డిసెంబర్ వరకు అన్ని యూనిట్లూ పూర్తవ్వాలి : డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
ఒకటో యూనిట్ జాతికి అంకితం
నవతెలంగాణ-దామరచర్ల
డిసెంబర్ వరకు యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లోని అన్ని యూనిట్లనూ పూర్తిచేసి 2026 జనవరి నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన స్టేజ్-1లోని ఒకటో యూనిట్‌ను శుక్రవారం జాతికి అంకితం చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి రూ.970 కోట్లతో వైటీపీఎస్ ఆవరణలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నిర్దేశించిన సమయంలోగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ అందించేందుకు వైటీపీఎస్ అధికారులు ప్రాధాన్యత క్రమంలో పనులను విభజించుకుని పూర్తి చేయాలని ఆదేశించారు. ఏడాది కాలంలోనే స్టేజ్-1లోని రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుత్ అందించడం పట్ల వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆస్పత్రులు నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు. పవర్ ప్లాంట్ ఆవరణలో డీఏవీ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రి, అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు లారీలు, బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా.. యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు సంబంధించి నష్టపరిహారం, భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరైందని, అయితే ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. 93 కిలోమీటర్ల డబుల్ లైన్ రైల్వే పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిధులు రానందున ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడమే కాక క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రవర్‌ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుంచి ఎలాంటి సహకారమూ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి నుంచి వైటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES