ ఆధారాలు, డీఎన్‌ఏ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టుల మీద కూడా ఆధారపడినట్టు వివరించారు.
దోషిగా తేల్చిన కీలక ఆధారాలు
రేవణ్ణ లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ గతేడాది ఓ మహిళ.. సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రత్యేక దర్యాప్త బృందం (సిట్‌) ఏర్పాటైంది. 113 మంది సాక్షులను విచారించిన సిట్‌.. 1632 పేజీలతో గతేడాది సెప్టెంబర్‌లో చార్జిషీట్‌ను ఫైల్‌ చేసింది. భారతీయ శిక్షా స్మృతితో పాటు సమాచార సాంకేతిక చట్టంలోను పలు సెక్షన్ల కింద రేవణ్ణపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలిపై రేవణ్ణ 2021లో రెండుసార్లు లైంగికదాడికి దిగాడని చార్జిషీట్‌లో ఆరోపించారు. బాధితురాలిపై మొదటిసారి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఆ సమయంలో వీడియోను రికార్డు చేశాడు. దానిని సిట్‌ స్వాధీనం చేసుకున్నది. ఆ వీడియోలో బాధితురాలు ప్రతిఘటించటం, ఏడవటం చేసినట్టు కనిపించింది. ఫోరెన్సిక్‌ నివేదిక సైతం ఈ వీడియోలో ఉన్నది రేవణ్ణేనంటూ స్పష్టం చేసింది. ప్రజ్వల్‌ డీఎన్‌ఏను కూడా దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో రేవణ్ణను దోషిగా తేల్చటానికి ఇవే కీలక ఆధారాలుగా మారాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
ప్రజ్వల్‌ రేవణ్ణ అనేక మంది మహిళలపై లైంగికదాడులకు, వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది గతేడాది ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో బయటపడి.. కర్నాటకలోనే కాకుండా యావత్‌ దేశాన్ని కూడా తీవ్ర షాక్‌కు గురి చేసిన విషయం విదితమే. ఆ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ, జేడీ(ఎస్‌)లు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. కాగా, ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రేవణ్ణ బెయిల్‌ కోసం బెంగళూరు ప్రత్యేక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా.. ఆయన పిటిషన్లు తిరస్కరణకే గురయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -